వేడెక్కిన ఎమ్మెల్సీ ఎన్నికలు
ABN , First Publish Date - 2023-03-02T00:56:46+05:30 IST
జిల్లాలోని 13 మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే నామినేషన్ దాఖలు, ఉపసంహరణ ఘట్టం పూర్తయి అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చింది.
కొలిక్కి వచ్చిన అభ్యర్థుల జాబితా
13 మండలాల్లో ఊపందుకున్న ప్రచారం
27 పోలింగ్ కేంద్రాల పరిధిలో 28,179 ఓటర్లు
బాపట్ల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 13 మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే నామినేషన్ దాఖలు, ఉపసంహరణ ఘట్టం పూర్తయి అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చింది. అభ్యర్థుల ఇంటింటి ప్రచారం, ఓటర్లకు ఎరవేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. మరో వైపు యంత్రాంగం పోలింగ్ కేంద్రాల పరిశీలన, కోడ్ అమలు లాంటి అంశాలపై దృష్టి పెట్టారు. జిల్లా ఆవిర్భవించాక తొలిసారి ఎన్నికల ప్రక్రియ జరుగుతుండడంతో అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిరంతర సమీక్షలు, పర్యటనలతో బిజిబిజీగా ఉన్నారు. ప్రధాన రాజకీయపార్టీలైన వైసీపీ, టీడీపీలు కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతివ్వడంతో పెద్దల సమరం మరింత రసకందాయంలో పడింది
అభ్యర్థులు వీరే..
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి టీడీపీ అనుబంధ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ బరి, వైసీపీ మద్దతుదారుగా పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, బీజేపీ మద్దతుదారుగా సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి బరిలో ఉన్నారు. వీరు కాకుండా స్వతంత్రులుగా మరో 19 మంది పోటీలో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఏపీటీఎఫ్ తరపున ఎల్సీ రమణారెడ్డి బరిలో ఉండగా ఆయనకు టీడీపీ మద్దతు ప్రకటించింది. పి.చంద్రశేఖరరెడ్డికి వైసీపీ మద్దతిగా ఉంది. మొత్తం 8 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ స్థానానికి స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. రిటర్నింగ్ అధికారిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ వ్యవహరిస్తుండగా, ఉపాధ్యాయ ఎన్నికల నిమిత్తం పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి కోన శశిధర్‌ను నియమించారు.
27 పోలింగ్ కేంద్రాల పరిధిలో 26,390 మంది...
ఉమ్మడి ప్రకాశం నుంచి విడివడి బాపట్ల జిల్లాలో భాగమైన 13 మండలాల్లోని గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొననున్నారు. 13 మండలాల్లో పట్టభద్రుల ఓటర్లు 26,390 మంది ఉండగా వారిలో పురుషులు 17,626, మహిళలు 8763 కాగా ట్రాన్స్‌జెండర్ ఒకరు ఉన్నారు. మార్చి 13న జరగనున్న పోలింగ్‌లో 27 పోలింగ్ కేంద్రాల పరిధిలో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అత్యధికంగా చీరాల పరిధిలో 6 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 13 మండలాల పరిధిలో 1789 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1094 మంది పురుషులు కాగా, 695 మంది మహిళా టీచర్లు ఉన్నారు. 13 పోలింగ్ స్టేషన్లను ఇందుకోసం గుర్తించారు. ఎమ్మెల్సీ స్థానాల బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములలో పురుష ఓటర్లే కీలకంగా మారనున్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఇప్పటి నుంచే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం
ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్, ఎస్పీ
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా నిర్వహించాలని చెప్పారు. 13న పోలింగ్ నిర్వహించడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 5వ తేదీలోగా స్లిప్స్‌ను ఓటర్లకు పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ డాక్టర్ కె.శ్రీనివాసులు, ఏఎస్పీ పి.మహేష్, డీఆర్వో కె.లక్ష్మీశివజ్యోతి, పీడీలు డాక్టర్ బి.అర్జునరావు, వై.శంకర్‌నాయక్, డీఎంహెచ్‌వో డాక్టర్ విజయమ్మ, ఆర్డీవోలు గంధం రవీందర్, సరోజని, డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, పి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు పోలీసు అధికారులందరు ఎలక్షన్‌కోడ్ నిబంధనలు అనుసరించి పనిచేయాలని ఆదేశించారు. చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు పెంచాలన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలలో గతంలో పాల్గొన్న వారిని గుర్తించి మందస్తు బైండోవర్ చేసి తహసీల్దార్ ముందు హాజరు పర్చాలన్నారు. చీరాలలోని స్ర్టాంగ్‌రూమ్‌ల వద్ద ప్రత్యేక గార్డు ఏర్పాటు చేసి స్థానిక అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు ఎ.శ్రీనివాసరావు, పి.శ్రీకాంత్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకముందు ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కె.విజయకృష్ణన్‌తో సమీక్షించారు. జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్ల కోసం 27, ఉపాధ్యాయ ఓటర్లకోసం 13 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మీనాకు తెలిపారు. మొత్తం 28,179మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గన్‌లైసెన్స్ పొందిన 22 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిరంతరం నిఘా బృందాలు కొనసాగుతాయన్నారు.