మండలికి ముగ్గురు

ABN , First Publish Date - 2023-02-21T00:10:18+05:30 IST

వైసీపీ 18 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో పల్నాడు జిల్లా నుంచి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌, గుంటూరు జిల్లా నుంచి మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, బాపట్ల జిల్లా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పోతుల సునీతకు స్థానం దక్కింది.

మండలికి ముగ్గురు

చిలకలూరిపేట, ఫిబ్రవరి 20: వైసీపీ 18 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో పల్నాడు జిల్లా నుంచి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌, గుంటూరు జిల్లా నుంచి మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, బాపట్ల జిల్లా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పోతుల సునీతకు స్థానం దక్కింది.

సీనియర్‌ వైసీపీ నాయకులు, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ పేరును ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల జాబితాలో ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 2019లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌ చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభలో రాజశేఖర్‌కు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని కూడా ఇస్తానని ప్రకటించారు. అయితే ఎప్పటికప్పుడు రాజశేఖర్‌కు మొండిచేయి చూపుతూ వస్తుండటంతో ఆయన అనుచరులు, అభిమానులు నిరాశ చెందుతూ వచ్చారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌గా ఆయనకు పదవిని ఇచ్చారు. మూడుసార్లు చిలకలూరిపేట నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమేపల్లి సాంబయ్య అల్లుడు రాజశేఖర్‌. న్యాయవాది వృత్తి నుంచి సోమేపల్లి రాజకీయ వారసునిగా రాజశేఖర్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే 2004లో అనూహ్యంగా రాజశేఖర్‌కు కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ నిరాకరించింది. ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీలోకి దిగి 212 ఓట్ల ఆధిక్యతతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు తెలిసిన వెంటనే రాజశేఖర్‌ తాడేపల్లికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారిపై బోయపాలెం వద్ద ఆగి పార్వతి దేవాలయంలో పూజలు చేశారు. బోయపాలెం వద్ద ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని ఆయన ఇంటి వద్దకు చేరుకొని బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు.

పోతుల సునీతకు మరోసారి..

చీరాల, ఫిబ్రవరి 20: సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పోతుల సునీతకు తిరిగి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా స్థానం దక్కింది. దీంతో ఆమె ఎమ్మెల్సీ కావటం అనేది లాంఛనప్రాయం మాత్రమే. ఈ క్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ సీఎం జగన్‌కు, పార్టీలోను, ప్రభుత్వపరంగాను తనను ప్రోత్సహిస్తున్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆమె సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు.

శాసన మండలికి చంద్రగిరి

గుంటూరు, ఫిబ్రవరి 20: మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం శాసన మండలి సభ్యునిగా త్వరలో చట్టసభలోకి అడుగుపెట్టనున్నారు. సామాజిక సమీకరణల్లో భాగంగా వడ్డెర సామాజికవర్గానికి చెందిన ఏసురత్నాన్ని ఎమ్మెల్యే కోటాలో ఎన్నికకు వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. పోలీసుశాఖలో డీఐజీ పదవికి వీఆర్‌ తీసుకున్న ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అనంతరం పార్టీ పశ్చిమ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న ఆయనకు మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. ఈ సందర్భంగా ఏసురత్నం మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక చట్టసభల్లో వడ్డెర సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేదని, నేడు సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆ అవకాశం కల్పించటం చరిత్రాత్మకమన్నారు.

Updated Date - 2023-02-21T00:10:21+05:30 IST