అస్సాంబ్లీ లో అబద్ధాలు

ABN , First Publish Date - 2023-09-22T03:40:51+05:30 IST

పథకాల అమలు లెక్కల గురించి వేదికలపైనే కాదు అసెంబ్లీలో కూడా జగన్‌ సర్కారు అబద్ధాలు చెబుతోంది. విదేశీ విద్య పథకంపై టీడీపీ సభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి,

అస్సాంబ్లీ లో అబద్ధాలు

2019లో ఈ పథకానికి స్వస్తి

ఇంటర్య్వూలు నిర్వహించాక నిలిపివేత

ఆ ఏడాది ఒక్కరికి కూడా ఇవ్వకపోయినా 1,473 మందికి లబ్ధి చేకూర్చారట

అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పథకాల అమలు లెక్కల గురించి వేదికలపైనే కాదు అసెంబ్లీలో కూడా జగన్‌ సర్కారు అబద్ధాలు చెబుతోంది. విదేశీ విద్య పథకంపై టీడీపీ సభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి, అశోక్‌ బెందాలం, అనగాని సత్యప్రసాద్‌ తదితరులు అడిగిన ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ తప్పుడు సమాచారం ఇచ్చింది. 2019లో ఈ పథకం అమలు చేయకున్నా విద్యార్థులకు అందించినట్టు వెల్లడించింది. 2019 నుంచి కార్పొరేషన్‌, సంవత్సరాల వారీగా ఈ పథకం కింద లబ్ధిపొందిన వారి వివరాలు అందించాలని టీడీపీ ఎమ్మెల్యేలు కోరగా.. రాతపూర్వకంగా అందించింది. 2019 మేలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చింది. అప్పటికే టీడీపీ ప్రభుత్వం విదేశీ విద్యకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానించింది. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే ఆ ఏడాది ఒక్కరికి కూడా విదేశీ విద్య మంజూరు చేయలేదు. అయినా 2019-20లో 1473 మందికి విదేశీ విద్య అందించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ అసెంబ్లీకి తప్పుడు సమాచారం ఇచ్చింది. అప్పట్లో నిర్వహించిన ఇంటర్వ్యూల జాబితా వివరాలూ వెల్లడించింది. బీసీ విద్యార్థులు 186 మంది, ఈబీసీ విద్యార్థులు 645 మంది, కాపులు 263 మంది, ఎస్సీలు 163 మంది, ఎస్టీలు 23 మంది, మైనారిటీలు 193 మందికి ఆయా కార్పొరేషన్ల ద్వారా అందించినట్లు తెలిపింది. 2020-21, 21-22లో కూడా ఈ పథకం ఊసే లేదు. తీవ్ర విమర్శలు రావడంతో 2022-23 చివరిలో జగనన్న విదేశీ విద్య పేరుతో పథకం ప్రారంభించి సవాలక్ష నిబంధనలు పెట్టింది. మొదటి విడతలో 2022-23కి గాను 290 మంది, రెండో విడతలో 2023-24కి గాను 67 మంది మాత్రమే అర్హత సాధించారు. మొదటి విడతలో ఒక్క ఎస్టీ విద్యార్థికి కూడా ప్రయోజనం కలగలేదు. వైసీపీ ప్రభుత్వంలో విదేశీ విద్య పథకం కింద మొత్తం 357 మందికి మాత్రమే ప్రయోజనం కల్పించారు. అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలకు తప్పుడు సమాచారం ఇస్తే... ఇక సామాన్య ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చే సమాచారం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - 2023-09-22T03:40:51+05:30 IST