గౌరవంగా వెళ్లిపోండి!
ABN , First Publish Date - 2023-03-25T03:13:30+05:30 IST
అసెంబ్లీలో గీత దాటితే ఆటోమెటిక్‌గా సస్పెండ్ అయినట్లే.. గౌరవంగా బయటికి వెళ్లిపోండి..’ అంటూ ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుంచి బయటికి పంపారు.

జీవో 1 రద్దుపై టీడీపీ వాయిదా తీర్మానం.. సభలో నిరసన.. సస్పెన్షన్
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘జీవో నంబర్ 1 రద్దు కోసం వాయిదా తీర్మానానికి పట్టుబట్టిన టీడీపీ సభ్యుల డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. ప్రశ్నోత్తరాలు కొనసాగిస్తూ ప్రతిపక్ష డిమాండ్‌ను పట్టించుకోలేదు. కాసేపు నినదించిన టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా గీత దాటొద్దంటూ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే సమస్య గురించి మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్... అంటూ ముందడుగు వేసిన 11మంది ప్రతిపక్ష సభ్యుల్ని బడ్జెట్ సమావేశాల చివరి రోజు అసెంబ్లీ నుంచి స్పీకర్ బహిష్కరించారు. వెంటనే మార్షల్స్ రంగ ప్రవేశం చేయడంతో.. ‘ప్రజాస్వామ్య హంతకులకు దేవుడు స్ర్కిప్ట్ రాశాడు’ అంటూ ప్రతిపక్షం నినాదాలు చేస్తూ చివరిరోజు నిష్క్రమించింది. కాగా, టీడీపీ సభ్యులు సస్పెండ్ అయినందున వాళ్లు అడిగిన ప్రశ్నలపై సభలో చర్చ జరగలేదు. ఆలయాల్లో భక్తుల్ని ఆశీర్వదించాల్సిన అర్చకులు ఆకలితో ఉండాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని వైసీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, అవంతి శ్రీనివాస్ తదితరులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని ఆలయాల్లోనూ పూజలు నిర్వహించేలా ప్రభుత్వం చూడాలని కోరారు. దీప, దూప, నైవేద్యం మరిన్ని ఆలయాలకు విస్తరింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం బాగా విస్తరింపజేస్తోందని మంత్రి కొట్టు సత్యనారాయణ బదులిచ్చారు. నిరుపేద జాలర్లను గత ప్రభుత్వం తరహాలో ఆదుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే సతీష్ కోరారు.