భూకేటాయింపు రికార్డులు కోర్టు ముందుంచండి
ABN , First Publish Date - 2023-03-02T03:35:12+05:30 IST
విశాఖ జిల్లా ఎండాడ గ్రామ పరిధిలోని హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు భూకేటాయింపునకు సంబంధించి ఒరిజనల్ రికార్డులతోపాటు ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు లేఅవుట్ వివరాలను న్యాయస్థానం ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.
ప్రాజెక్టు లే అవుట్ కూడా సమర్పించండి
‘హయగ్రీవ’ కేసులో జీవీఎంసీకి హైకోర్టు ఆదేశం
కోర్టుకు హాజరైన జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా ఎండాడ గ్రామ పరిధిలోని హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు భూకేటాయింపునకు సంబంధించి ఒరిజనల్ రికార్డులతోపాటు ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు లేఅవుట్ వివరాలను న్యాయస్థానం ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రాజెక్టులోని ఫ్లాట్లను థర్డ్‌పార్టీకి విక్రయిస్తే అవి కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఆర్.రఘునందనరావు బుధవారం ఆదేశాలిచ్చారు. ఎండాడ గ్రామంలోని సర్వే నం.92/3లో హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్‌కు కేటాయించిన 12.50 ఎకరాలను వెనక్కి తీసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ పీఎల్‌వీఎన్ మూర్తి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఇటీవల విచారణకు రాగా కౌంటర్ దాఖలు చేయకపోవడంతోపాటు న్యాయవాది మాధవరెడ్డి స్థానంలో మరో న్యాయవాది హాజరుకావడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు తమ ముందు హాజరుకావాలని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్‌ను ఆదేశించింది. బుధవారం వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు న్యాయస్థానం ముందు హాజరయ్యారు. సమాచార లోపం కారణంగా న్యాయవాది మాధవరెడ్డి స్థానంలో మరో న్యాయవాది హాజరయ్యారని వివరించారు. మరోసారి న్యాయస్థానానికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
జీవీఎంసీ తరఫున మాధవరెడ్డి వాదనలు వినిపిస్తూ వ్యాజ్యాలలో కౌంటర్ వేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుపుతుండడంతో నిర్మాణాలు నిలిపివేయాలని హయగ్రీవకు ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఉత్తర్వులు ఇచ్చామన్నారు. వాటిపై సింగిల్ జడ్జి స్టే విధించారని తెలిపారు. హయగ్రీవ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లతోపాటు జీవీఎంసీ అధికారులు ప్రాజెక్టు ముందుకెళ్లకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. జనసేన కార్పొరేటర్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ హయగ్రీవ సంస్థ ఉల్లంఘనలకు పాల్పడినందున భూమిని వెనక్కి తీసుకోవాలని కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పల్లా శ్రీనివాసరావు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అనాథాశ్రమం, వృద్ధాశ్రమం పేరుతో హయగ్రీవ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. నిర్మాణ సంస్థ ప్లాట్లపై థర్డ్‌పార్టీకి హక్కులు కల్పిస్తోందన్నారు. రిజిస్ట్రేషన్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఈ వాదనలు పరిగణ లోకి తీసుకున్న ధర్మాసనం ప్రాజెక్టులోని ఫ్లాట్లను థర్డ్‌పార్టీకి అమ్మితే.. అవి కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. హయగ్రీవ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒరిజనల్ రికార్డుతోపాటు ప్రాజెక్ట్ లేఅవుట్‌ను న్యాయస్థానం ముందు ఉంచాలని ఆదేశించింది.