అవ్వాతాతలకు ‘కంటివెలుగు’ స్ర్కీనింగ్‌

ABN , First Publish Date - 2023-03-14T03:23:27+05:30 IST

కంటి వెలుగులో భాగంగా మిగిలిన 35 లక్షల మంది అవ్వాతాతలకు వెంటనే స్ర్కీనింగ్‌ (కంటి వైద్యపరీక్షలు) ప్రారంభించాలని ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని అధికారులను ఆదేశించారు.

అవ్వాతాతలకు ‘కంటివెలుగు’ స్ర్కీనింగ్‌

మూడో విడత వెంటనే ప్రారంభించాలి: మంత్రి రజిని

అమరావతి, పెదకాకాని, మార్చి 13(ఆంధ్రజ్యోతి): కంటి వెలుగులో భాగంగా మిగిలిన 35 లక్షల మంది అవ్వాతాతలకు వెంటనే స్ర్కీనింగ్‌ (కంటి వైద్యపరీక్షలు) ప్రారంభించాలని ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని అధికారులను ఆదేశించారు. సోమవారం మంగళగిరిలో ఏపీఐఐసీ భవనంలో ఆరోగ్యశాఖ పథకాల తీరుతెన్నులపై అధికారులతో ఆమె సమీక్షించారు. కంటి వెలుగు మూడో విడతలో భాగంగా 35,42,151 మందికి స్ర్కీనింగ్‌ కోసం సిద్ధం చేసిన 376 బృందాలను గ్రామాల్లోకి పంపించాలన్నారు. ఆరు నెలల్లో వృద్ధులందరికీ స్ర్కీనింగ్‌ పూర్తి చేసి, అవసరమైన వారికి సర్జరీలు చేయాలని, మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని సూచించారు. కంటి వెలుగు జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టు భర్తీకి ఆదేశించారు. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్‌ జె.నివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌ 6 నుంచి వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు

రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 6 నుంచి డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, హెల్త్‌ వెలెనెస్‌ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఆచార్య నాగార్జున వర్సిటీలో ‘ట్రైనర్స్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10,231 మంది స్టాఫ్‌ నర్సులను నియమించామని, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా రోగులకు 105 రకాల మందులను అందించనున్నట్టు తెలిపారు. ప్రతి జిల్లా నుంచి నలుగురు డాక్టర్ల చొప్పున 104 మంది మాస్టర్స్‌ ట్రైనర్స్‌ ద్వారా వైద్య సిబ్బందికి శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశాఖ కమిషనర్‌ నివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-14T03:23:27+05:30 IST