Share News

Jagan : డ్వాక్రా మహిళల సొమ్ముతో సర్కారు సోకులు!

ABN , First Publish Date - 2023-10-30T02:36:25+05:30 IST

ప్రభుత్వ కార్యక్రమానికి ప్రభుత్వమే డ్వాక్రా మహిళలను తరలిస్తున్నందున ప్రభుత్వమే వారి ఖర్చు భరిస్తోందని అనుకుంటున్నారా? అయితే..

Jagan :  డ్వాక్రా మహిళల సొమ్ముతో సర్కారు సోకులు!

డ్వాక్రాను దివాలా తీయిస్తున్న జగన్‌ సర్కార్‌

బటన్‌ నొక్కుడు సభలకు బలవంతంగా తరలింపు

ఆర్టీసీ బస్సులు మాత్రమే ప్రభుత్వానివి

భోజనాలు, ఇతర ఖర్చు డ్వాక్రా సంఘాలదే

తాజాగా మంత్రుల సభలకూ ఆ మహిళలే

నాడు ముందుచూపుతో చంద్రబాబు చర్యలు

ఒక్కో మండల సమాఖ్యకు రూ.60 లక్షల నిధి

ఆ సొమ్ముతోనే స్వయం సహాయకంగా ‘వెలుగు’

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వైఎస్‌ తొలి దెబ్బ

నేడు సభల పేరుతో జగన్‌ మరో దెబ్బ

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి ‘బటన్‌ నొక్కుడు’ కార్యక్రమమా?

... డ్వాక్రా మహిళలు

రావాల్సిందే! ముఖ్యమంత్రి మరేదైనా సభలో పాల్గొంటున్నారా?

... డ్వాక్రా మహిళలు

రావాల్సిందే! తాజాగా, వైసీపీ నేతలు ‘సామాజిక సాధికార యాత్ర’లు చేస్తున్నారు కదా!

... వాటికి కూడా డ్వాక్రా మహిళలు రావాల్సిందే!

ప్రభుత్వ కార్యక్రమానికి ప్రభుత్వమే డ్వాక్రా మహిళలను తరలిస్తున్నందున ప్రభుత్వమే వారి ఖర్చు భరిస్తోందని అనుకుంటున్నారా? అయితే... మీరు తప్పులో కాలేసినట్లే! కార్యక్రమం ప్రభుత్వానిది! ఖర్చు.. డ్వాక్రా సంఘాలది! ఇది అక్షరాలా నిజం! ఇలా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఖర్చు పెట్టీ పెట్టీ డ్వాక్రా సంఘాల నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ‘డ్వాక్రా’ సంఘాలను ఎంతగానో ఉద్ధరిస్తున్నాం అని జగన్‌ సర్కారు డబ్బా కొట్టుకుంటోంది. నిజానికి... మహిళా సంఘాలకు ప్రభుత్వం నేరుగా ఒక్క రూపాయి ఇచ్చి ఆదుకోలేదు. అండగా నిలబడలేదు. పైగా... ఎప్పుడో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక్కో మండల సమాఖ్యకు రూ.60 లక్షల చొప్పున ఇచ్చిన నిధులను ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఖర్చు చేయిస్తోంది. ఫలితంగా... డ్వాక్రా సంఘాలు దివాలా అంచున నిలిచాయి.

బాబు హయాంలో బాసట...

పొదుపు సంఘాలను బలోపేతం చేసింది... వాటికి బాసటగా నిలిచింది చంద్రబాబే. తొలిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడే మహిళల ఆర్థిక స్వావలంబనపై దృష్టి సారించారు. ఒక్కో మహిళ రోజుకు రూపాయి చొప్పున నెలకు రూ.30 జమచేస్తూ పోతే... ఆ సంఘాలకు సత్వరం ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం లేదని... చిన్న మొత్తాల నుంచి రుణాలు తీసుకునే వీలూ ఉండదని గ్రహించారు. అందుకే... ‘వెలుగు’ పథకం ప్రారంభించినప్పుడే ప్రతి మండల సమాఖ్యకు రూ.60 లక్షల కమ్యూనిటీ ఇన్వె్‌స్టఫండ్‌ నిధులు జమచేశారు. మొత్తం రూ.400 కోట్లను డ్వాక్రా సంఘాలకు అందించారు. ఈ మొత్తాన్ని డ్వాక్రా గ్రూపులకు రుణాలిచ్చి... వాటిపై వడ్డీ ద్వారా వచ్చే మొత్తాన్ని మండల వెలుగు ఆఫీసుల నిర్వహణ కోసం వినియోగించాలని ఆదేశించారు. వెలుగు కార్యాలయంలో పనిచేసే అకౌంటెంట్‌, స్వీపర్‌కు జీతాలతోపాటు విద్యుత్‌ చార్జీలు, నిర్వహణ వ్యయానికి ఈ మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. కార్యాలయాల నిర్వహణ కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండాపోయింది. ఒక్కసారిగా రూ.400 కోట్లు అందడంతో... రుణాలు తీసుకునేందుకు అవకాశం లభించింది. ఒకవైపు పొదుపు, మరోవైపు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంతో డ్వాక్రా సంఘాలు ‘స్వయం సహాయకం’గా నిలిచాయి.

ఇప్పుడు అంతా రివర్స్‌...

జగన్‌ సర్కారు కానీ, అంతకుముందు వైఎస్‌ హయాంలోకానీ డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం నుంచి అందిన ఆర్థిక సహాయం దాదాపు సున్నా! పైగా... వాటిని నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు జరుగుతున్నది మరింత ఘోరం! జగన్‌ బటన్‌ నొక్కుడు సభలకు డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను మాత్రమే ప్రభుత్వం సమకూరుస్తోంది. డ్వాక్రా సభ్యులకు అందించే టిఫిన్‌, కూల్‌డ్రింక్స్‌, వాటర్‌ బాటిల్‌, భోజనం ఖర్చులన్నీ మండల సమాఖ్యలే భరిస్తున్నాయి. దీంతో అప్పటి సీఐఎఫ్‌ నిధి సగానికి పైగా కరిగిపోయింది. ఇప్పుడు కొన్ని మండల సమాఖ్యల్లో 70 శాతం నిధులు కూడా లేవు. మంత్రులు, వైసీపీ నేతల సభలకూ ఖర్చు... మండల సమాఖ్యలదే! చేయాల్సిందంతా చేసి... ఇప్పుడు కమ్యూనిటీ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌(సీఐఎఫ్‌) నిధుల లెక్క తీయాలంటూ ప్రభుత్వం ఆదేశాలివ్వడం గమనార్హం. సీఎం సభలకు తరలించేందుకు నిధులను వాడుకోవాలని చెప్పి, ఇప్పుడు లెక్కలు తీయమని చెప్పడమేంటని మండిపడుతున్నారు.

వైఎస్‌ హయాంలో ఇలా...

2004లో వైఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఇది ప్రభుత్వ పథకం. ప్రభుత్వమే సహాయంచేయాలి. కానీ... డ్వాక్రా గ్రూపు సభ్యులు ఇళ్లు కట్టుకునేందుకు సీఐఎఫ్‌ నుంచి రుణాలందించాలని వైఎస్‌ సర్కారు ఆదేశించింది. దీంతో మండల సమాఖ్యల నుంచి సభ్యులకు సీఐఎఫ్‌ నిధులతో ఇందిరమ్మ ఇళ్లకోసం రుణాలు ఇచ్చారు. ఆ ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించకపోవడంతో డ్వాక్రా సభ్యులు కూడా ఈ రుణాలను మండల సమాఖ్యలకు తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో సీఐఎఫ్‌ నిధులు చాలా వరకు తిరిగి మండల సమాఖ్య ఖాతాలకు జమ కాలేదు. కాగా, కరోనా సమయంలో సెర్ప్‌ అధికారులు మాస్క్‌లు పంపిణీ చేశారు. వీటికి సుమారు రూ.20 కోట్ల సీఐఎఫ్‌ నిధులను వాడుకున్నారు. ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదు. సిబ్బందికి శానిటైజర్‌ బాటిల్స్‌ సరఫరాకూ నిధులివ్వలేదు. గ్రామాల్లో డ్వాక్రా గ్రూపుల సహకారంతో క్వారంటైన్‌ కేంద్రాలు నిర్వహించారు. ఇందులో దేనికీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. అప్పట్లో చంద్రబాబు ముందు చూపుతో ఏర్పాటుచేసిన ఈ నిధిని కొంత వైఎస్‌ సర్కార్‌ కరిగిస్తే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మరి కొంత కరగదీస్తోంది.

Updated Date - 2023-10-30T02:36:42+05:30 IST