Jagan : జనంలోకి పోలేం..?
ABN , First Publish Date - 2023-09-22T03:52:05+05:30 IST
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి లేదు. పనులకు పైసా విడుదల చేయలేదు. దీంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ చేపట్టేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు నానా అగచాట్లు పడ్డారు.
ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల జంకు.. 1 నుంచి పల్లెబాటకు వెళ్లాలని జగన్ నిర్దేశం
నిధులివ్వకుండా.. అభివృద్ధి చేయకుండా ఎలా వెళ్తారని వైసీపీ ఎమ్మెల్యేల అసహనం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి లేదు. పనులకు పైసా విడుదల చేయలేదు. దీంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ చేపట్టేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు నానా అగచాట్లు పడ్డారు. ఎక్కడికక్కడ జనం నుంచి నిలదీతలు, నిరసనలు ఎదురయ్యాయి. ఈ కార్యక్రమం అనుకున్న రీతిలో విజయవంతం కాకపోవడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అక్టోబరు 1 నుంచి పల్లెబాటకు పంపాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే అధికారాల్లేకుండా.. నిధులే లేకుండా సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు విలవిల్లాడుతున్నారని.. పైగా సర్పంచుల ఖాతాల్లోని సొమ్మునంతా ప్రభుత్వమే ఊడ్చేసిందని.. ఊళ్లలో ఒక్క పని కూడా చేపట్టే పరిస్థితుల్లో లేరని.. ఇప్పుడు పల్లెబాటకు వెళ్లాలని ఒత్తిడి తెస్తే ఎలా వెళ్తారని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నా ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణుల్లో ఆ సందడి కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ సర్కారుపై ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతోందని సొంత సర్వేలే చెబుతున్నాయంటున్న తరుణంలో.. మళ్లీ ఎన్నికల బరిలోకి దిగాలన్న ఆసక్తి చాలా మంది పాలకపక్ష ఎమ్మెల్యేల్లో ఆసక్తి పెద్దగా కనిపించడం లేదన్న ప్రచారం నడుస్తోంది. ‘గడప గడప’ హాజరు ఆధారంగా ఎమ్మెల్యేల గ్రాఫ్ బేరీజు వేసి టికెట్లు ఇస్తానని జగన్ గంభీరంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం గత నెలాఖరుతో ముగిసింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉంటారు కాబట్టి ‘గడప గడప’పై వర్క్‌షాపు పెడతారేమోనని వారంతా భావించారు. ఇంతవరకు సమాచారం లేదు. కానీ సమావేశాలు ముగిసే 27వ తేదీ లోపు ఏదో ఒక సాయంత్రం తమతో భేటీ అయి.. జగనన్న సురక్ష, పల్లెబాట పేరిట స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా అక్టోబరు 1 నుంచి జనంలోనికి వెళ్లాలంటూ జగన్ ఆదేశించే అవకాశం ఉందని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
ఎలాగో మమ..
నిరసనలు, వ్యతిరేకతల నడుమ ‘గడప గడప’కు కార్యక్రమానికి వెళ్లి వైసీపీ శాసనసభ్యులు ముక్కుతూ ములుగుతూ మమ అనిపించుకున్నారు. ఊళ్లకు వెళ్లి.. వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రచురించిన కరపత్రాలను లబ్ధిదారులకు ఇచ్చి వచ్చేశారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి నిలదీస్తుంటే జవాబివ్వలేక నీళ్లు నమిలారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి ఇస్తున్న డబ్బుల కంటే.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, ఉపాధి కరువుతో పడుతున్న పాట్లను నిలదీస్తుంటే సమాఽధానం చెప్పలేక ముఖం చాడేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ఈ కార్యక్రమం గత నెలాఖరుతో ముగిసింది. ఇది ముగిశాక ఈ నెల 17వ తేదీన దీనిపై వర్క్‌షాప్ నిర్వహిస్తానని ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.. వారి గ్రాఫ్‌ను వెల్లడిస్తానన్నారు. పనితీరు బాగాలేని వారికి ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదనీ తేల్చిచెప్పారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిపోతుండడం.. చంద్రబాబు అరెస్టు దరిమిలా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుండడం.. జగన్ గ్రాఫ్ నానాటికి పడిపోతుండడంతో.. ‘గడప గడప’ సర్వే ఫలితాలను ప్రకటించేందుకు సీఎం జంకుతున్నారని వైసీపీ ప్రజాప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫలితాలు వెల్లడించకపోవచ్చని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ తరఫున గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులను పల్లెబాటకు పంపాలనుకోవడంపై ఆక్షేపణ తెలియజేస్తున్నారు.నాలుగున్నరేళ్లుగా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా.. అభివృద్ధి పనులు చేపట్టకుండా నేరుగా జనంలోకి వెళ్లడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎంపీపీ, జడ్పీ సమావేశాల్లో పలువురు సభ్యులు తామెందుకు గెలిచామో తెలియడం లేదని.. ప్రజలు అభివృద్ధిపై నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నామంటూ వాపోతున్నారని.. సచివాలయ వ్యవస్థను తెచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని సీఎంపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.