APIIC : ఏపీఐఐసీలో భూదందా!?

ABN , First Publish Date - 2023-08-27T02:22:19+05:30 IST

భారీ ఉత్పత్తులు, వేలసంఖ్యలో ఉద్యోగాలు కల్పించే పెద్దపెద్ద పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయిస్తే ఎవరూ కాదనరు.

APIIC : ఏపీఐఐసీలో భూదందా!?

గోరంత కంపెనీలకు కొండంత భూములు

భారీ ఉత్పత్తులు, వేలసంఖ్యలో ఉద్యోగాలు కల్పించే పెద్దపెద్ద పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయిస్తే ఎవరూ కాదనరు. కానీ ఒక గోదాం కట్టుకుంటాం.. ఇథనాల్‌ ప్లాంట్‌ పెట్టుకుంటాం.. చికెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పుకుంటాం.. అంటూ చిన్నచిన్న పరిశ్రమల ఏర్పాటుకు పెద్దఎత్తున భూములు కావాలంటూ వచ్చిన దరఖాస్తులను ఏపీఐఐసీ స్వీకరించమే ఒక విడ్డూరం. పైగా, ఇలాంటి పరిశ్రమలు పెడతామంటూ వచ్చిన అనామక కంపెనీలకు ఇండస్ట్రియల్‌ పార్కుల్లో రూ.వేల కోట్ల విలువ చేసే భూములను కేటాయుంచడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

జస్ట్‌ లక్షతో రెడీ..

రూ.లక్ష షేర్‌ కేపిటల్‌ కలిగిన చండీగఢ్‌ కంపెనీకి కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో రూ. 30 కోట్ల విలువ చేసే 36.80 ఎకరాలను కేటాయించారు. ఇంతా చేసి.. ఆ కంపెనీ ఇథనాల్‌ ప్లాంటు పెట్టి 261 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందట!

75 కోట్ల భూమి.. 200 ఉద్యోగాలు

రూ. 15 లక్షలు షేర్‌ కేపిటల్‌తో గోదాం కడతామని ముందుకొచ్చిన ముంబై కంపెనీకి రూ. 75 కోట్ల విలువ చేసే 24.36 ఎకరాలను విశాఖ గుర్రంపాలెం ఇండస్ర్టియల్‌ పార్కులో కేటాయించారు. గోదాం కట్టడం పూర్తయితే 200 మందికి ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

విశాఖలో గోదాం కట్టడానికి 24.36 ఎకరాలు

మల్లవల్లిలో చండీగఢ్‌ కంపెనీకి 36.80 ఎకరాలు

చిత్తూరులో చికెన్‌ ప్రాసెసింగ్‌కు 30.75 ఎకరాలు

డొల్ల కంపెనీలకు రూ.వేల కోట్ల స్థలాలు

ఏడాది వయస్సూ లేని కంపెనీలకు ఆహ్వానం

దరఖాస్తులో చాలావరకు చిన్న పరిశ్రమలే

మొత్తం 44 కంపెనీలకు 352.79 ఎకరాలు

దాదాపుగా అన్నీ అనామక కంపెనీలే

వాటికి విలువైన భూములు ధారాదత్తం

వాటి పెట్టుబడి కంటే భూమి రేటే అధికం

చక్రం తిప్పిన డిప్యుటేషన్‌ అధికారి!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) రాష్ట్రవ్యాప్తంగా రూ.వేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములను అర్హతలేని డొల్ల కంపెనీలకు ధారాదత్తం చేసేసింది. గత మే 11 నుంచి జూలై 6 మధ్య కాలంలో మొత్తం 44 కంపెనీలకు 352.79 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయిస్తూ ఏపీఐఐసీ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర పరిశ్రమలశాఖ ఆమోదిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఒక నెల, రెండు నెలలు, మూడు నెలల క్రితం ఏర్పాటై.. ఇంత వరకు ఒక్క వార్షిక సమావేశం కూడా నిర్వహించని, లాభనష్టాల నివేదికలేవీ సమర్పించని కంపెనీలకు కూడా ఎంతో విలువైన ప్రభుత్వ భూములను పెద్ద మొత్తంలో కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది. ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వ భూములు పొందిన వాటిలో ఎక్కువ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పెద్దలు, కొంతమంది అధికార పార్టీ నేతలకు బీనామీలుగా ఉన్న సూట్‌కేసు కంపెనీలేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీఐఐసీలో కొంతమంది అవినీతి అఽధికారులను అడ్డం పెట్టుకుని అనామక కంపెనీల పేర్లతో విలువైన ప్రభుత్వ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు అధికార పార్టీ నేతలే పక్కా ప్రణాళికను రూపొందించి అమలు చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల వ్యూహంలో పడిన అధికారులు కంపెనీలకు సర్కారీ భూములను కట్టబెట్టేశారు. ’తిలాపాపం తలాపిడికెడు’ అన్న చందంగా ఈ వ్యవహారంలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరూ భాగస్వాములయినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయు. రాష్ట్రంలోని ఒక కార్పొరేషన్‌ సంస్థ నుంచి డిప్యుటేషన్‌పై ఏపీఐఐసీకి వచ్చిన ఒక అధికారి కీలక పాత్ర పోషిస్తూ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖలో జోరుగా చర్చ నడుస్తోంది. ఉదాహరణకు కొన్ని భూ కేటాయింపులను పరిశీలిస్తే అవి ఎంత ఘనమైనవో తెలిసిపోతుంది.

ఎందుకింత గోప్యత?

కృష్ణా జిల్లా మల్లవల్లి మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం చండీగఢ్‌కు చెందిన ఆల్కోవేవ్‌ ఇఽథనాల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఏకంగా 36.80 ఎకరాల భూమిని కేటాయించారు. గత ఏడాది మే 20న రిజిష్టరైన ఈ కంపెనీ ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, చండీగఢ్‌ రాష్ర్టాల్లో విత్తనాల ఉత్పత్తితోపాటు డిస్టిలరీలనూ నడుపుతుందట! అలాగైతే ఈ కంపెనీ రూ. కోట్లలో పెట్టుబడులు పెట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందనే అనుకుంటారు ఎవరైనా!.. కానీ ఈ కంపెనీ ఆథరైజ్డ్‌ షేర్‌ క్యాపిటల్‌ కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే. ఈ కంపెనీకి డైరెక్టర్లుగా జితేందర్‌ అరోరా, అమిత్‌కుమార్‌ మోదీ అండ్‌ అదర్స్‌ అని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు మల్లవల్లి మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో ఒక చదరపు మీటరు రూ. 500 చొప్పున ఒక ఎకరం భూమిని రూ. 8 లక్షలకే కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి ఇండస్ట్రియల్‌ పార్కులో ఎకరం భూమి ధర రూ. 80 లక్షలకు పెంచింది. అంటే ఇక్కడ ఆల్కోవేవ్‌ ఇథనాల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి కేటాయించిన 36.80 ఎకరాల భూమి విలువ రూ. 30 కోట్లు పైనే ఉంటుంది. మరి ఈ సంస్థకు భూమిని ఏ ధర కు కేటాయించారన్నది గోప్యంగా ఉంచారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గుట్టుగా ఉంచారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని తీసుకుని ఇథనాల్‌ ప్లాంట్‌ పెట్టి కేవలం 261 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారట ఈ కంపెనీ ద్వారా. కేవలం లక్ష రూపాయల షేర్‌ క్యాపిటల్‌ ఉన్న చండీగఢ్‌ కంపెనీకి రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఏ ప్రాతిపదికన కేటాయించారని అడిగితే.. ‘మాకేమీ తెలీదు’ అనేది స్థానిక ఏపీఐఐసీ అధికారుల సమాధానం.

సూట్‌కేసు వ్యవహారమేనా!

ముంబైకి చెందిన తారకేశ్వర్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ లాజిస్టిక్స్‌ పార్క్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు ఒక గోడౌన్‌ నిర్మాణం కోసం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెం ఇండస్ట్రియల్‌ పార్కులో 24.36 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ ఎకరా రూ. 3 కోట్లుపైమాటే. ఇక్కడ భూమి కోసం విశాఖపట్నానికి చెందిన అనేక కంపెనీలు ప్రయత్నించి విఫలమయ్యాయి. అయితే ముంబై కంపెనీకి పెద్దమొత్తంలో భూమిని కేటాయించడం అనుమానాలు కలిగిస్తోంది. పోనీ అదేమైనా పెద్ద కంపెనీయా అంటే, అది ఏర్పాటై ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదు. గత ఏడాది సెప్టెంబరు 8వ తేదీన కంపెనీ రిజిస్టర్‌ అయింది. కంపెనీ పెట్టుబడి రూ.15 లక్షలు మాత్రమే. ఇంతవరకు ఒక్క వార్షిక సమావేశం కూడా నిర్వహించలేదు. కంపెనీ లాభనష్టాల నివేదికలు ఏమీ లేవు. అయితే ఈ సంస్థ నిర్మాణ స్థలాల్లో బిల్డింగ్‌ ఇనస్టాలేషన్‌ పనులు చేస్తుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ కంపెనీకి దాదాపు రూ.75 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఇందుకు ఏ ప్రాతిపదికను అనుసరించారో ఏపీఐఐసీ వర్గాలు బయటకు చెప్పడంలేదు. అత్యంత ఖరీదైన భూమిని తీసుకొని, ఓ గోడౌన్‌ నిర్మాణం పేరిట 200 మందికి ఉద్యోగాలు ఇస్తారని ఏపీఐఐసీ చెబుతోంది. మొత్తానికి ఈ వ్యవహారం చూస్తుంటే... ఇదో సూట్‌కేస్‌ కంపెనీ అని, విశాఖలో ఓ కీలక వైసీపీ నేత బినామీల పేరుతో ఏపీఐఐసీ భూమిని అప్పనంగా కొట్టేయడానికి ప్లాన్‌ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎంత ప్రాసెస్‌ చేస్తారో మరి!

చికెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన ఏబీస్‌ ప్రొటీన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చిత్తూరు జిల్లా పోగూరుపల్లి ఇండస్ట్రియల్‌ పార్కులో 22 ఎకరాలు ఒక బిట్‌గా, మరో 8.75 ఎకరాలు ఇంకో బిట్‌గా మొత్తం 30.75 ఎకరాల భూమిని కేటాయించారు. ఇంత పెద్దమొత్తంలో భూములను దక్కించుకున్న ఏబీస్‌ కంపెనీని కేవలం 3 నెలల క్రితమే ప్రారంభించారు. గత మే 24న రిజిష్టర్‌ చేసిన ఈ కంపెనీ పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌ రూ. 5 కోట్లు. కోడి మాంసాన్ని శుభ్రపరిచే యూనిట్‌ కోసం 30 ఎకరాలకు పైగా భూమి అవసరమా? లేదా? అనే అంశాన్ని పక్కనబెడితే.. ఇక్కడ యూనిట్‌ నెలకొల్పి 770 మందికి ఉద్యోగాలిస్తారని ఈ భూములు కేటాయించారట!

నాలుగు కంపెనీలు.. 122.27 ఎకరాలు

తిరుపతి జిల్లా నాయుడుపేట ఇండస్ట్రియల్‌ పార్కులో 122.27 ఎకరాల భూమిని నాలుగు కంపెనీలకు కట్టబెట్టారు. పీవీసీ పైపులు, ఫిట్టింగ్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పి 400 మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ దరఖాస్తు చేసుకున్న హెల్లా ఇన్‌ఫ్రా మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి 26.75 ఎకరాలు, ఫార్మా/ బయోటెక్‌ యూనిట్‌ ఏర్పాటు చేసి 150 మందికి ఉద్యోగాలిస్తామని దరఖాస్తు చేసిన 3 ఎక్స్‌పర్‌ ఇన్నోవెంచర్‌ లిమిటెడ్‌ కంపెనీకి 25 ఎకరాలు, అరోమా ఇంగ్రిడియంట్స్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసి 137 మందికి ఉద్యోగాలిస్తామని దరఖాస్తు చేసిన అరోచెమ్‌ ఇంగ్రిడియంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఏకంగా 43.73 ఎకరాలు, బయో ఇథనాల్‌, బయో డీజిల్‌, బయో సీఎన్‌జీ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పి 120 మందికి ఉద్యోగాలిస్తామని దరఖాస్తు చేసుకున్న గ్రేస్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి 26.79 ఎకరాలు చొప్పున ప్రభుత్వ భూములను కేటాయించారు. ప్రకాశం జిల్లా రంగమక్కపల్లి (యూడీఎల్‌)లో ఎల్పీజీ సిలిండర్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆటోమేటిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి 175 మందికి ఉద్యోగాలిస్తామంటూ దరఖాస్తు చేసుకున్న పోలార్డ్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి 24.13 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ కంపెనీ వ్యవహారాలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ఏపీఐఐసీ ద్వారా ఆయా కంపెనీలకు చేసిన తాజా భూ కేటాయింపుల వెనుక పెద్ద తతంగమే నడిచిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-08-27T03:36:51+05:30 IST