విశాఖ జిఐఎస్ తో పెట్టుబడుల వెల్లువ

ABN , First Publish Date - 2023-03-19T02:52:14+05:30 IST

విశాఖలో ఈ నెల మొదటి వారంలో జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌కు 25 దేశాల ప్రతినిధులు వచ్చారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.

విశాఖ జిఐఎస్ తో  పెట్టుబడుల వెల్లువ

లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

అసెంబ్లీలో మంత్రులు అమర్‌నాథ్‌, పెద్దిరెడ్డి, రోజా

అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): విశాఖలో ఈ నెల మొదటి వారంలో జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌కు 25 దేశాల ప్రతినిధులు వచ్చారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. అంబానీ, అదానీ లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తే టీడీపీకి బాధ ఏంటని ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విశాఖలో జరిగిన రూ.13 లక్షల కోట్ల ఒప్పందాల ద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. అమర రాజా సంస్థ తెలంగాణలో విస్తరిస్తే తాము వెళ్లగొట్టామని ప్రచారం చేయడం తగదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. రూ.ఏడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించినట్లు తెలిపారు. పర్యాటక మంత్రి రోజా మాట్లాడుతూ... టూరిజంలో పెట్టుబడుల ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయని అన్నారు. టీడీపీ గోబెల్స్‌ ప్రచారాన్ని గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా జగన్‌ తిప్పికొట్టారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

స్పెషల్‌ డీఎస్సీ వేయాలి: కళావతి

గిరిజన ప్రాంతాల్లోని యువత స్పెషల్‌ డీఎస్సీ కోసం ఎదురుచూస్తోందని, త్వరగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని పాలకొండ ఎమ్మెల్యే కళావతి కోరారు. గిరిజన బడ్జెట్‌ డిమాండ్‌పై చర్చలో ఆమె మాట్లాడుతూ... మన్యం జిల్లాలో పార్వతీపురానికి అనుసంధానం చేసే రోడ్లు లేవన్నారు. మన్యం ప్రాంతంలో విద్యుత్‌, ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లు లేకపోవడంతో సచివాలయాల్లో సేవలు అందడం లేదన్నారు. బాలికల హాస్టళ్లలో వాచ్‌మెన్లను నియమించకపోవడం వల్ల భద్రత లోపిస్తోందన్నారు.

గోతులు పూడ్చండి: కరణం ధర్మశ్రీ

చోడవరం ప్రాంతంలోని తోటకూరపాలెం వద్ద క్వారీల కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని అక్కడ గోతులు పూడ్చాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కోరారు. రోడ్లు భవనాల శాఖ బడ్జెట్‌ డిమాండ్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ... రహదారులకు మరో రూ.4 వేల కోట్లు అదనంగా ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకపోవడం వల్ల అధ్వాన్నంగా తయారయ్యాయన్నారు. టీడీపీ ప్రభుత్వ గొప్పలకు ఈ ప్రభుత్వం అప్పులు చేస్తూ తిప్పలు పడుతోందని అన్నారు.

రెండు బిల్లులకు సభ ఆమోదం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆయిల్‌ కంపెనీల అమ్మకాలకు సంబంధించి వ్యాట్‌ చట్టంలో సవరణలు చేసినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ జీఎస్టీలో లేవని, ఆయిల్‌ కంపెనీల మధ్య జరిగే అమ్మకాల్లో పన్నుల వెసులుబాటు కోసం ఈ మేరకు మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కొత్తగా పారా వెటర్నరీ కౌన్సిల్‌ ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన మరో బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. వెటర్నరీ డిప్లొమా ఉన్నవారికి రిజిస్ర్టేషన్లు, వెటర్నరీ కోర్సులు అందించే సంస్థలకు రిజిస్ర్టేషన్లు, వెటర్నరీ విద్యకు శిక్షణ కార్యక్రమాలను కౌన్సిల్‌ చేపడుతుందన్నారు.

Updated Date - 2023-03-19T02:52:14+05:30 IST