ఫీజులు పెంచండి
ABN , First Publish Date - 2023-02-07T03:55:47+05:30 IST
నామమాత్రపు ఫీజులతో కాలేజీలు నడపడం ఎలాగని ప్రైవేటు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

ఇంజనీరింగ్ కాలేజీలను నడపలేని పరిస్థితి
అటానమస్ కాలేజీల అసోసియేషన్ ఆవేదన
శాశ్వత అఫిలియేషన్‌కు చర్యలు: హేమచంద్రారెడ్డి
అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నామమాత్రపు ఫీజులతో కాలేజీలు నడపడం ఎలాగని ప్రైవేటు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ సంవత్సరమైనా ఫీజులు పెంచి కాలేజీలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరాయి. సోమవారం విజయవాడలో ప్రైవేటు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల సమావేశం జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి సమావేశంలో పాల్గొని విద్యా సంస్కరణలు, తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. యాజమాన్యాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల(జేన్‌టీయూ అనంతపురం రీజియన్) అధ్యక్షుడు చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ... 70 నుంచి 90 శాతం ప్లేస్‌మెంట్లు ఉండే అటానమస్ కాలేజీలు ఇంకా బలోపేతం కావాల్సి ఉందన్నారు. యూజీసీ అటానమీ ఉన్నంతకాలం శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రంలోని యూనివర్సిటీలు వీటికి అఫిలియేషన్ ఇచ్చేలా చూడాలని కోరారు. పేరుకు అటానమస్ కాలేజీలైనా ఇంకా కొన్ని విషయాల్లో స్వయం ప్రతిపత్తి లేదని, కాలేజీలకు పూర్తి అటానమీ అవకాశం ఇవ్వాలన్నారు. విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసే సమయంలో ముఖ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనేక కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ఒకరిద్దరు విద్యార్థులే చేరుతున్నారని, ఎంటెక్‌కు అసలు విద్యార్థులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ విద్యకు అనుమతిస్తే అడ్మిషన్లు పెరుగుతాయన్నారు.
అన్ని అటానమస్ కాలేజీలను ప్రైవేటు యూనివర్సిటీలుగా సిఫారసు చేయాలని కోరారు. మన విద్యార్థులు ఇతర రాష్ర్టాలకు వెళ్లి చదువుకుంటున్నారని, కానీ ఇతర రాష్ర్టాల నుంచి ఏపీకి రావడం లేదని తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్ అధ్యక్షుడు మిట్టపల్లి వి.కోటేశ్వరరావు మాట్లాడుతూ... శ్రీకృష్ణ కమిటీ సిఫారసు చేసినట్లుగా ఇంజనీరింగ్ కోర్సుల్లో కనీస ఫీజును రూ.75 వేలుగా నిర్ణయించాలన్నారు. ఫీజులు పెంచితే అన్ని సమస్యలు తొలగిపోతాయన్నారు. ఓ కాలేజీ ప్రతినిధి మాట్లాడుతూ.. 26 మంది ఎమ్మెల్యేలకు, ఆరుగురు మంత్రులకు, ముగ్గురు ఎంపీలకు కాలేజీలున్నాయని, మొహమాటంతో వారు ఫీజుల గురించి మాట్లాడటం లేదన్నారు. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో కనీసం రూ.70 వేలు ఫీజు లేకుండా కాలేజీలు ఎలా నడుపుతున్నారని అన్నారని, కానీ ఇప్పుడు ఫీజులు భారీగా తగ్గిపోయాయన్నారు. లక్కిరెడ్డి బాలిరెడ్డి విద్యా సంస్థల ప్రతినిధి మాట్లాడుతూ... కాలేజీల్లో సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. యూజీసీ ప్రకారం జీతాలు చెల్లించాలని, దానివల్ల వ్యయం పెరుగుతున్నా ఫీజులు మాత్రం పెంచడం లేదన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు జీవీఎం మోహన్‌కుమార్, ఎన్.సతీష్ రెడ్డి, 64 కాలేజీల యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం
అటానమస్ కాలేజీలకు శాశ్వత అఫిలియేషన్ కల్పించాలని ఇప్పటికే యూనివర్సిటీలకు చెప్పినట్లు హేమచంద్రారెడ్డి తెలిపారు. పీజీ కోర్సుల అఫిలియేషన్ ఫీజులు తగ్గిస్తామన్నారు. అన్ని వర్సిటీలకు ఒకే అఫిలియేషన్ ఫీజుల అంశంపై ఒక విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఫీజుల విషయాన్ని ఉన్నత విద్య కమిషన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. నాలుగేళ్ల డిగ్రీని మనమే ముందుగా తీసుకొచ్చామన్నారు. 1.83 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇప్పించి, సర్టిఫికెట్లు జారీ చేశామన్నారు. కాలేజీల అటానమీ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదన్నారు. అధ్యాపకులను కేవలం బోధనకు, పరిశోధనలకే పరిమితం చేయాలని, ఇతర పనులను ఉద్యోగుల ద్వారా చేయించుకోవాలని సూచించారు.