ఊరికే.. మరోసారి చెబుతున్నా!

ABN , First Publish Date - 2023-03-25T03:12:10+05:30 IST

ఊరికే...ప్రజలకు అర్థం కావాలి కాబట్టి మరోసారి చెబుతున్నా’ అంటూనే ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అసెంబ్లీలో తీవ్ర ఆరోపణలు చేశారు.

ఊరికే.. మరోసారి చెబుతున్నా!

రాజధాని పనుల్లో బాబుకు 143 కోట్లు.. ఐటీ నోటీసులు వచ్చాయి

అసెంబ్లీలో సీఎం జగన్‌ ఆరోపణ

అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ‘ఊరికే...ప్రజలకు అర్థం కావాలి కాబట్టి మరోసారి చెబుతున్నా’ అంటూనే ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అసెంబ్లీలో తీవ్ర ఆరోపణలు చేశారు. టిడ్కో ఇళ్లు, రాజధాని పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టు సంస్థల నుంచి వివిధ మార్గాల ద్వారా ఆయనకు రూ.143 కోట్ల ముడుపులు ముట్టాయని ఆరోపించారు. బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. 2019లో ఆదాయ పన్ను శాఖ జరిపిన సోదాలు, నోటీసుల అంశం గురించి ప్రస్తావించారు. అంతకుముందే, ఇదే అంశంపై పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి అమర్నాథ్‌ సభలో ప్రకటన చేశారు. తర్వాత ముఖ్యమంత్రి మళ్లీ అదే ప్రకటన చదువుతూ మాట్లాడారు. అన్ని విషయాలూ మంత్రి చెప్పారని, అయినా ఊరికే.. ప్రజలకు మరింతగా అర్థమవ్వాలనే తాను అవే విషయాలు చెబుతున్నానన్నారు. గత ప్రభుత్వంలో రూ.7 వేల కోట్లతో టిడ్కో ఇళ్లు, మరో రూ.900 కోట్లతో రాజధాని పరిధిలో గృహనిర్మాణం చేపట్టారని.. అందులో 5 శాతం కింద 143 కోట్లు చంద్రబాబుకు చేరాయని తెలిపారు. 2019లో జరిగిన సోదాల్లో లెక్కతేలని రూ.2 వేల కోట్ల సొమ్మును గుర్తించినట్లు ఐటీ విభాగం ప్రకటన ఇచ్చిందని.. ఆ తర్వాత ఇదే కేసులో షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌, నాటి సీఎం చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ను ప్రశ్నించిందని వివరించారు. కాంట్రాక్టు సంస్థల నుంచి డబ్బులు ఎలా వసూలు చేశారో వారిద్దరూ స్పష్టమైన స్టేట్‌మెంట్లు ఇచ్చారని.. వాటి ఆధారంగా ఐటీశాఖ చంద్రబాబుకు నోటీసులిచ్చిందని వివరించారు. ఎల్‌అండ్‌టీ కంపెనీ నుంచి కూడా డబ్బులు వసూలు చేసే బాధ్యతను మనోజ్‌ వాసుదేవ్‌కే అప్పగించారని ఆరోపించారు. టిడ్కో కింద జరిగిన పనులు, చివరకు హైకోర్టు నిర్మాణ పనుల్లో కూడా ప్రజాధనం దోపిడీ చేశారని అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో ఉన్న యోగేశ్‌ గుప్తా అనే మనిషి ఇందులోనూ ఉన్నారని.. ఈ వ్యవహారంలో రఘు అనే వ్యక్తి పాత్ర ఉందని, ఆయన రామోజీరావు కుమారుడి వియ్యంకుడని ఆరోపించారు. అంతా ఒక దొంగల ముఠాగా ఏర్పడి జనం సొమ్ము దోచుకున్నారని జగన్‌ అన్నారు.

Updated Date - 2023-03-25T03:12:10+05:30 IST