హిందూజాకు చట్టవిరుద్ధంగా చెల్లింపులు
ABN , First Publish Date - 2023-02-21T03:33:47+05:30 IST
హిందూజా సంస్థకు చట్టవిరుద్ధంగా రూ.1,234.68 కోట్లను ఎలా చెల్లిస్తారంటూ ప్రభుత్వాన్ని, సీపీఎం ప్రశ్నించింది.
ఉత్పత్తి చేయని విద్యుత్తుకు 1234 కోట్లు
ట్రూ అప్ పేరుతో ప్రజలపైనే భారం: సీపీఎం
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): హిందూజా సంస్థకు చట్టవిరుద్ధంగా రూ.1,234.68 కోట్లను ఎలా చెల్లిస్తారంటూ ప్రభుత్వాన్ని, సీపీఎం ప్రశ్నించింది. విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కమ్) రూ.1,234 కోట్ల రుణం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును తక్షణమే బహిర్గతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం సభ్యుడు సీహెచ్ బాబూరావు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఈ అంశంపై జోక్యం చేసుకుని ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ఆయన కోరారు. ఈమేరకు సోమవారం ఈఆర్‌సీకి లేఖ రాసినట్లు తెలిపారు. ‘‘హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ 2020 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి వరకూ డిస్కమ్‌లకు సరఫరా చేసిన విద్యుత్తుకు యూనిట్‌కు రూ.3.82 చొప్పున విద్యుత్తు నియంత్రణ మండలి ఆదేశాలకు అనుగుణంగా చెల్లించారు. అయితే ప్లాంటు సామర్థ్యానికి అనుగుణంగా, ఉత్పత్తి చేయని విద్యుత్తుకూ అదనంగా రూ.1,234 కోట్లు చెల్లించాలని హిందూజా కోరుతోంది. ఇది చట్ట విరుద్ధం. దీనివల్ల విద్యుత్తు వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలే వీటిని భరించాల్సి వస్తుంది. దీనిపై విద్యుత్తు నియంత్రణ మండలికి సీపీఎం మూడు దఫాలుగా లేఖ రాసింది. అయితే ఈ నెల 8న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హిందూజాకు అదనంగా రూ.1,234.68 కోట్లను చెల్లించాలని, ఇందుకోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు తెచ్చుకోవాలని నిర్ణయించారు. ఇది సరికాదు. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం మేరకు విడుదల చేసిన ఉత్తర్వును ఇంధన శాఖ బహిర్గతం చేయాలి’’ అని బాబూరావు డిమాండ్ చేశారు.