బాబుపై కేసు ఎత్తేయకపోతే ఉద్యమమే!

ABN , First Publish Date - 2023-09-22T03:18:18+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు ఎత్తేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదని టీడీపీ శాసన సభా పక్ష నేతలు హెచ్చరించారు.

బాబుపై కేసు ఎత్తేయకపోతే ఉద్యమమే!

టీడీపీ శాసన సభాపక్ష నేతల హెచ్చరిక

అరెస్టును నిరసిస్తూ పాదయాత్రగా అసెంబ్లీకి

యాత్రలో పాల్గొన్న వైసీపీ రెబెల్‌ ఎమ్మెల్యేలు

గుంటూరు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు ఎత్తేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదని టీడీపీ శాసన సభా పక్ష నేతలు హెచ్చరించారు. అధినేత అక్రమ అరెస్టుకు నిరసనగా పాదయాత్ర చేసుకుంటూ వారు అసెంబ్లీలోకి వెళ్లారు. తొలుత టీడీపీ శాసన సభ్యులు, మండలి సభ్యులు వెంకటపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఆయనకు పూలమాలలు వేసి చంద్రబాబు విడుదల కావాలంటూ నినాదాలు చేశారు. అనంతరం అగ్నిమాపక కార్యలయం వద్ద నుంచి పాదయాత్రగా బయలుదేరి అసెంబ్లీలోకి ప్రవేశించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నేతృత్వంలో సాగిన ఈ పాదయాత్రలో ‘చంద్రబాబుపై కక్ష- యువత భవితకు శిక్ష‘ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును, వైసీపీ కక్షపూరిత పాలనను నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. జగన్‌ జేబు సంస్థ సీఐడీ డౌన్‌.. డౌన్‌, సైకో సీఎం డౌన్‌డౌన్‌.. సైకో జగన్‌ పోవాలి.. సైకిల్‌పాలన రావాలి.. బాబుతోనే భవిష్యత్తు అంటూ నినాదాలు చేశారు. ఈ పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, డోలా బాల వీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డి భవాని, మంతెన రామరాజు, ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, పంచుమర్తి అనురాధ, దువ్వారపు రామారావు, నెల్లూరు రూరల్‌, తాడికొండ, ఉదయగిరి వైసీపీ రెబెల్‌ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. షెల్‌ కంపెనీల సృష్టికర్త జగన్‌రెడ్డి అంటూ ఉండవల్లి శ్రీదేవి ప్లకార్డు పట్టుకున్నారు.

Updated Date - 2023-09-22T03:18:18+05:30 IST