ఇల్లు.. ఇంకెప్పుడో?

ABN , First Publish Date - 2023-06-07T00:51:01+05:30 IST

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకం కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో గృహనిర్మాణ సంస్థ ఆపసోపాలు పడుతోన్నది.

ఇల్లు.. ఇంకెప్పుడో?
బేస్‌మట్టాల దిగువున ఉన్న ఇళ్ల నిర్మాణాలు

గుంటూరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకం కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో గృహనిర్మాణ సంస్థ ఆపసోపాలు పడుతోన్నది. ఇప్పటికే ఇళ్ల ప్రారంభోత్సవాలను పలుమార్లు వాయిదా వేసిన ప్రభుత్వం తాజాగా మరోసారి అదే పని చేసింది. మే నెలాఖరు లోపు తొలి దశలో జిల్లాకు కేటాయించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులతో ప్రారంభోత్సవాలు చేయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు. సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాదిలోకి వచ్చేశాయి. దానికి రెండు, మూడు నెలల ముందునుంచే పనులు నిలిపేసి అధికార యంత్రాంగం అంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమౌతుంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకు మంజూరు చేసిన 66 వేలకు పైగా ఇళ్లు పూర్తి కావడం పక్కన పెడితే కనీసం 20 శాతం అయినా పూర్తి అవుతాయో, లేదోనన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని చేపట్టింది. పెద్దఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించి వాటిల్లో వేసిన లేఅవుట్లు చాలావరకు ప్రస్తుతం ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్నాయి. దాంతో లబ్ధిదారులు తాము ఇళ్లు నిర్మించేది లేదని, ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని స్పష్టం చేశారు. కేవలం ఇళ్ల స్థలాలు ఇచ్చి లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకునేలా చేసి అంతా తామే చేశామని ప్రచారం చేసుకోవాలని ప్రభుత్వం భావించగా లబ్ధిదారుల తీరుతో ఆ పప్పులు ఉడకలేదు.

పూర్తి అయిన ఇళ్లు 12 శాతమే

జిల్లాకు మొత్తం 66,125 ఇళ్లని ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో నేటికీ బేస్‌మట్టాల కంటే దిగువున ఇంచుమించు 45 శాతం 31,603 ఉన్నాయి. బేస్‌మట్టాల స్థాయిలో 24,116, రూఫ్‌ స్థాయిలో 1,681, రూఫ్‌ పూర్తి అయినవి 590 ఉన్నాయి. ఇప్పటి వరకు 8,132 ఇళ్ల నిర్మాణం సంపూర్ణం అయినట్లు అధికారులు చెబుతున్నారు. మరో మూడు అసలు ప్రారంభమే కాలేదు. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటివరకు మొత్తం పూర్తి అయిన ఇళ్లు 12 శాతం మధ్యనే ఉన్నాయి. నాలుగేళ్లలో కేవలం ఈ స్థాయిలో పురోగతి ఉందంటే రాబోయే 9 నెలల్లో మహా అయితే మరో 8 శాతం పూర్తి చేస్తారేమో. పైగా మరో నెల పోతే వర్షాకాలం ప్రారంభం అవుతుంది. అప్పుడు ఇళ్ల నిర్మాణ పనులు ఏమాత్రం ముందుకు సాగే పరిస్థితి ఉండదు. ఈ దశలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల చేత గృహ ప్రవేశాలు అనుమానమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2023-06-07T00:51:01+05:30 IST