హామీలు.. హుళక్కి!
ABN , First Publish Date - 2023-01-18T00:02:01+05:30 IST
రాజధాని నిర్మాణం కోసం తుళ్లూరు, మందడం, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల రైతులు 34 వేల ఎకరాల భూములు ఇచ్చారు. ఈ కారణంగా ఆ భూముల్లో వ్యవసాయ పనులకు వెళ్లే భూమి లేని నిరుపేదలకు ఉపాధి పోతుందన్న కారణంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం వారికి నెలకు రూ.2,500 పింఛను ప్రకటించింది.
రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇప్పటి ప్రభుత్వం ఇస్తున్న రెండున్నర వేల పెన్షన్‌ను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.5 వేలకు పెంచుతాను. రాజధాని కోసం భూములిచ్చిన అసైన్డ్ రైతులకు 800 గజాలు కాకుండా, సాధారణ రైతులకు మాదిరి సమాన ప్యాకేజీ ఇస్తాను, జరీబు భూములైతే 1,450 గజాలు, మెట్ట భూమలైతే 1,250 గజాలు ప్లాట్ల కింద ఇస్తాను.
...ఇవీ 2019 ఎన్నికల సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రాజధాని ప్రాంత అసైన్డ్ రైతులు, భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన హామీలు. ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్నీ జరిగిపోయి ఇప్పటికి నాలుగేళ్లు కావస్తోంది. కానీ ఆయన ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇప్పటి వరకూ అమలు కాలేదు. రైతులు, పేదలు మాత్రం హామీల అమలు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి మాత్రం వీటిని మర్చిపోయినట్లున్నారు.
గుంటూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణం కోసం తుళ్లూరు, మందడం, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల రైతులు 34 వేల ఎకరాల భూములు ఇచ్చారు. ఈ కారణంగా ఆ భూముల్లో వ్యవసాయ పనులకు వెళ్లే భూమి లేని నిరుపేదలకు ఉపాధి పోతుందన్న కారణంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం వారికి నెలకు రూ.2,500 పింఛను ప్రకటించింది. 29 గ్రామాల్లో 18,800 మంది భూమిలేని పేదలను గుర్తించి వారికి నెలనెలా పింఛను అందజేసింది. ఇలా ఏటా రూ.30 వేల మేర భూమిలేని పేదలకు ఆర్థిక భరోసా లభించింది. కాగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి ఈ పింఛనును రెట్టింపు చేసి నెలకు రూ.5000 ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో భూమిలేని పేదలంతా ఆయన గెలవాలని కోరుకున్నారు. వారు కోరుకున్నట్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంతే ఆ తరువాత వారి పరిస్థితి పూర్తిగా తలకిందులయింది. రాజధాని అమరావతిపై కక్ష సాధింపులకు దిగిన ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణం, అభివృద్ధి పనులన్నింటినీ అటకెక్కించింది. రైతులకు ఇవ్వాల్సిన గృహ, వాణిజ్య ప్లాట్లను, ఏటేటా ఇచ్చే కౌళ్లు కూడా ఇవ్వకుండా ఆపేసింది. దాంతోపాటే భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన రూ.5 వేల పింఛను హామీని కూడా తుంగలో తొక్కింది. ఫలితంగా గడిచిన నాలుగేళ్లుగా భూమిలేని పేదలు పాత పింఛనుతోనే సరిపుచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేసి ఉంటే ఒక్కో కుంటుంబానికి ఏటా అప్పటికే వస్తున్న రూ.30 వేలతోపాటు, మరో రూ.30 వేల మేర అదనపు ప్రయోజనం కలిగేది. ఈ హామీని అమలు చేయని కారణంగా గడిచిన నాలుగేళ్లలో ఒక్కో పేదవాడు లక్షా 20 వేల రూపాయలు మేర నష్టపోవాల్సి వచ్చింది. ఇలా గడిచిన నాలుగేళ్లలో 18,800 భూమిలేని పేదలు అక్షరాల రూ.216 కోట్లు నష్టపోయారు.
నీటి మూటగా అసైన్డ్ రైతుల హామీ
సాధారణ రైతులతోపాటు అసైన్డ్ రైతులకు కూడా సమాన ప్యాకేజీ ఇస్తానని హడావుడి చేసిన అప్పటి వైసీపీ అధికారం వచ్చిన వెంటనే మాట తప్పింది. ఫలితంగా రాజధాని ప్రాంతంలో ఉన్న 4,800 మంది అసైన్డ్ రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. అందరితోపాటు వారికి కూడా సమాన ప్యాకేజీ కింద జరీబు భూమి అయితే ఎకరాకు 1,450 గజాలు, మెట్ట అయితే ఎకరానికి 1,250 గజాలు నివాస, వాణిజ్య ప్లాట్లను ఇస్తానన్న హామీని ప్రభుత్వం తుంగలో తొక్కింది. సమాన ప్యాకేజీని గురించిన ప్రస్తావన ఈ నాలుగేళ్లలో కనీసం మాటవరుసకు కూడా రాకపోవడం విశేషం. దీంతో అట్టడుగు వర్గాలకు చెందిన తాము తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.