గ్రావెల్‌.. దందా!

ABN , First Publish Date - 2023-02-07T01:08:39+05:30 IST

జిల్లా గనులు, భూగర్భ, రెవెన్యూ శాఖలకు అంధత్వం ఆవహించింది. ఆయా శాఖల అధికారులు ప్రభుత్వ ఆస్తులకు జవాబుదారీగా ఉండాల్సిందిపోయి మనకెందుకులే అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు.

గ్రావెల్‌.. దందా!
ఓబులునాయుడుపాలెం వాగు పోరంబోకులో యంత్రాలతో తవ్వుతున్న గ్రావెల్‌

గుంటూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లా గనులు, భూగర్భ, రెవెన్యూ శాఖలకు అంధత్వం ఆవహించింది. ఆయా శాఖల అధికారులు ప్రభుత్వ ఆస్తులకు జవాబుదారీగా ఉండాల్సిందిపోయి మనకెందుకులే అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. సహజ వనరులను దోచుకొంటున్నా తమకేమి పట్టనట్లుగానే ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా నామమాత్రంగానైనా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నేతల బలం వీళ్లకు ప్రతిబంధకంగా మారిందా... నెలవారీ మామూళ్లు తీసుకొంటూ వీళ్లే సహకరిస్తున్నారా అన్నది తేలాల్సి ఉన్నది. జగనన్న కాలనీల పేరుతో గుంటూరు రూరల్‌ మండలంలోని ఓబులునాయుడుపాలెంలో వాగు పోరంబోకు భూముల్లో జరుగుతున్న గ్రావెల్‌ దందా ఇందుకు నిదర్శనం. నిత్యం లెక్కా పత్రం లేకుండా భారీ యంత్రాలు పెట్టి 40 అడుగుల లోతుకు వెళ్లి మరీ గ్రావెల్‌ని తవ్వి తరలిస్తున్నా పట్టించుకోక పోతుండటం సంబంధిత శాఖల అచేతన పరిస్థితిని కళ్లకు కడుతోంది.

ఓబులునాయుడుపాలెంలోని సర్వే నెంబరు.546లో ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ గుంటూరు పశ్చిమ మండలం తహసీల్దార్‌ కార్యాలయం అధికారులు ఒక బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. ఈ స్థలాన్ని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని బోర్డులో రాశారు. అయితే ఇది కేవలం బోర్డు పాతడం వరకే పరిమితమైంది. గత కొన్ని నెలలుగా జగనన్న కాలనీలకు గ్రావెల్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం తనకు అనుమతి ఇచ్చిందంటూ ఒక వ్యక్తి ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. మైనింగ్‌ నిబంధనల ప్రకారం ఆరు నుంచి ఎనిమిది అడుగులకు మించి గ్రావెల్‌ని తవ్వకూడదు. అలాంటిది ఇక్కడ 40 అడుగుల లోతుకు వెళ్లి మరీ తవ్వుతున్నారు. ఎన్ని క్యూబిక్‌ మీటర్లు తవ్వారనే లెక్కలు అసలే లేవు. స్థానిక ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే ఏటుకూరు లేఅవుట్‌లో చదును చేసేందుకు గ్రావెల్‌ ఇక్కడ తవ్వడానికి అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. అందుకు సంబంధిత ఉత్తర్వులు చూపించమంటే మాత్రం చూపడం లేదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రావెల్‌ని తవ్వుకుపోతున్నారు. ఈ తవ్వకాల వెనక పల్నాడు జిల్లాకు చెందిన ఒక నేత హస్తం ఉన్నట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. అందుకే అధికారులు ఎవ్వరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ తవ్వకాలపై సత్తెనపల్లిలో వలే ఇక్కడ కూడా కోర్టులో కేసులు వేయాలని గ్రామస్థులు ఆలోచిస్తున్నారు. కనీసం అప్పుడైనా అధికారులు చర్యలు తీసుకొంటారేమోనని పేర్కొంటున్నారు.

Updated Date - 2023-02-07T01:08:40+05:30 IST