గ్రానైట్‌.. దందా

ABN , First Publish Date - 2023-01-18T00:05:44+05:30 IST

ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా.. ఎటువంటి వేబిల్లు లేకుండా.. రాత్రి వేళల్లో గ్రానైట్‌ లారీలు తరలిపోతున్నాయి. రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఓ ముఠా లారీలను రాష్ట్ర సరిహద్దులను దాటించేస్తోంది. గ్రానైట్‌ లారీకి రూ.35 వేలు చెల్లిస్తే చాలు రాష్ట్ర సరిహద్దు దాటించేస్తున్నారు.

గ్రానైట్‌.. దందా
గ్రానైట్‌

నరసరావుపేట, జనవరి 17: ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా.. ఎటువంటి వేబిల్లు లేకుండా.. రాత్రి వేళల్లో గ్రానైట్‌ లారీలు తరలిపోతున్నాయి. రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఓ ముఠా లారీలను రాష్ట్ర సరిహద్దులను దాటించేస్తోంది. గ్రానైట్‌ లారీకి రూ.35 వేలు చెల్లిస్తే చాలు రాష్ట్ర సరిహద్దు దాటించేస్తున్నారు. అధికార పార్టీ నేతలకు కప్పం కడితే చాలన్నట్లుగా గ్రానైట్‌ దందా సాగుతోంది. అడ్డుకోవాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అటువైపు చూడటంలేదు. అడిగేవారు ఉండరు.. అడ్డుకునే వారు ఉండరు.. ఎక్కడైనా ఎవరైనా లారీని అడ్డుకుంటే తాము చూసుకుంటామని అధికారం మాటున కొందరూ వైసీసీ ముఖ్య నేతలు బరితెగిస్తున్నారు. వీరికి కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారు. నిత్యం గ్రానైట్‌ అక్రమ రవాణా రాత్రి 10 గంటల నుంచి సాగుతోంది. పల్నాడు జిల్లాలో దీనికి ఓ పెద్ద నెట్‌వర్క్‌ పనిచేస్తున్నది. చిలకలూరిపేట, నరసరావుపేట, సంతమాగులూరు మండలాల పరిధిలో గ్రానైట్‌ పరిశ్రమలు, క్వారీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ప్రతి రోజు పెద్దఎత్తున గ్రానైట్‌ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు గ్రానైట్‌ ఎగుమతి పల్నాడు జిల్లా మీదగా సాగుతున్నది. ప్రకాశం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేసే గ్రానైట్‌కు వే బిల్లులతో పన్ను చెల్లిస్తున్నారు. పల్నాడు జిల్లా మీదగా రాష్ట్ర సరిహద్దులు దాటే గ్రాటైట్‌కు మాత్రం వే బిల్లులు అవసరంలేకుండానే జీరో పైనే లారీలకు లారీలను రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ గ్రానైట్‌ దందా రాత్రి వేళల్లో యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. కొందరు అధికార పార్టీ ముఖ్య నేతలకు గ్రానైట్‌ దందా కాసుల వర్షం కురిపిస్తున్నదన్న ఆరోపణలున్నాయి.

80 శాతం పడిపోయిన ఆదాయం

రూ.5 లక్షల గ్రానైట్‌ లోడు రవాణాకు 28 శాతం చొప్పున రూ.1.40 లక్షలు పన్ను చెల్లించాలి. అక్రమార్కులు కోరిన విధంగా రూ.35 వేలు చెల్లిస్తే రూ.1.40 లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. నెలకు వెయ్యి వరకు గ్రానైట్‌ లారీలను రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నట్లు సమాచారం. ఇలా నెలకు సుమారు రూ.3.5 కోట్లు చేతులు మారుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఆదాయానికి రూ.12 నుంచి రూ.14 కోట్ల వరకు అక్రమార్కులు గండి కొట్టి జేబులు నింపుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖకు గ్రానైట్‌ పన్ను ద్వారా వచ్చే ఆదాయం 80 శాతానికి పైగా తగ్గిందని ఓ అధికారి చెప్పారు. అధికార పార్టీకి చెందిన ముగ్గురు నేతలకు నెలనెలా మామూళ్లు అందిస్తున్నారన్న ప్రచారం ఉంది.

రూ.5 వేలు పెంచిన నేత

ఇటీవల ఓ నేత గతంలో తనకు ఇచ్చే మామూళ్లను లారీకి రూ.5 వేలు పెంచారు. ఈ కారణంగా లారీ సరిహద్దు దాటాలంటే వసూలు చేసే రేటు రూ.30 వేల నుంచి రూ.35 వేలకు పెరిగిందని ప్రచారం. కోటప్పకొండ మీదగా నరసరావుపేట వినుకొండ రోడ్డుకు రాత్రి వేళ గ్రానైట్‌ లారీలు చేరుకుంటాయి. అక్కడ నుంచి లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటే వరకు ఈ ముఠా రంగంలోకి దిగి డ్రైవర్లకు టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్‌ ఉన్న లారీని ఎక్కడా ఎవరూ ఆపరని ఎవరైనా ఆపితే తామే చూసుకుంటామని సదరు ముఠా భరోసా ఇస్తుంది. ఎక్కడైనా ఏ అధికారైనా టోకెన్‌ ఉన్న లారీని ఆపితే సదరు ముఠా రంగంలోకి దిగి సురక్షితంగా లారీని రాష్ట్ర సరిహద్దు దాటిస్తుంది. అధికార పార్టీ నేతలతో పాటు కొందరు అధికారులు అక్రమ రవాణాలో సూత్ర ధారులుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రానైట్‌ లారీల నుంచి పన్ను వసూలు చేసే సాహసం అధికారులు చేసే పరిస్థితులు లేవు. గతంలో మైనింగ్‌ శాఖ విజిలెన్స్‌ అధికారి ఒకరు గ్రానైట్‌ అక్రమ రవాణాపై కొరఢా ఝళిపించారు. సదరు అధికారిని గ్రానైట్‌ ముఠా బదిలీ చేయించినట్లు సమాచారం. ప్రస్తుత అధికారి కూడా తనిఖీలు చేసేందుకు ముందుకు వస్తున్నా ఆయనపై రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉండటంతో అధికారి మిన్నకుండక తప్పడంలేదని సమాచారం.

Updated Date - 2023-01-18T00:05:50+05:30 IST