‘జలకళ’ లెక్కల్లో గోల్‌మాల్‌!

ABN , First Publish Date - 2023-03-19T02:22:47+05:30 IST

వైఎ్‌సఆర్‌ జలకళ పథకం లెక్కల్లో ప్రభుత్వం గోల్‌మాల్‌ చేస్తోంది. పేద రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేసే ఈ పథకానికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా తప్పుడు సమాచారం ఇస్తోంది.

‘జలకళ’ లెక్కల్లో గోల్‌మాల్‌!

అసెంబ్లీ సాక్షిగా తప్పుడు సమాచారం

గవర్నర్‌ ప్రసంగంలో ఒక విధంగా....

మంత్రి వివరణలో మరో రకంగా లెక్కలు

వేసిన బోర్ల సంఖ్యను మార్చేసిన సర్కారు

బోర్ల ఉచిత విద్యుదీకరణపైనా యూటర్న్‌

రైతులు కొంత ఖర్చు భరించాలన్న మంత్రి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైఎ్‌సఆర్‌ జలకళ పథకం లెక్కల్లో ప్రభుత్వం గోల్‌మాల్‌ చేస్తోంది. పేద రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేసే ఈ పథకానికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా తప్పుడు సమాచారం ఇస్తోంది. జలకళ కింద ఇప్పటి వరకు రూ.188.84 కోట్లతో 6,931 బోర్లు వేయించామని, 9,629 మంది లబ్ధి పొందారని అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా గవర్నర్‌తో చెప్పించారు. ఆ తర్వాత రెండు రోజులకే ఈ లెక్కలు భారీగా మారిపోయాయి. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వమిచ్చిన సమాధానం పూర్తి భిన్నంగా ఉంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతుల సంఖ్య, తవ్విన బోరుబావుల సంఖ్య వివరాలు ఇవ్వాలని టీడీపీ సభ్యులడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో మంత్రి పెద్దిరెడ్డి లిఖితపూర్వకంగానే సమాధానమిచ్చారు. జలకళ కింద 2,28,421 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని, 19,908 బోర్లు వేయించామని అందులో తెలిపారు. గవర్నర్‌ ప్రసంగంలో 6,931 బోర్లు మాత్రమే లెక్కచెప్పిన సర్కారు.... రెండు రోజుల్లోనే ఆ సంఖ్యను 19,908కి పెంచేయడంతో ఈ తేడాను గమనించిన వారు నివ్వెరపోతున్నారు. అంతేకాదు ఈ బోర్లకు ఉచితంగా విద్యుద్‌ సదుపాయం అందిస్తామని జగన్‌ సర్కారు హామీ ఇచ్చింది. రైతులు ఒక్క పైసా చెల్లించకుండా బోరు, మోటారు, విద్యుదీకరణ చేస్తామన్నారు. అయితే ఈ విషయంలో మంత్రి పెద్దిరెడ్డి యూటర్న్‌ తీసుకున్నారు. 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పామని, కొంతమొత్తంలో రైతులు ఖర్చు భరిస్తే ఈ పథకం ముందుకు సాగుతుందని సెలవిచ్చారు.

సోలార్‌ సెట్లకు నో...

గతంలో ఉన్న సోలార్‌ మోటార్లను కూడా ఈ సర్కారు పూర్తిగా విస్మరించింది. కేంద్రం 50వేల సోలార్‌ సెట్లు సబ్సిడీ కింద కేటాయిస్తే వాటిని తీసుకోకుండా వదిలేశారు. జలకళ ద్వారా మోటార్లతో పాటు విద్యుత్‌ కనెక్షన్‌ ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారు. విద్యుత్‌ లైన్ల ఖర్చు రైతులు భరిస్తేనే విద్యుదీకరణ చేస్తామని నాలుక మడతేశారు. అంతేకాదు గత ప్రభుత్వం ఐదేళ్లలో 33వేల బోర్లు తవ్విందని చెబుతూ... తమకంటే తక్కువ ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు. సోలార్‌ పంపుసెట్ల ద్వారా ఇటు రైతులతో పాటు ప్రభుత్వానికీ ఎంతో మేలు జరిగేది. అనాలోచితంగా వాటిని పక్కనపెట్టి విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కనెక్షన్‌ కోసం రైతులు కొంత డబ్బులు చెల్లించాల్సిందేనంటున్నారు. ఉచితంగా ఇస్తామని అనడమెందుకు?, ఇప్పుడు డబ్బులు చెల్లించాలని చెప్పడమెందుకని రైతులు వాపోతున్నారు.

పేద రైతులకు చేరువలో ‘జలసిరి’

కాంగ్రెస్‌ హయాంలో ఇందిరప్రభ పేరుతో ప్రారంభించిన ఈ పథకాన్ని ఎన్టీఆర్‌ జలసిరిగా పేరుమార్చి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. గత ప్రభుత్వం హయాంలో సీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ పథకం మార్గదర్శకాలను రూపొందించింది. పేద రైతులంతా ఉపయోగించుకునేలా సరళమైన విధానాలను రూపొందించారు. పథకంలో లోటుపాట్లను సవరించి ప్రజలందరికీ ఉపయోగపడేలా చేశారు. అప్పట్లో సుమారు 33వేలకు పైగా బోర్లు వేసి 11వేల మందికి పైగా సోలార్‌ పంపుసెట్లను బిగించారు. సోలార్‌ పంపుసెట్‌ కోసం ఎస్సీ, ఎస్టీలు రూ.6వేలు, మిగిలినవారు రూ.20వేలు భాగస్వామ్య మొత్తం చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. అయితే వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఎక్కడుందో అక్కడే నిలిపేశారు. రెండో సంవత్సరం నుంచి వైఎ్‌సఆర్‌ జలకళగా పేరుమార్చారు. రూ.2,340 కోట్లతో 2లక్షల బోర్లు వేయిస్తామని ఆర్భాటం చేశారు. ప్రైవేట్‌ కాంట్రాక్టర్ల ద్వారా బోర్‌ మెషిన్‌లను కొనుగోలు చేయించారు. బోర్లు వేసినందుకు బిల్లులు ఇవ్వకపోవడంతో వారు ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సజావుగా సాగుతున్న పథకాన్ని ఈ సర్కారు వచ్చి నిర్వీర్యం చేసిందన్న విమర్శలొస్తున్నాయి. గత ప్రభుత్వం తరహాలోనే కొనసాగించి ఉంటే ఇప్పటికి ఎంతోమంది పేద రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేవారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-03-19T02:23:20+05:30 IST