రాయలసీమ వర్సిటీలో గోల్‌మాల్‌!

ABN , First Publish Date - 2023-02-07T03:59:52+05:30 IST

రాయలసీమ విశ్వవిద్యాలయం అక్రమాలకు నిలయంగా మారుతోంది. కనీసం పదో తరగతి కూడా చదవనివారు ఇక్కడ ఉద్యోగులుగా చెలామణి అవుతున్నారు.

రాయలసీమ వర్సిటీలో గోల్‌మాల్‌!

బోధనేతర సిబ్బందిగా అనర్హుల నియామకం

40 మంది ఉద్యోగుల విద్యార్హతలపై విచారణ

మరో 24 మందిపై విచారణ పెండింగ్‌

జీతాలు ఆపేసిన ట్రెజరీ శాఖ

వర్సిటీ సొంత నిధులతో జీతాల చెల్లింపులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాయలసీమ విశ్వవిద్యాలయం అక్రమాలకు నిలయంగా మారుతోంది. కనీసం పదో తరగతి కూడా చదవనివారు ఇక్కడ ఉద్యోగులుగా చెలామణి అవుతున్నారు. ఓవైపు విచారణలు జరుగుతున్నా, ఉద్యోగులు ఇచ్చిన సర్టిఫికెట్లు నిజమైనవి కాదని అధికారులు నివేదికలు ఇచ్చినా, ట్రెజరీ ఏకంగా జీతాలే ఆపేసినా అటు వర్సిటీ అధికారులు, ఇటు ఉన్నత విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. పైగా ట్రెజరీ జీతాలు ఇవ్వకపోయినా ఆందోళన పడొద్దని, వర్సిటీ సొంత నిధులున్నంత కాలం ఎవరికీ ఇబ్బంది ఉండదని వర్సిటీ అధికారులే భరోసానివ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వర్సిటీ నిధుల వినియోగానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అయినప్పటికీ, పట్టించుకోకుండా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం ఆమోదంతో ఇష్టారాజ్యంగా పిల్లల ఫీజుల నగదును జీతాలుగా చెల్లిస్తోంది. అయితే ఉద్యోగుల విద్యార్హతలపై నివేదికలు అందినా ఉన్నత విద్యాశాఖ చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

రాయలసీమ యూనివర్సిటీ 2008లో ప్రారంభమైంది. బోధనేతర సిబ్బందిలో జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ స్థాయిలో 26 పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ కింద ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ దశల వారీగా 140మంది ఉద్యోగులను తీసుకున్నారు. వారిలో ఏకంగా 105మందిని కాంట్రాక్టులోకి తీసుకుని టైంస్కేల్‌ అమలు చేస్తున్నారు. ఏ శాఖలోనైనా ఉద్యోగులకు టైంస్కేల్‌ అమలుచేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి పొందాలి. కానీ ఇక్కడ అదేం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంపై 2021లో ఓ విద్యార్థి సంఘం నేత ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల్లో పెద్దఎత్తున అనర్హులు ఉన్నారని విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత విద్యాశాఖ ఇద్దరు అధికారులతో విచారణ కమిటీని నియమించింది. కానీ అప్పటి విద్యాశాఖ మంత్రి జోక్యంతో ఆ కమిటీ విచారణ ఆగిపోయింది. ప్రత్యామ్నాయంగా వర్సిటీనే అంతర్గత విచారణ చేపట్టి, 40మంది ఉద్యోగుల విద్యార్హతపై డీఈవోల నుంచి నివేదికలు కోరింది. కర్నూలు డీఈవో ఇచ్చిన నివేదికలో 16మందిపై విచారణ జరపగా వారిలో 11మంది సమర్పించిన విద్యార్హత సర్టిఫికెట్లు నిజమైనవి కాదని పేర్కొన్నారు. ఒక సర్టిఫికెట్‌ ట్యాంపరింగ్‌ చేసిందని స్పష్టం చేశారు. పలువురి సర్టిఫికెట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని నివేదికలో తెలిపారు. మిగిలిన 24మందిపై విచారణ పెండింగ్‌లో ఉంది. అది కూడా పూర్తయితే ఇంకా ఎంతమంది అనర్హులు ఉన్నారనేది బయటపడుతుంది. మరోవైపు దీనిపై సీఐడీకి కూడా ఫిర్యాదులు అందాయి. వివరాలు సమర్పించాలని సీఐడీ లేఖలు రాసినా యూనివర్సిటీ స్పందించలేదు. ఉన్నత విద్యాశాఖ అడిగినా కూడా వివరాలు ఇవ్వట్లేదని ప్రచారం జరుగుతోంది.

మీ ఉద్యోగులకు నాది భరోసా!

ఈ వ్యవహారంపై ఇటీవల ఓ అధికారి చేసిన బహిరంగ వ్యాఖ్యలు చూస్తుంటే అక్రమాలను సక్రమం చేస్తారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ‘ఎన్ని విచారణలు జరిగినా ఏం కాదు. మీకు నేను అండగా ఉంటా. మీ ఉద్యోగాలకు నాది భరోసా’ అని వర్సిటీకి చెందిన కీలక అధికారి ఒకరు ఓ సన్మాన కార్యక్రమంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ట్రెజరీ జీతాలతో మనకు సంబంధం లేదని చెబుతూ, నిబంధనలకు విరుద్ధంగా ఈసీ ఆమోదంతో 140 మందికీ ఆయన జీతాలు ఇప్పిస్తున్నారు. ట్రెజరీ జీతాలు నిలిపివేయడంతో కేవలం 40మంది కోసం తమ ఉద్యోగాలను కూడా వివాదంలోకి లాగుతున్నారని మిగిలిన 100మంది ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఆరేళ్లకే కొడుకు పుట్టాడట!

నకిలీ సర్టిఫికెట్లతో పాటు కొందరు ఆధార్‌ కార్డుల్లో పుట్టిన తేదీని సైతం మార్చేసి పదవీ విరమణ వయసు దాటినా విధుల్లో కొనసాగుతున్నారనే ఆరోపణలున్నాయి. వర్సిటీలో పనిచేసే ఓ ఉద్యోగి సమర్పించిన సర్టిఫికెట్‌ ప్రకారం ఆయన 1988లో పుట్టాడు. అంటే ప్రస్తుతం అతడి వయసు 34ఏళ్లు. కానీ ఆయనకు ఇప్పటికే 28ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆలోచించకుండా అధికారులు నియామకాలు చేశారు.

Updated Date - 2023-02-07T03:59:53+05:30 IST