గోడ గుట్టు రట్టు

ABN , First Publish Date - 2023-03-31T00:38:33+05:30 IST

ప్రభుత్వ అధికారులకు వాస్తు భయం పట్టుకుంది. ఇదే అవకాశంగా వసూళ్లకు తెరలేపారు. ఎంతో వసూలు చేసి కొంత మొత్తంతో గోడ కట్టారు.

 గోడ గుట్టు రట్టు
ఏర్పాటు చేసిన గోడ

గురజాలటౌన్‌, మార్చి 30: ప్రభుత్వ అధికారులకు వాస్తు భయం పట్టుకుంది. ఇదే అవకాశంగా వసూళ్లకు తెరలేపారు. ఎంతో వసూలు చేసి కొంత మొత్తంతో గోడ కట్టారు. మిగిలిన డబ్బుపై అఽధికారుల కన్ను పడింది. ఆ మొత్తం పంపకాల్లో వాటాలు కుదరకనో.. మరేదో కారణమో తెలీదు కానీ ఆ శాఖాధికారులే ఈ గుట్టు రట్టుకు ఉప్పందించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. గురజాలకు 2013లో ఆర్డీవో కార్యాలయం మంజూరైంది. కొన్నాళ్లు ఆర్డీవో కార్యాలయానికి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలోని ఓ గదిని కేటాయించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చొరవతో ఆర్డీవో కార్యాలయానికి సుమారు రూ.2 కోట్లు కేటాయించారు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలోనే నూతనంగా ఆర్డీవో కార్యాలయాన్ని నిర్మించారు. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులకు వాస్తు భయం పట్టుకుంది. వాస్తుదోషమని ఇరు కార్యాలయాల మధ్య గోడ కట్టాలని నిర్ణయించారు. ఇందుకు అధికారులంతా ఒకే తాటిపైకి వచ్చారు. ఈ క్రమంలో డివిజన్‌ పరిధిలోని సిమెంట్‌ ఫ్యాక్టరీల నిర్వాహకులతో మంతనాలు జరిపి గోడ నిర్మాణం పేరిట వసూళ్లకు దిగారు. కొందరిని బతిమాలారు.. మరికొందరిని భయపెట్టి సుమారు రూ.20 లక్షలు దాకా వసూలు చేశారని సమాచారం. ఇందులో రూ.10 లక్షల వరకు వెచ్చించి గోడ కట్టారు. కాగా మిగిలిన సొమ్ముపై అధికారుల కన్ను పడింది. వాటాలు వేసి పంచుకోవాలా లేదా దేనికైనా వినియోగించాలనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో అధికారుల మధ్య విభేదాలు రావడంతో వసూళ్ల వ్యవహారం బయటకు పొక్కింది.

మండిపడుతున్న కాంట్రాక్టర్లు

డివిజన్‌ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్‌కు రూ.68 లక్షలకు దాకా బిల్లులు రావాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్యాలయం నిర్మాణం ప్రారంభించగా అది పూర్తయ్యేసరికి ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి రావడంతో బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. సదరు కాంట్రాక్టర్‌ మూడేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా బిల్లులకు సంబంధించి అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. వారంలో రెండు మూడు రోజులపాటు ఆ కాంట్రాక్టర్‌ కార్యాలయం వద్దనే పడిగాపులు కాస్తున్నారు. బిల్లులు మంజూరు చేయించేందుకు ముందుకు రాని అధికారులు ఇలా అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసి గోడను నిర్మించి డబ్బులు దోచుకునేందుకు చూస్తున్నారని బహిరంగంగా మండిపడుతున్నారు.

చందాల ద్వారానే నిర్మాణం : ఆర్డీవో అద్దెయ్య

గోడ నిర్మాణానికి సిమెంట్‌ ఫ్యాక్టరీల నిర్వాహకులతో మాట్లాడిన మాట వాస్తవమే. అయితే వారు గోడ నిర్మాణానికి ముందుకు రాలేదు. దీంతో అధికారులు, సిబ్బంది చందాలు వేసుకుని గోడ నిర్మించారు.

Updated Date - 2023-03-31T00:38:33+05:30 IST