పీక్స్‌కు ఫేక్‌ పోరు

ABN , First Publish Date - 2023-02-21T02:54:36+05:30 IST

ఉన్నది లేనట్లు చూపడం ఓ కనికట్టు. లేనిది ఉన్నట్లు చూపడం మహా మాయ. ఓ వ్యక్తి వేలాది మంది ప్రజల సమక్షంలో తనను తాను బహిరంగంగా తిట్టిపోసుకుంటున్న వీడియో తయారు చేయడాన్ని ఏమంటారు? పిచ్చి వెర్రితలలు వేయడం అంటారు.

పీక్స్‌కు ఫేక్‌ పోరు

చంద్రబాబుపై విషప్రచారంలో ‘వైసీపీ’ వెర్రితలలు

గ్రాఫిక్స్‌.. ఏఐ టెక్నాలజీ జోడించి ఫేక్‌ వీడియోలు

అనని మాటలన్నట్లు ఎడిట్‌ చేస్తున్న పేటీఎం బ్యాచ్‌

తన పాలనను తానే తిట్టిపోస్తున్నట్లు గారడీ

అనధికార ఖాతాలతో సోషల్‌ మీడియాలో వైరల్‌

పీకే టీమ్‌ను తెచ్చుకుంది ఈ పనుల కోసమేనా?

మున్ముందు మరిన్ని రావొచ్చంటున్న నిపుణులు

అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఉన్నది లేనట్లు చూపడం ఓ కనికట్టు. లేనిది ఉన్నట్లు చూపడం మహా మాయ. ఓ వ్యక్తి వేలాది మంది ప్రజల సమక్షంలో తనను తాను బహిరంగంగా తిట్టిపోసుకుంటున్న వీడియో తయారు చేయడాన్ని ఏమంటారు? పిచ్చి వెర్రితలలు వేయడం అంటారు. ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న ప్రతిపక్షనేత చంద్రబాబును ఎదుర్కొనేందుకు అధికారపార్టీ సోషల్‌మీడియా ఇప్పుడు ఇదే పిచ్చితో ఊగిపోతోంది. ఇంటర్నెట్‌ ప్రపంచంలో గ్రాఫిక్స్‌ మాయాజాలంతో చంద్రబాబుపై కృత్రిమ దాడికి తెగబడుతోంది. చంద్రబాబు వ్యక్తిగతంగా తనను, తన పరిపాలనను బహిరంగ వేదికలపై, ప్రజాసమక్షంలో అడ్డగోలుగా తిట్టుకుంటున్నట్లుగా, అది నిజమే కదా అని ప్రజలు అంటున్నట్లుగా కొత్తరకం సాంకేతిక దాడికి దిగింది. అయితే, ఆ పనిలోనూ అధికార సోషల్‌మీడియా, దాని నియంత్రణలోని పేటీఎమ్‌ టీమ్‌లు అడ్డంగా దొరికిపోయాయి. కానీ, గ్రాఫిక్స్‌ మాయాజాలం, కట్‌, కాపీ, పేస్ట్‌, ఎడిటింగ్‌ గురించి తెలియని వారు... నిజమేనేమో అనుకునేంతగా ఆయా వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు గత ఏడాది డిసెంబరు 24న బొబ్బిలి పర్యటనకు వెళ్లారు. అదే రోజు రాత్రి బొబ్బిలిలో ప్రజాగ్రహసభలో అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ పాలనలో విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, వాటిని భరించలేక ప్రజలు సర్వనాశనం అయ్యారా? లేదా అంటూ ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పాలనలో విద్యుత్‌, ఆర్టీసీ, నిత్యావసర ధరల పెరుగుదల లేదని, ప్రజలు సంతోషంగా ఉన్నారని బాబు పేర్కొన్నారు. ఆ సభలో బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బేబినాయన కూడా ఉన్నారు.

బొబ్బిలి సభకు కృత్రిమ కోటింగ్‌...

అధికారపార్టీ సోషల్‌మీడియా చంద్రబాబు బొబ్బిలి ప్రసంగ వీడియోను ఎడిట్‌చేసింది. ప్రసంగంలో పలుచోట్ల వాడిన మాటలను కట్‌చేసి వాటి ఆధారంగా 36 సెకన్లపాటు ఫేక్‌ వీడియోను తయారు చేసింది. తెలుగుదేశం పాలనలో విద్యుత్‌, ఆర్టీసీ, నిత్యావసర ధరలు పెరిగాయని, ప్రజలు సర్వనాశయం అయ్యారంటూ బాబే స్పీచ్‌ ఇచ్చినట్లుగా వీడియోను తయారుచేశారు. ఇందుకు కొంత ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ని (ఏఐ)జోడించారు. 36 సెకన్లపాటు వీడి యోలో నిరంతరాయంగా బాబు ప్రసంగమే కనిపించేలా డెవల్‌పచేశారు. అధికారపార్టీ సోషల్‌మీడియా సభ్యులు అనధికారిక అకౌంట్ల నుంచి ‘టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజ ల పరిస్థితి’ అంటూ ట్యాగ్‌లైన్‌తో వీడియోను అప్‌లోడ్‌చేశారు. వీడియో దిగువ భాగంలో ‘ఓటమి భయంతో నిజాలు చెప్పిండు’ అని రిమార్క్స్‌ ఇచ్చారు. ఈ వీడియోలు చూసిన వారెవరయినా...చంద్రబాబు ఏమిటీ తన పరిపాలన గురించి ఇంత చెడ్డగా మాట్లాడుతున్నారు? ఇది నిజమేనా? అంటూ విస్తుపోతారు. అదో ఎడిట్‌చేసిన వీడియో అని, అది నిజం కాదని చాలా మందికి తెలియదు. ఇదే ఆ సోషల్‌మీడియాకు కావాల్సింది కూడా. జనాన్ని నమ్మించడం ద్వారా వారి అభిప్రాయాలను డిసైడ్‌ చేయడమే వారి అసలు ఉద్దేశం!

కట్‌.. కాపీ.. పేస్ట్‌..

36 సెకన్ల వీడియోను సాంకేతికంగా పరిశీలిస్తే మూడు చోట్ల కట్‌, కాపీ, పేస్ట్‌లు ఉన్నాయని టెక్‌ నిపుణులు రఘునందన్‌ తెలిపారు. బొబ్బిలి సమావేశంలోని కొన్ని అంశాలను గుదిగుచ్చి దాన్ని తయారుచేసినట్లుగా నిర్ధారించారు. అయితే, ఆ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం ఇప్పటికీ యూట్యూబ్‌తోపాటు అన్ని సోషల్‌మీడియా వేదికల్లో ఉంది. దాన్ని సాంతం పరిశీలిస్తే, రెండు విషయాలు కనిపిస్తాయి. ఒరిజినల్‌ వీడియోలో బాబు మాట్లాడుతున్నప్పుడు ఆయన పక్కనే టీడీపీ నేత బే బినాయన ఉన్నారు. అధికారపార్టీ సోషల్‌మీడియాసభ్యులు అప్‌లోడ్‌చేసిన వీడియోలోనూ ఆ టీడీపీ నేత బాబు పక్కనే ఉన్నారు. ఇక్కడ మారిందల్లా...బాబు ప్రసంగమే. ఒరిజినల్‌ వీడియోలో బాబు ప్రసంగం వైసీపీని విమర్శిస్తున్నట్లుగా ఉంటే, సోషల్‌మీడియాలో ఉన్న వీడియోలో బాబు తనను తానే తిట్టుకుంటున్నట్లుగా కంటెంట్‌ ఉంది. దీంతో ఇది ఫేక్‌ వీడియో అని స్పష్టమవుతోంది.

‘వివేకా’పైనా ఫేక్‌ వీడియో

వివేకా హత్యకేసుకు సంబంధించి చంద్రబాబు మాట్లాడిన మరో వీడియోను కూడా ఎడిట్‌చేసి సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌చేశారు. చంద్రబాబు ఓ బహిరంగ సభలో వైఎస్‌ వివేకా హత్యగురించి ప్రస్తావిస్తూ... ‘‘వివేకాను హత్య చేసిందెవరు? బాబాయిని హత్య చేసిందెవరు? నేను కదా? ఎవరు చేశారు? నేనే కదా?’’ అంటూ బాబే ఒప్పుకుంటున్నట్లుగా ఆ వీడియోను తయారు చేశారు. నిజానికి ఆ సభలో వివేకాను హత్యచేసిందెవరు? అన్న ప్రశ్నను, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిందెవరు? నేనే కదా అన్న రెండు వేర్వేరు మాటలను కలిపి ఆ ఫేక్‌ వీడియోను తయారు చేశారు.

పీకే టీమ్‌ పనేనా?!

చంద్రబాబును దెబ్బతీసేలా వీడియోలు తయారుచేయడం వె నుక పీకేటీమ్‌ సభ్యులు కూడా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. సాంకేతికంగా అనుభవం ఉన్న ఈ టీమ్‌ను ఫేక్‌ వీడియోలు తయారు చేయడానికే వైసీపీ అధిష్ఠానం తెచ్చిపెట్టుకున్నదా అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇందుకోసమే ఆ టీమ్‌కు కోట్లరూపాయలు సమర్పించుకుంటున్నారా....ఇదేనా వారి సృజనాత్మకత అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు రాజకీయ ఆధిపత్య పోరులో పార్టీలు హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి. ప్రజలను ప్రసన్నం చేసుకొని తమ వెంట నిలిచేలా ప్రజాస్వామిక విధానాలు పాటిస్తున్నాయి. కానీ, ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఫేక్‌వీడియోలు తెరమీదకు తీసుకొస్తున్నారు. వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణను తప్పుదోవపట్టించేలా వీడియోలు పుట్టించి వాటిని జనంమీదకు వదులుతుండటం అత్యంత ఆందోళనకరమని టెక్‌నిపుణులు రఘునందన్‌ పేర్కొన్నారు. ‘‘ ఫేక్‌వీడిమోలు, ఫొటోలు వ్యక్తుల జీవితాల్లో చాలా ప్రమాదకర పరిస్థితులను తీసుకొస్తాయి. రాజకీయాల్లో ఇవి మరింత అలజడిని సృష్టిస్తాయి. ప్రజలను తప్పుదోవపట్టించి వారిని గందరగోళంలో పడేస్తాయి. ఏది నిజమో? ఏది అబద్ధమో తెలుసుకోలేనంతగా ఫేక్‌వీడియోలు ఉండటంతో ప్రజలు వాస్తవికతను తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. గ్రాఫిక్స్‌, ఎడిటింగ్‌కు తోడు కొత్తగా దూసుకొస్తున్న ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీతో ఎన్ని ప్రయోజనాలున్నాయో, అంతకు రెట్టింపు ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పటికే వీడియోలు, ఫొటోలు మార్ఫింగ్‌ చేస్తున్నారు. నిజానికి, ఫేక్‌కు తేడా తెలియనంతగా టె క్నాలజీని వాడుకుంటున్నారు. దీన్ని రాజకీయ పార్టీ సోషల్‌మీడియా దుర్వినియోగం చేయడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఎన్నికలకు ముందే ఇలా ఉంటే, ఎన్నికల వాతావరణం వచ్చాక ఈ టెక్నాలజీ దుర్వినియోగం మరింత పెరిగే ప్రమాదం ఉంది. మున్ముందు ఇంకా ఎలాంటి వీడియోలు బయటకొస్తాయోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది. సోషల్‌మీడియాలో వచ్చే వీడియో, ఫొటో నిజమా? కాదా అని తెలుసుకునేలోపే అది వైరల్‌ అవుతుంది. ప్రజలకు చేరిపోతుంది. దాని వల్ల అప్పటికే నష్టం జరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఈ రోజు ఒకరికి జరిగింది. రేపు మరొకరికి అన్నట్లుగా సాగిపోతుంది’’ అని రఘునందన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-21T02:54:37+05:30 IST