మీసేవ కేంద్రాల్లో అన్ని డిజిటల్‌ సేవలకూ వీలు కల్పించండి

ABN , First Publish Date - 2023-03-02T03:29:16+05:30 IST

సిటిజన్‌ చార్టర్‌లో పేర్కొన్న విధంగా మీసేవ కేంద్రాల్లో అన్ని డిజిటల్‌ సేవలు అందించేందుకు వీలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

మీసేవ కేంద్రాల్లో  అన్ని డిజిటల్‌ సేవలకూ వీలు కల్పించండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): సిటిజన్‌ చార్టర్‌లో పేర్కొన్న విధంగా మీసేవ కేంద్రాల్లో అన్ని డిజిటల్‌ సేవలు అందించేందుకు వీలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ రఘునందనరావు బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. మీసేవ కేంద్రాలు అందిస్తున్న డిజిటల్‌ సేవల విషయంలో జోక్యం చేసుకోకుండా నిలువరించాలని, నిలిపివేసిన సర్వీసులను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మీసేవ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.యుగంధర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు గతంలో మాదిరిగానే డిజిటల్‌ సేవలన్నింటినీ అందించేందుకు మీ సేవ కేంద్రాలకు వీలుకల్పించాలని 2022 మేలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలుకాకపోవడంతో పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది.

Updated Date - 2023-03-02T03:29:16+05:30 IST