ఉద్యోగులూ ఐక్యత చాటండి
ABN , First Publish Date - 2023-03-15T03:42:47+05:30 IST
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డ్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర సమస్యల సాధన కోసం పోరాడుతున్నామని తెలిపారు.
నిరసన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు పిలుపు
పలు కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులకు విజ్ఞప్తి
అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డ్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర సమస్యల సాధన కోసం పోరాడుతున్నామని తెలిపారు. తాము పిలుపు ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో ప్రతి ఉద్యోగి పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. మంగళవారం ఆరోగ్యశాఖ డైరెక్టర్, ప్రణాళిక విభాగం ప్రధానకార్యాలయం, దేవదాయశాఖ కమిషనరేట్, ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయాల్లో ఏపీ జేఏసీ అమరావతి నేతలు పర్యటించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, రావాల్సిన బకాయిలను ప్రతి ఉద్యోగినీ కలిసి వివరించారు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేదని, జీతాలు, పెన్షన్లు 1వ తేదీన వేయకుండా ఇబ్బందులు పెడుతున్న కారణంగానే ఉద్యమ కార్యాచరణను ప్రారంభించామని ఉద్యోగులకు బొప్పరాజు తెలిపారు. యూనియన్లు, అసోసియేషన్లకు అతీతంగా అందరూ ఉద్యమానికి మద్దతు పలకాలని కోరారు. ఆయన వెంట పలిశెట్టి దామోదరరావు తదితరులున్నారు.