హమాలీలూ.. డీలర్లను డబ్బులు అడగొద్దు!
ABN , First Publish Date - 2023-02-21T03:25:35+05:30 IST
చౌకధరల దుకాణాల వద్ద సరుకులు లోడిండ్ లేదా అన్‌లోడ్ చేసినందుకుగాను డీలర్ల నుంచి హమాలీలు ఎలాంటి సొమ్ము వసూలు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
రేషన్ లోడింగ్, అన్‌లోడింగ్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): చౌకధరల దుకాణాల వద్ద సరుకులు లోడిండ్ లేదా అన్‌లోడ్ చేసినందుకుగాను డీలర్ల నుంచి హమాలీలు ఎలాంటి సొమ్ము వసూలు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయం 2019, మార్చి 8న పౌరసరఫరాల కార్పొరేషన్ కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్‌లో ఇప్పటికీ ఉనికిలోనే ఉందని గుర్తుచేసింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. విచారణను మార్చి 16కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సరుకులు అన్‌లోడ్ చేసినందుకుగాను హమాలీలు డీలర్ల నుంచి చార్జీలు వసూలు చేసేందుకు వీలు కల్పించడాన్ని సవాల్ చేస్తూ రేషన్ దుకాణదారుల సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి పి. శివప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రమేశ్ సుదర్శన్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. కార్పొరేషన్ జారీ చేసిన టెండర్లలో చార్జీలు వసూలు చేయకూడదనే షరతును ప్రస్తావించలేదన్నారు. పౌరసరఫరాల శాఖ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సరుకులు అన్‌లోడ్ ఖర్చులు భరించడం వల్ల కార్పొరేషన్‌పై ఏడాదికి రూ.33 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. ఇంటింటికీ రేషన్ సరఫరాతో డీలర్లపై పనిభారం తగ్గిందని, హమాలీ చార్జీలను ప్రభుత్వం రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆ వాదనలపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు.