జనాన్ని తేవాల్సిందే!

ABN , First Publish Date - 2023-05-26T02:44:56+05:30 IST

సెంటు భూమి పట్టాల పంపిణీ సభ కోసం సర్కారు బలవంతంగా జనసమీకరణకు పాల్పడుతోంది. రెండు జిల్లాల వలంటీర్లు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల మెడ మీద కత్తి పెట్టి మరీ జనసమీకరణ బాధ్యతలను అప్పగించింది.

జనాన్ని  తేవాల్సిందే!

వలంటీర్లు, కార్పొరేషన్‌ సిబ్బంది మెడపై కత్తి

వారిపై సీఎం రాజధాని సభ జన సమీకరణ బాధ్యత

రెండు జిల్లాల నుంచి 60 వేల లబ్ధిదారులు

వెంట ఇద్దరు కుటుంబసభ్యులనూ తేవాలి

ఎన్టీఆర్‌ , గుంటూరు జిల్లాల నుంచి 1,600 బస్సులు

గోదారి జిల్లాల నుంచీ భారీగా బస్సుల రాజధాని బాట

విజయవాడ, మే 25(ఆంధ్రజ్యోతి): సెంటు భూమి పట్టాల పంపిణీ సభ కోసం సర్కారు బలవంతంగా జనసమీకరణకు పాల్పడుతోంది. రెండు జిల్లాల వలంటీర్లు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల మెడ మీద కత్తి పెట్టి మరీ జనసమీకరణ బాధ్యతలను అప్పగించింది. లబ్ధిదారుల జాబితాలు వలంటీర్లకు అందజేశారు. ఆ జాబితాల ప్రకారం లబ్ధిదారులతో పాటు, ఇద్దరు కుటుంబసభ్యులను సభకు తీసుకువచ్చే బాధ్యతలను వలంటీర్లు, కార్పొరేషన్‌ సిబ్బంది మీద మోపటంతో.. గురువారం మధ్యాహ్నం నుంచే విజయవాడ నగరంలో లబ్ధిదారుల ఇళ్ల చుట్టూ వీరంతా ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల నుంచి 60 వేలమంది లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులను తరలించాలని సర్కారు నిర్ణయించింది. పార్టీ తరఫున కూడా స్థానికంగా జన సమీకరణకు నిర్దేశించినట్టు సమాచారం. పార్టీ నేతలు జన సమీకరణ చేసినా చేయకపోయినా.. 50 వేల మంది లబ్ధిదారులు అయితే కచ్ఛితంగా వస్తారు కాబట్టి సభ జయప్రదం అవుతుందని సర్కారు లెక్కలు వేసుకుంటోంది. సభకు లబ్ధిదారుల తరలింపు కోసం సర్కారు ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున ఉపయోగిస్తోంది. ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల నుంచి 1600 బస్సులను ఇందుకు ఉపయోగిస్తోంది.

వీటిలో 1200 ఆర్టీసీ, 400 ప్రైవేటు బస్సులను ఉపయోగిస్తోంది. ఆర్‌టీసీ విజయవాడ జోన్‌ పరిధిలో ఎన్టీఆర్‌ జిల్లా నుంచి 550 బస్సులను సమకూర్చాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ నగరం నుంచి 30 వేల మంది లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులను వీటిలో తరలించాలని పేర్కొనడంతో ఆర్టీసీ అధికారులు కంగుతిన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఆర్టీసీకి సుమారు వెయ్యి బస్సులుండగా, వాటిలో సగం పైనే ఈ సభ కోసం అడగటంతో ఆ మేరకు ప్రయాణికులకు బస్సులు కోతలు పడతాయి. దీంతో మండే ఎండల్లో బస్సులు చాలీ చాలక చాలా సమస్యలు చవిచూడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో.. విజయవాడ నుంచి 220 బస్సులు, మిగిలిన 330 బస్సులను ఇతర జిల్లాల నుంచి ఆర్టీసీ అధికారులు విజయవాడకు రప్పించారు. ఇక గుంటూరు జిల్లా నుంచి 400 ఆర్టీసీ బస్సులను సమకూర్చాల్సిందిగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇవి చాలవన్నట్టు విజయవాడ పరిధిలో 200, గుంటూరు పరిధిలో మరో 200 చొప్పున మొత్తం 400 ప్రైవేటు బస్సులను సమకూర్చే బాధ్యతలను రెండు జిల్లాల రవాణా శాఖలకు ప్రభుత్వం అప్పగించింది. బస్సులను విజయవాడలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డు, ఏలూరు రోడ్డు, కృష్ణలంక ఫీడర్‌ రోడ్డు, బస్‌స్టేషన్‌, చల్లపల్లి బంగ్లా, పాతబస్తీలలో సిద్ధంగా ఉంచారు. కాగా, రాజమహేంద్రవరంలో 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న మహాసభకు సభకు బస్సులు కావాలని కోరగా, ఒక్క బస్సును కూడా ఇచ్చేందుకు ఆర్టీసీ సుముఖత వ్యక్తం చేయలేదు. పైగా తూర్పుగోదావరి జిల్లా నుంచి అత్యధిక బస్సులను అమరావతిలోని సీఎం సభ కోసం రప్పించారు.

సీఎం సభకు వచ్చేవారికి ఆహార పంపిణీ బాధ్యతను రెండు జిల్లాల యంత్రాంగాలకు సర్కారు నిర్దేశించింది. రెండు జిల్లాల యంత్రాంగాలు పౌరసరఫరాల శాఖకు ఆహార పంపిణీ బాధ్యతలు అప్పగించారు. ఉదయానికల్లా బస్సులలో ఉన్నవారికి అవి అందించాలని ఆదేశాలు వచ్చాయి. బిర్యానీ, కేకు, బిస్కట్‌ ప్యాకెట్‌, మజ్జిగ ప్యాకెట్‌లను ఒక కిట్‌గా ప్యాకింగ్‌ చేసి శుక్రవారం ఉదయాన్నే బస్సులలోనే సరఫరాకు సన్నాహాలు చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగంపై పట్టాలను సిద్ధం చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఒత్తిళ్లు చేస్తున్నారు. వే లాది పట్టాలపై తహశీల్దార్లు సంతకాలు చేయాల్సి ఉంది. అందులో హద్దులు, ప్లాట్‌ నెంబర్లు తదితరాలు నమోదు చేయాల్సి ఉంది. ముందుగా 5 వేలు సిద్ధం చేసినా చాలని చెప్పి .. ఆ తర్వాత 10 వేలకు పెంచారు. సీఎం సభకు ఒక రోజు ముందు మరో 3 వేల పట్టాలను సిద్ధం చేయాల్సిందిగా ఎన్టీఆర్‌ జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించటంతో.. రాత్రింబవళ్లూ సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

Updated Date - 2023-05-26T02:44:56+05:30 IST