నేడు ‘స్కిల్‌’పై చర్చ!

ABN , First Publish Date - 2023-09-22T03:20:12+05:30 IST

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చించనున్నారు. శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

నేడు ‘స్కిల్‌’పై చర్చ!

టీడీపీ సరిగా వాయిదా తీర్మానం ఇస్తే అసెంబ్లీలో చర్చిద్దాం: బీఏసీ భేటీలో జగన్‌

27వ తేదీ వరకూ సమావేశాలు

శని, ఆదివారాలు మినహా మరో 4 రోజులు

బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ

మందడం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర

నేడు స్కిల్‌పై టీడీపీ పోటీ ప్రజెంటేషన్‌

అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చించనున్నారు. శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జోగి రమేశ్‌, అంబటి రాంబాబు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఎం ప్రసాదరావు, శాసనసభ సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించడంతో అధికార పక్షంతోనే కొనసాగింది. ఈ నెల 27వ తేదీ దాకా అసెంబ్లీని నిర్వహించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు సెలవు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసుపై టీడీపీ వాయిదా తీర్మానం అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. టీడీపీ వాయిదా తీర్మానాన్ని శుక్రవారం సరైన రీతిలో ప్రవేశపెడితే చర్చకు స్వీకరిద్దామని జగన్‌ అన్నారు. శాసనసభ సమావేశాల్లో రోజుకు రెండు అంశాల చొప్పున నాలుగు రోజుల్లో ఎనిమిది అంశాలను చర్చిద్దామని సమావేశంలో నిర్ణయించారు. స్కిల్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

టీడీపీ బహిష్కరణ

శాసనసభ, మండలి సభా వ్యవహారాల కమిటీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. సమావేశాల ప్రారంభం రోజు స్పీకర్‌, మండలి చైర్మన్‌ చాంబర్లలో ఈ సమావేశాలు జరగడం అనవాయితీ. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులను కూడా వీటికి పిలుస్తారు. టీడీపీ తరఫున శాసనసభ బీఏసీ సభ్యుడిగా ఉపనేత అచ్చెన్నాయుడు, మండలి బీఏసీ సభ్యుడిగా ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఉన్నారు. గురువారం బీఏసీ సమావేశం ప్రారంభం కావడానికి ముందు అసెంబ్లీ ఉప కార్యదర్శి సుబ్బారాయుడు, అసెంబ్లీ ప్రధాన భద్రతా అధికారి కొండల్‌ రెడ్డి టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చి సమావేశానికి రావాల్సిందిగా అచ్చెన్నాయుడును ఆహ్వానించారు. తాము రావడం లేదని ఆయన చెప్పారు. ‘మాది ఒకటే అజెండా. చంద్రబాబుపై మోపిన అక్రమ కేసులు ఎత్తివేసి ఆయనను బేషరతుగా విడుదల చేయాలి. ఈ ఒక్క అంశంపైనే చర్చిస్తాం. దానిపైనే పోరాడతాం. దీనికోసం బీఏసీ సమావేశానికి వచ్చి చర్చించాల్సిన అవసరం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. అధికారులు ఈ విషయాన్ని స్పీకర్‌కు నివేదించారు. దీనితో టీడీపీ సభ్యులు లేకుండానే బీఏసీ సమావేశం నిర్వహించారు. యనమల రామకృష్ణుడు కూడా బహిష్కరించడంతో శాసనమండలిలో ఇదే జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ బీఏసీ సమావేశాలను బహిష్కరించడం ఇదే ప్రథమం.

టీడీపీ నేతల పాదయాత్ర

వైసీపీ నుంచి సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి టీడీపీ ఎమ్మెల్యేల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రారంభానికి ముందు మందడం గ్రామంలోని పోలీస్‌ చెక్‌పోస్ట్‌ నుంచి అసెంబ్లీ భవనం వరకూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్ర నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్లకార్డులను పట్టుకొని నినాదాలు చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యేలు కూడా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఈ యాత్రలో పాల్గొన్నారు. టీడీపీ నిరసన కార్యక్రమంలో వారు పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. ప్రస్తుత సమావేశాల కాలం వరకూ అసెంబ్లీ నుంచి ముగ్గురు సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. వారిలో శ్రీధర్‌ రెడ్డి కూడా ఉన్నారు.

తొలిరోజే వేడి పుట్టించాం: టీడీపీ

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాల తొలి రోజు వేడి పుట్టించగలిగామని టీడీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సభలో మార్షల్స్‌ను భారీగా మోహరించడం ఎప్పుడూ చూడలేదని, రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇంతమంది సభ లోపల లేరని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. సభలో వైసీపీ ఎమ్మెల్యేలు తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘మేం వైసీపీ ఎమ్మెల్యేల ట్రాప్‌లో పడలేదు. సభలో హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుంది. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని టార్గెట్‌ చేసుకొని అధికార పక్ష సభ్యులు సభలో వ్యవహరించారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అనే అంశంపైనే మా పోరాటం కొనసాగుతుంది’ అని ఆయన అన్నారు.

పోలీసుల ఒత్తిడి

అసెంబ్లీ సమావేశాల తొలిరోజు టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి సస్పెండ్‌ అయ్యాక సమీపంలోని వీ స్క్వేర్‌ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు కాసేపు అక్కడ సమావేశమయ్యారు. ఇదే సమయంలో సమావేశ మందిర నిర్వాహకుడికి ఆ ప్రాంత పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫోన్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశం కావడానికి మందిరం ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, ఇవ్వవద్దని నచ్చచెప్పడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ‘మీరు అడిగితే పోలీసులు ఉండటానికి మేం వసతి ఇచ్చాం. మీ దగ్గర మేం చార్జి కూడా తీసుకోవడం లేదు. అదే మాదిరిగా టీడీపీ ఎమ్మెల్యేలు అడిగితే ఇచ్చాం. వాళ్లు ముందే బుక్‌ చేసుకొన్నారు. ఇప్పుడు రద్దు చేయలేం’ అని నిర్వాహకులు చెప్పారు.

నేడు పోటీ ప్రజెంటేషన్‌

చంద్రబాబుపై మోపిన స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు కేసుపై ప్రభుత్వ వైఖరిని వివరిస్తూ అధికార పక్షం శాసనసభలో శుక్రవారం ఒక పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు తెలియడంతో టీడీపీ కూడా పోటీ ప్రజెంటేషన్‌ సిద్ధం చేసుకొంది. అసెంబ్లీలో తమకు ఎలాగూ ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి అనుమతి రాదని భావిస్తుండటంతో బయట ఇవ్వడానికి వారు సన్నద్ధం అవుతున్నారు. శుక్రవారం అసెంబ్లీకి హాజరై తమ వాదన వినిపించడానికి అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అధికార పక్షం వైఖరిని బట్టి తమ వ్యూహం ఖరారు చేసుకోవాలని నిశ్చయించినట్లు సమాచారం.

Updated Date - 2023-09-22T03:20:12+05:30 IST