FAKE POSTS: పీక్స్‌కు ఫేక్‌!

ABN , First Publish Date - 2023-03-31T03:16:46+05:30 IST

రాష్ట్రంలో భయంకరమైన సైబర్‌వార్‌ మొదలైంది. ఓ రాజకీయ పార్టీ తెచ్చిపెట్టుకున్న సైబర్‌ ముఠాలు బరి తెగించేశాయి.

FAKE POSTS: పీక్స్‌కు ఫేక్‌!

కులాల మధ్య కార్చిచ్చే లక్ష్యంగా సైబర్‌వార్‌

పార్టీలు,మీడియా సంస్థల ఫేక్‌ అకౌంట్లే అస్ర్తాలు

అబద్ధం అని గుర్తించేలోపే ‘సామాజిక’ అలజడి

సోషల్‌ మీడియాలో సైబర్‌ ముఠాల బరితెగింపు

బాబు, టీడీపీ, జనసేనలే టార్గెట్‌గా ‘పోస్టులు’

ఫేక్‌ ఐడీలతో పొగ లేకుండానే నిప్పులగుండం

వీడియోలు, ఆడియోలనూ మార్ఫింగ్‌ చేస్తున్న వైనం

వివేకా హత్య విచారణ దారిమళ్లించేలా పోస్టులు

రెడ్డి x కమ్మ

జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరుగుతోంది. జగన్‌కు వరసకు సోదరుడు, వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డిని సీబీఐ విచారిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో.... వివేకాను హత్యచేసింది తానే అని, కుట్రదారు కూడా తానే అంటూ చంద్రబాబు ఓ పబ్లిక్‌మీటింగ్‌లో వ్యాఖ్యానించినట్లుగా ఓ వీడియోను ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లలో వదిలారు. ఈ కేసులో చంద్రబాబును సీబీఐ అరెస్ట్‌ చేయాలంటూ సైబర్‌ మీడియా ముఠా ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై చర్చను కాస్తా కమ్మ వర్సెస్‌ రెడ్డి సామాజిక వర్గాల మధ్య పంచాయతీగా మార్చే ప్రయత్నం చేసింది.

కాపులు x కమ్మ

టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి పరుడని, వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని జనసేన ముఖ్యనేత ఒకరు ఆరోపించినట్లుగా ఓ వీడియోను ట్విటర్‌లో ఇటీవల పోస్టు చేశారు. జనసేన అభిమాని పేరిట 450 మంది ఫాలోవర్లు ఉన్న ఓ ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా ఈ వీడియోను పోస్టు చేశారు. విపక్షాల మధ్య ఐక్యత ఉండాలని ఓ వైపు పిలుపునిస్తూ, మరోవైపు చంద్రబాబును తిట్టడం ఏమిటని ఆ వీడియో చూసిన వారికి అర్ధమవుతుంది. ఈ వీడియోపై చర్చను కాపు, కమ్మ వర్గాల మధ్య రగడగా మలిచారు.

కాపులు x బీసీ

‘‘తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. చంద్రబాబు ఇచ్చే 20 సీట్లు తీసుకొని పవన్‌ కల్యాణ్‌ టీడీపీకి మద్దతు ఇవ్వాలి’’ అని శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కూన రవికుమార్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో అన్నారంటూ ఓ పోస్టు సోషల్‌మీడియాలోకి వదిలారు. దాన్నే న్యూస్‌గా షేర్‌చేస్తున్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తల పేరిట తామే ఫేక్‌ అకౌంట్లు సృష్టించి.. ఆయా పార్టీల కార్యకర్తలు రగిలిపోతూ వ్యాఖ్యలు చేసుకుంటున్నట్టు, బీసీలను కాపులు, కాపులను బీసీలు దూషించుకుంటున్నట్లు కృత్రిమ గొడవలను సృష్టించే ప్రయత్నంచేశారు. నిజానికి, రవికుమార్‌ ఆ వ్యాఖ్యలు చేయలేదని పార్టీ నేతలే వివరణ ఇచ్చారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భయంకరమైన సైబర్‌వార్‌ మొదలైంది. ఓ రాజకీయ పార్టీ తెచ్చిపెట్టుకున్న సైబర్‌ ముఠాలు బరి తెగించేశాయి. కులాలు, మతాలు, పార్టీల మధ్య చిచ్చుపెట్టి విభజన తెచ్చే వ్యూహాలను సోషల్‌ మీడియా వేదికగా రచించి, దుర్మార్గంగా పోస్టులను వదులుతున్నాయి. వ్యక్తుల ముఖాలు, ఫొటోలను మార్ఫింగ్‌ చేయడమే సైబర్‌వార్‌లో ఇప్పటిదాకా నడిచింది. కానీ, ఈ ముఠాలు అంతకుమించి.. అన్నట్టు తెగించేశాయి. వీడియోలు, ఆడియోలను సైతం ఎడిట్‌ చేసి ‘సామాజిక’ అల్లకల్లోలాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రాంతం, జిల్లా, ఏరియాను బట్టి సెలక్టివ్‌ సోషల్‌వార్‌ను ఆ ముఠాలు ప్రారంభించాయి. కాపులు వర్సెస్‌ వెనుకబడిన కులాలు, కమ్మ వర్సెస్‌ కాపులు, ఎస్సీలు... ఇలా కులాల మధ్య అంతరాలను సృష్టించి, వాటిని రాజకీయ వైరంగా మార్చేందుకు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, షేర్‌చాట్‌, యూట్యూబ్‌, స్నాప్‌చాట్‌ తదితర ప్లాట్‌ఫామ్‌లలో అబద్ధాలు, విషప్రచారంతో కూడిన పోస్టులు పెడుతూ ప్రజలను గందరగోళపరుస్తున్నాయి. రాజకీయ పార్టీలు, సామాజిక వ్యవస్థలు, మీడియా, చట్టసభల ప్రతిష్ఠ, గౌరవాన్ని దెబ్బతీసేలా యథేచ్ఛగా తప్పడుప్రచారం ప్రారంభించాయి.

కలిసొచ్చిన ఖాకీల నిర్లిప్తత..

ప్రభుత్వాన్ని, అధికారపార్టీని విమర్శించే పోస్టులు, రాతలపైనే స్పందిస్తున్న పోలీసులు...మిగతా వ్యవస్థలపై వస్తున్న వాటి గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో సైబర్‌ముఠాలు చెలరేగిపోతున్నాయి. వ్యక్తుల గోప్యతను దెబ్బతీసేలా డేటా చోరీ చేయడం, ఫోన్‌లు, లాప్‌టా్‌పలు హ్యాక్‌చేసి డేటాను దొంగిలించడం, ఇంకా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొట్టేయడమే సైబర్‌ దాడి గా ఇప్పటిదాకా చూస్తున్నాం. కానీ ఆ పరిస్థితిని ఈ ముఠాలు మార్చేశాయి. సోషల్‌మీడియాను విషప్రచారంతో నింపేస్తున్నాయి. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న కంటెంట్‌లో నిజమేదో, అబద్ధమేదో నిర్థారించకోకుండా ఆ పోస్టులపై స్పందించడమే ఆ ముఠాలు కోరుకునేది తమ పోస్టుల ఆధారంగా రచ్చ జరగాలని, సామాజిక, రాజకీయ అశాంతి నెలకొనాలన్నదే ఆ ముఠాల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈవిషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అబద్ధమే నిజమని నమ్మించి సామాజిక యుద్ధంలో సమిధులను చేయడానికి ఆ ముఠాలు చేయని ప్రయత్నం లేదు. కాబట్టి తస్మాత్‌ జాగ్రత్త. నిజం కన్నా అబద్ధమే వేగంగా చేరుతుంది.

వేగంగా విస్తరిస్తున్న అబద్ధం..

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. టీడీపీ, ఇతర విపక్ష పార్టీలు అదే అభిప్రాయంతో ఉన్నాయి. విపక్షాల మధ్య ఉన్న ఈ ఏకాభిప్రాయాన్ని దెబ్బతీయడానికి సైబర్‌ ముఠా రంగంలోకి దిగింది. ప్రజారాజ్యం పార్టీని నడిపిన చిరంజీవి, నాడు యువరాజ్యం నేతగా ఉన్న పవన్‌కల్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ నేత ఒకరు 10 ఏళ్ల కిందట కొన్ని విమర్శలు చేశారు. మరో సందర్భంలో వైసీపీ నేతలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆ రెండు వీడియోలను ఈసైబర్‌ ముఠా ఎడిట్‌చేసింది. వైసీపీ నేతలపై చేసిన విమర్శలు, ఇతర దూషణలను కట్‌చేసి, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లను తిట్టినట్లుగా వీడియో, ఆడియోల్లో మార్పులు చేసింది. అందులో కాపులు, ఎస్సీలు, ఇతర కులాలను ఆయన దూషించినట్లుగా ఇతర వీడియోల్లోని మాటలను కట్‌చేసి దీనికి జతచేశారు. ఇప్పుడు ఆ వీడియోను తెలుగుదేశం పార్టీ పేరిటే ఓ ఫేక్‌ ఐడీని క్రి యేట్‌చేసి ట్విటర్‌, యూట్యూబ్‌ ఖాతాల నుంచి పోస్టుచేసింది. కాపులను టీడీపీ నేత తిడుతున్నారంటూ వీరే కామెంట్లు పెట్టడం, మిగతా వారు కూడా అదే లైన్‌లో పోస్టులు పెట్టేలా ప్రేరేపించడం ఈ ముఠా చేస్తోన్న పని. దీన్ని చివరకు అటు తిప్పి, ఇటు తిప్పి కాపులు, వర్సెస్‌ కమ్మ సామాజిక వర్గాల మధ్య వైరంగా మార్చేశారు.

‘ఫేక్‌ అకౌంట్లే’ అస్త్రాలు...

సైబర్‌వార్‌లో కీలకమైనవి ఫేక్‌ అకౌంట్లే. పార్టీలు, కులాలు, వ్యవస్థల మధ్య అగాధం పెంచి, అంశాంతిని నెలకొల్పాలంటే సైబర్‌ ముఠాలు ఆయా సంస్థల పేరిటే ఫేక్‌ అకౌంట్లు ఏర్పాటు చేస్తాయి. ఆ ఖాతాల నుంచే ఇతరులను దూషిస్తున్నట్లుగా పోస్టులు పెడుతుంటాయి. ఇలా టీడీపీ, జనసేన, ఇతర పార్టీల పేరిట సోషల్‌మీడియాలో కొన్ని వందల ఫేక్‌ అకౌంట్లను ఏర్పాటు చేశారు. టీడీపీ ఖాతాల పేరిట ఆ పార్టీ ప్రచారం చేస్తూనే....మధ్యలో జనసేనను, ఇతరులను దూషించే పోస్టులు పెడుతుంటారు. జనసేన అభిమానుల పేరిట ఖాతాను ఏర్పాటు చేసి... దానితో పవన్‌కల్యాణ్‌ నాయకత్వాన్ని పొగుడుతూనే, మధ్యలో చంద్రబాబునో, మరొకరినో తిడుతూ పోస్టులు పెడుతుంటారు. ఇలా ఎవరూ గుర్తించలేని ఫేక్‌ అకౌంట్లతో కంటికి కనిపించని సైబర్‌వార్‌ను నడుపుతున్నారు. నిజమేదో, అబద్ధం ఏమిటో నిర్ధారించుకోకుంటే సైబర్‌ముఠాల దెబ్బకు పార్టీలు, వ్యవస్థలు, సామాజిక వర్గాలు బాధితులుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

‘వివేకా హత్య’నూ వదల్లేదు..

008.jpg

2022 డిసెంబరులో బొబ్బిలిలో జరిగిన బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఆ సభకు సంబంధించిన వీడియోలోని అంశాలను ముందు, వెనుక కట్‌చేసి, వివేకా హత్య తాను చేసినట్టు చంద్రబాబే అంగీకరించినట్టు కొత్త వీడియోను వండివార్చారు. చంద్రబాబు టార్గెట్‌గా సైబర్‌దాడి జరిగిందంటూ ఆంధ్రజ్యోతి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అసలు విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య సీబీఐ విచారణ వేగం పుంజుకుంది. జగన్‌కు వరసకు సోదరుడు, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి నోటీసులు వెళ్లాయి. సరిగ్గా ఇదే సమయంలో వివేకాను హత్యచేసింది తానే అని, కుట్రదారుడిని కూడా తానే అంటూ చంద్రబాబు ఓ పబ్లిక్‌మీటింగ్‌లో వ్యాఖ్యానించినట్లుగా సదరు వీడియోను ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లో వదిలారు. వివేకాను హత్యచేసింది తాను అని చంద్రబాబే అంగీకరించారు, ఆయన్ను సీబీఐ అరెస్ట్‌ చేయాలంటూ ప్రచారం మొదలు పెట్టారు. దీనిపై చర్చ కాస్తా కమ్మ వర్సెస్‌ రెడ్డీ సామాజిక వర్గాల మధ్య పంచాయతీగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి సవివరంగా పేర్కొంటూ, ఒరిజినల్‌ వీడియోను ఆంధ్రజ్యోతి బయటపెట్టింది.

‘అచ్చం’.. దొరికిపోయారు...

1Fakef.jpg

‘‘జనసేనతో పొత్తు మాకు అవసరం లేదు. జనసేనకే మాతో అవసరం. పొత్తు లేకుండా మేమే 175 స్థానాల్లో ఒంటరిపోరాటం చేస్తామని టీడీపీ అధ్యక్షుడు అచ్చంనాయుడు ప్రకటించినట్లు ‘ఏబీఎన్‌’.. బ్రేకింగ్‌ న్యూస్‌ ప్రసారం చేసింది’’ అంటూ ఫేస్‌బుక్‌, ట్విటర్‌లోని కొన్ని ఖాతాల నుంచి ఫొటోలు పోస్టు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం తర్వాత ఆయన మాట్లాడినట్లుగా అందులో కంటెంట్‌ చూపారు. ఇది నిజమే అని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. ఓ ఫేక్‌ టీడీపీ ఖాతా నుంచే వాటిని పోస్టుచేయడంతో పార్టీ నిర్ణయం అదేనేమో... అని అంతా భావించారు. ఆయనను దూషిస్తూ కొందరు పోస్టులు కూడా పెట్టారు. జనసేన అభిమానులు, కార్యకర్తల పేరిటే కొన్ని ఫేక్‌ ఖాతాలు సృష్టించిన సైబర్‌ ముఠా... ఆయనను కులం, వర్గం పేరిట దూషిస్తూ పోస్టులు పెట్టింది. టీడీపీ పేరిట ఏర్పాటు చేసిన ఫేక్‌ ఖాతాలతో తిరిగి జనసేన కార్యకర్తలు, నేతలను కులం పేరుతో ఇదే ముఠా తిట్లదండకం మొదలుపెట్టింది. ఈ పోస్టులను చూసిన ‘ఆంధ్రజ్యోతి’.... అవి ఫేక్‌ అని తేల్చింది. ఎబీఎన్‌ ఎప్పుడు టీడీపీ నేత అచ్చం నాయుడు అని సంబోధించదు. అచ్చెన్న లేదా అచ్చెన్నాయుడు అని మాత్రమే ఆయన పేరును ప్రస్తావిస్తుంది. ఇక, ఏబీఎన్‌ టీవీలో ఇలాంటి బ్రేకింగ్‌ న్యూసే ప్రసారం కాలేదు. కాబట్టి ఈ పోస్టు నూటికి నూరు శాతం ఫేక్‌. ఎందుకిలా చేశారునుకుంటున్నారా? అదే సైబర్‌ ముఠా వ్యూహం. ఏబీఎన్‌ లేదా ఆంధ్రజ్యోతిలో పొత్తుల అంశంపై బ్రేకింగ్‌ న్యూస్‌, లేదా సాధారణ వార్తలు వస్తే అవి పార్టీ చెప్పిందనే అనుకుంటారు. ఇదే ఎత్తుగడను సైబర్‌ముఠా తన తప్పుడు ప్రచారానికి వాడుకుంది. ఏబీఎన్‌ లోగోను పెట్టి తప్పుడు వార్తలతో కూడిన పోస్టును సృష్టించింది. దాన్నే సోషల్‌మీడియాలో వదిలింది.

Updated Date - 2023-03-31T04:03:12+05:30 IST