బదిలీల్లో అవినీతి పారుదల!

ABN , First Publish Date - 2023-06-02T04:21:53+05:30 IST

జల వనరుల శాఖలో ప్రాజెక్టు నిర్మాణాలకు నిధులూ లేవు.. ప్రాజెక్టుల నిండా నీళ్లూ లేవు అనే పరిస్థితి

బదిలీల్లో అవినీతి పారుదల!

చక్రం తిప్పుతున్న మంత్రి పేషీలో కీలకాధికారి

పోస్టింగ్‌లను బట్టి బదిలీలకు రేట్లు..

నిర్భయంగా వసూలు

జాబితా లేకుండానే

వారంలో విధుల్లో చేరాలంటూ సర్క్యులర్‌

విస్తుపోతున్న జల వనరుల శాఖ ఇంజనీర్లు

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): జల వనరుల శాఖలో ప్రాజెక్టు నిర్మాణాలకు నిధులూ లేవు.. ప్రాజెక్టుల నిండా నీళ్లూ లేవు అనే పరిస్థితి! కానీ ఇంజనీరింగ్‌ సిబ్బంది బదిలీల్లో అవినీతి మాత్రం ఏరులై పారుతోంది! బదిలీల ప్రక్రియలో చేతివాటానికి బార్లా గేట్లెత్తేశారు! బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఇంజనీరింగ్‌ అధికారులకు కావాల్సిన చోట పోస్టింగ్‌ ఇప్పించేందుకు ఆ శాఖ మంత్రి పేషీలోని ఒక కీలకాధికారి లంచాలు బొక్కుతున్నారని ఇంజనీరింగ్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇచ్ఛాపురం నుంచి తడ దాకా మంత్రి పేషీ అధికారి పేరే వినిపిస్తోంది. వాస్తవానికి బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు బుధవారంతో గడువు ముగిసిపోయింది. పోస్టింగ్‌లకు సంబంధించి పేషీ నుంచి మంత్రికి పేర్లు వెళ్లాయి. వాటిని మంత్రి ఆమోదించారు. ఇంతలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ తన కుమారుని గ్రాడ్యుయేషన్‌ కాన్వొకేషన్‌ కోసమని అమెరికా వెళ్లారు. ఆయన శుక్రవారం తిరిగి విధుల్లో చేరుతారు. ప్రస్తుతం జల వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్యతలను ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్వామలరావు పూర్తి అదనపు బాధ్యతలతో నిర్వహిస్తున్నారు. తన బాధ్యత తాత్కాలికమే అయినందున బదిలీల ప్రక్రియలో ఆయనా జోక్యం చేసుకోలేదు. కానీ, శశిభూషణ్‌ కుమార్‌ వచ్చేలోగా బదిలీలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించేందుకు జల వనరుల శాఖ మంత్రి పేషీలోని కీలక అధికారి సిద్ధమయ్యారు. పరిపాలనా ఈఎన్‌సీ, మంత్రి అంబటి రాంబాబు మధ్య బదిలీలకు సంబంధించి ఇంజనీరింగ్‌ ఉద్యోగుల నైపుణ్యాలపైనా, సమర్థతపైనా చర్చలు సాగాయి. ప్రాథమికంగా ఒక జాబితా తయారైంది. ఇందులో పోలవరం సాగునీటి ప్రాజెక్టులో ఐదేళ్లు పూర్తి చేసుకున్నవారూ ఉన్నారు. గత ఏడాది జరిగిన బదిలీల సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అత్యంత కీలకమైనది కావడంతో ఇంజనీరింగ్‌ అధికారులను బదిలీ చేయలేదు. ఈసారి ఈ ప్రాజెక్టు పరిధిలోని వారినీ బదిలీ చేయాలని నిర్ణయించి, ప్రాథమికంగా జాబితాను రూపొందించారు. ఈ జాబితా ఆధారంగా ఇంజనీరింగ్‌ అధికారుల నుంచి మంత్రి పేషీలోని ఆ కీలకాధికారి చేతికి పనిచెప్పారన్న ఆరోపణలు వినిస్తున్నాయి. ప్రాజెక్టుల వారీగా, జిల్లాల వారీగా పోస్టింగ్‌లను బట్టి బదిలీలకు ఆ అధికారే రేట్లు ఖరారు చేశారు. దీన్ని ఆయన నిర్భయంగానే వసూలు చేస్తుండటంతో జల వనరుల శాఖలో ఇదే ప్రధాన చర్చగా మారింది.

కొసమెరుపు.. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి బుధవారంతో గడువు ముగిసింది. దీంతో ఎవరెవరిని ఎక్కడెక్కడికి బదిలీ చేశారో జాబితాను ప్రకటించాల్సి ఉంది. కానీ, జలవనరులశాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు (డీఈఈ), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల (ఏఈఈ)ల బదిలీలు జరిగిపోయాయని, వారం రోజుల్లో ఇచ్చిన వర్క్‌ స్టేషన్లలో జాయిన్‌ కావాలంటూ జల వనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (పరిపాలన) పేరిట సర్క్యులర్‌ జారీ అయింది. అయితే, ఈ సర్క్యులర్‌కు ఎవరెవరికి ఎక్కడెక్కడ పోస్టింగ్‌ ఇచ్చారోనన్న జాబితాను మాత్రం జత చేయలేదు. దీన్నిబట్టి బదిలీలకు సంబంధించి ఏం మతలబు జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఈ అవినీతిపైనే శాఖలో విస్తృత చర్చ జరుగుతోంది!.

Updated Date - 2023-06-02T04:21:53+05:30 IST