CM JAGAN : అవే అబద్ధాలు!

ABN , First Publish Date - 2023-01-27T02:34:34+05:30 IST

సంక్షేమ పథకాలపై నోరుపట్టని అసత్యాలు ప్రచారం చేసుకునే వైసీపీ సర్కారు, అవే అబద్ధాలను రాజ్యాంగపదవిలో ఉన్న గవర్నర్‌తోనూ చెప్పించింది.

CM JAGAN : అవే అబద్ధాలు!

వేదిక మారొచ్చు.. పలికే వ్యక్తి గవర్నరే కావొచ్చు.. అది త్రివర్ణ పతాకం రెపరెపలాడే గణతంత్ర దినోత్సవమే అయ్యుండొచ్చు.. అయినా జగన్‌ ప్రభుత్వం చెప్పే అబద్ధాల్లో మాత్రం మచ్చుకు కూడా మార్పు ఉండదు. ఏదో ఒకటి అయితే పొరపాటనుకోవచ్చు. కానీ ఆసాంతం అవే అవాస్తవాలైతే ఏమనుకోవాలి? గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్‌తో ప్రభుత్వం పలికించిన ప్రసంగం నిండా అసత్యాలు, అర్ధసత్యాలే.

ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో ప్రభలతీర్థం శకటం ఆకట్టుకుంది. కోనసీమలో జరిగే సంక్రాంతి పండుగ, ప్రభలతీర్థం విశిష్టతను శకటం ద్వారా కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

జెండా సాక్షిగా గవర్నర్‌తో పలికించిన జగన్‌ సర్కారు

లేని అభివృద్ధిపై గణతంత్ర వేదికపై అంకెల గారడీ

ప్రసంగ పాఠంలో సచివాలయాలు, వలంటీర్లు

వాటితోనే గ్రామ స్వరాజ్యం సాకారమైందని ఏకరువు

అధోగతిలో సబ్‌ప్లాన్‌.. అయినా దేశంలో అగ్రస్థానమట!

అమ్మఒడికి ఇచ్చేది 13 వేలు.. చెప్పించింది 15 వేలు

త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజులిస్తున్నారట!

ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్క క్వార్టర్‌కూ ఇవ్వలేదు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సంక్షేమ పథకాలపై నోరుపట్టని అసత్యాలు ప్రచారం చేసుకునే వైసీపీ సర్కారు, అవే అబద్ధాలను రాజ్యాంగపదవిలో ఉన్న గవర్నర్‌తోనూ చెప్పించింది. అభివృద్ధి, అప్పులపై చేస్తున్న అంకెలగారడీని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చేతికి ఇచ్చిన ప్రసంగ పాఠంలోనూ కొనసాగించింది. అధికారంలోకి వచ్చిన గత మూడున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏ ఊళ్లోనూ రోడ్లమీద ఒక్క తట్ట మట్టి పోయలేదు. కానీ, ఊరూరా అభివృద్ధి-ఇంటింటా సమృద్ధి అంటూ ఆయన నోట పలికించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పినట్టు చెప్పుకోవడం మరో వింత. గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేసి పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లు సైతం గగ్గోలు పెట్టడం అసలు వాస్తవం. సచివాలయాల వ్యవస్థ తెచ్చిన తర్వాత సర్పంచ్‌లకు కూర్చునేందుకు గ్రామాల్లో సీటు లేదు. ఊళ్లో పరపతి లేదు. 2.65 లక్షల మంది సొంత పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించుకుని వారు లేనిదే పేదలకు ఏ పనులు కావన్న సంకేతాలు పంపుతూ.. సర్పంచులను డమ్మీలను చేసేశారు. బియ్యం కార్డ్‌ను దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో, పింఛన్‌ కార్డ్‌ను అభ్యర్థన అందిన 10 రోజుల్లో ఇస్తామని గవర్నర్‌తో చెప్పించింది తెంపరితనమే. అర్హత కలిగి పథకం అందనివారికి దరఖాస్తు చేసుకున్న ఆరు నెలలకు లబ్ధిని అందిస్తామని వైసీపీ సర్కారే ఆర్భాటంగా ప్రకటించుకుంది కూడా.. ప్రభుత్వంపై ప్రజల్లో ఏమేర వ్యతిరేకత ఉందో స్వయానా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో చవిచూస్తున్నారు. అయితే ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం వదిలిపెట్టకుండా.. తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. ‘ఇదొక అత్యద్భుతమైన కార్యక్రమం’ అని చివరకు గవర్నర్‌తోనూ చెప్పించేశారు. ఉన్న పరిశ్రమలను తరిమేయడం లేక కక్షకట్టి మట్టుపెట్టడం చేస్తూ... మహిళలకు ఆర్థిక సాయం అందించి.. వారిని కొత్తగా పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పించడం వింతల్లోకి వింత. ఇదంతా చూసినవారు.. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా ప్రజలను నమ్మించవచ్చునేను గోబెల్స్‌ దారిలో జగన్‌ ప్రభుత్వం నడుస్తున్నదని వ్యాఖ్యానిస్తున్నారు.

సబ్‌ప్లాన్‌పై ఫక్తు అబద్ధాలు...

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకావడం లేదని ఎవరిని అడిగినా చెప్తారు. సబ్‌ప్లాన్‌ నిధులన్నీ నవరత్నాలకు మళ్లించి అందరికీ ఇచ్చినట్లే ఎస్సీ, ఎస్టీలకు కూడా నవరత్నాలు అమలు చేస్తుండటమే దీనికి కారణం. వాస్తవం ఇలా ఉండగా.. ఎస్సీ ఉపప్రణాళికను అత్యంత సమర్థవంతంగా అమలుచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించినట్టు గవర్నర్‌తో చెప్పించారు. నిజానికి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పోస్టుమెట్రిక్‌, ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్పులేవీ రాష్ట్రంలో విద్యార్థులకు అందడం లేదు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసమంటూ జగనన్న విద్యాదీవెన, కొంత మంది విద్యార్థులకు వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెనను ఆర్భాటంగా ప్రకటించి.. అత్తెసరుగా అమలు చేస్తోంది. ఉదాహరణకు వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని చెప్పారు. వాస్తవంలో ఏ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో వసతి దీవెన అందించిన దాఖలాల్లేవు. కేంద్రమిచ్చిన స్కాలర్‌షిప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నా.. విద్యార్థులకు మాత్రమే అరకొరగానే అందిస్తోంది. నివేదికలు మాత్రం ఆర్భాటంగా కేంద్రానికి సమర్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి పంపిన తప్పుల తడకల నివేదికల ఆధారంగా ఇలాంటి ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నేతిబీర చందమే...

మహిళా సాధికారత, సుస్థిర జీవనోపాధి కల్పన గురించి జగన్‌ చేసే ప్రకటనలు నేటిబీర కాయ చందం లాంటివి. నవరత్నాల ద్వారా మహిళలకు ఏటా ఇస్తున్న రూ.18750లను వివిధ పద్దుల కింద చూపించి అవే పెట్టుబడులుగా బుక్‌ అడ్జె్‌స్టమెంట్‌లు చేసి గొప్పలు చెప్పుకొంటున్నారు. బ్యాంకులు గానీ, ప్రభుత్వం గానీ మహిళలకు వ్యాపారాభివృద్ధి కోసం ప్రత్యేకంగా రుణ సదుపాయాలు కల్పించిన పరిస్థితి రాష్ట్రంలో లేదు. పైగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు కారణంగా స్వయం ఉపాధి మహిళల్లో పొదుపు స్ఫూర్తి కూడా దెబ్బతింది. ‘జగనన్న తోడు’ అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప చిరు వ్యాపారులకు ఈ పథకం పెద్దగా ఉపయోగపడిన పరిస్థితి లేదు. ప్రతి మీటింగ్‌లో రాష్ట్ర సర్కారు అది చేస్తోంది.. ఇది చేయబోతోంది అంటూ సీఎం జగన్‌ ఊదరగొడుతుంటారు. ఇప్పుడు ఆ బాధ్యతను గవర్నర్‌పై పెట్టినట్టు ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2023-01-27T03:44:41+05:30 IST