CM Jagan: పేదల ముసుగులో రైతుపై వార్‌!

ABN , First Publish Date - 2023-05-27T03:09:05+05:30 IST

సీఎం జగన్‌ అమరావతి రైతులపై అక్కసు వెళ్లగక్కారు. న్యాయం కోసం పోరుబాట పట్టిన అన్నదాతలను విలన్లుగా చిత్రీకరించేందుకు ప్రయ త్నించారు. అమరావతి గడ్డపై ఆయన సభను నిర్వహించడం ఇదే తొలిసారి.

CM Jagan: పేదల ముసుగులో రైతుపై వార్‌!

రాజధాని ఒప్పందాలకు గంతలు

పేదలకు, రైతులకు మధ్య చిచ్చుకు యత్నం

‘పెత్తందార్ల’ంటూ రైతులపై జగన్‌ విషం

రైతులిచ్చిన భూముల్లోనే సెంటు పట్టాలు

తిరిగి వారినే విలన్లుగా చిత్రీకరించే దుర్మార్గం

కోర్టు తీర్పుపై మంత్రుల అసత్య ప్రచారాలు

విజయవాడ, మే 26 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ అమరావతి రైతులపై అక్కసు వెళ్లగక్కారు. న్యాయం కోసం పోరుబాట పట్టిన అన్నదాతలను విలన్లుగా చిత్రీకరించేందుకు ప్రయ త్నించారు. అమరావతి గడ్డపై ఆయన సభను నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సభావేదికగా రాజధాని రైతులకు, సెంటుస్థలం పేద లబ్ధిదారులకు మధ్య చిచ్చుపెట్టే ప్రమాదకర క్రీడకు జగన్‌ తెరతీశారు. భూములిచ్చి త్యాగం చేసిన రైతులను పెత్తందారులుగా దుయ్యబట్టారు. పేదల ఇళ్లకు ‘పెత్తందారులు’ అడుగడుగునా న్యాయస్థానాల్లో అడ్డుపడ్డారని అబద్ధాలు వల్లె వేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఇంత సమయం పట్టడానికి అమరావతి పెత్తందారులే కారణమని కట్టు కఽథలు అల్లారు. అమరావతి రైతులు రాజధాని కోసం ఇచ్చిన భూములలో పేదలకు లే అవుట్లు వేశామన్న విషయాన్ని మరిచిపోయి.. వారే మీకు పట్టాలు రాకుండా అడ్డు పడ్డారంటూ వారి త్యాగాన్ని అవమానపరిచారు. అమరావతి రాజధాని కోసం 12 వేల మందికిపైగా రైతులు చేసిన త్యాగం ఫలితంగా 34 వేల ఎకరాల భూములు సమకూరాయి. రైతులకు ఇచ్చిన హామీలు, వారితో జరిగిన ఒప్పందాలు, రాజధాని అభివృద్ధి ప్రణాళికలు ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియవా అని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమరావతి రాజధాని విధ్వంస చర్యలకు ముఖ్యమంత్రి పూనుకున్నారు. ముందుగా శాశ్వత రాజధాని పనులను నిలిపివేశారు. ఆ తర్వాత జరుగుతున్న రాజధాని భవనాల పనులను ఆపించేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు బ్రేకులు వేశారు. రైతుల ప్లాట్ల అభివృద్ధి వంటివి గాలి కొదిలేశారు. అమరావతికి ప్రతిష్ఠాత్మక సంస్థలు, ప్రాజెక్టులు రాకుండా మోకాలడ్డారు. సీఆర్‌డీఏ చట్టాన్ని తుంగలో తొక్కి మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అమరావతి భవిష్యత్తుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, చెప్పకుండా .. ఇళ్లపట్టాలు ఇచ్చిన పేదలకు అమరావతి రైతుల పట్ల అసహ్యభావాన్ని కలిగించేలా కయ్యానికి కాలుదువ్వేలా రెచ్చగొట్టారు.

ఈ అంశాలన్నింటినీ జగన్‌ ప్రస్తావించకుండా, పేద లబ్దిదారుల మెదళ్లను కలుషితం చేసే ప్రయత్నం చేశారు. అమరావతిలో బయటవారెవరికీ ఇళ్లు ఇవ్వకూడదంటూ రాజధాని రైతులు అడ్డుపడినట్టుగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చెప్పుకొచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దని అమరావతి రైతులు అనలేదు. పైగా సెంటు భూమి స్థానంలో, ఇంకా ఎక్కువ సెంట్ల స్థలం ఇవ్వమని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అమరావతిలో భూముల ధరలు ఎంతో ముఖ్యమంత్రికి తెలియదన్నట్టుగా .. ఎంపీ నందిగ ం సురేశ్‌ను అడిగితే.. గజం రూ. 17 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉందని తెలిసిందని ప్రస్తావిస్తూ....తాను లబ్దిదారులకు 7 నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే సెంటు స్థలాన్ని ఇళ్ళ పట్టాలు ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకున్నారు. వాస్తవానికి ఈ స్థాయిలో ధరలు పెరగటానికి కారణమెవరో జగన్‌కు తెలియదా ? అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాతే ఈ ప్రాంత భూముల ధరలు పెరిగాయి. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాకే పతాక స్థాయిలో ధరలు పెరిగాయి. ప్రస్తుతం రాజధాని విధ్వంసానికి వైసీపీ సర్కారు పూనుకున్నా.. భవిష్యత్తులో అయినా పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయన్న ధైర్యంతో భూముల ధరలు ఇంకా కాస్తో కూస్తో స్థిరంగానే ఉన్నాయి. .

Untitled-5.gif

బాబు జపం చేసిన సీఎం, మంత్రులు.. శ్రీలక్ష్మి నవ్వులు

ఇళ్ళ పట్టాల పంపిణీ సభలో జగన్‌ దగ్గర నుంచి మంత్రుల వరకు.. అంతా చంద్రబాబు జపం చేశారు. 5023 ఇళ్లను లబ్ధిదారులకు వారంరోజులలో అందిస్తామని చెబుతూ.. వాటిని తానే కట్టినట్టు చంద్రబాబు అంటున్నారని జగన్‌ అన్నారు. పెత్తందారులకు చంద్రబాబు కొమ్ము కాస్తున్నారన్నారు. మంత్రులూ అదే బాటలో నడిచారు. చంద్రబాబుపై వారంతా విమర్శలు చేస్తున్న తరుణంలో వేదిక పై ఉన్న మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీ నవ్వులు చిందిస్తూ కనిపించారు.

మంత్రుల అడ్డగోలు వాదనలు...

అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీకి సంబంధించి నాలుగేళ్లపాటు చేసిన న్యాయపోరాటం వల్లే అత్యున్నత న్యాయస్థానం అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు మంత్రులు వక్రభాష్యాలు చెప్పారు. మంత్రులు మేరుగ నాగార్జున, సురేశ్‌, జోగి రమేశ్‌.. ఇదే వరుసలో మాట్లాడారు. వాస్తవానికి న్యాయస్థానాలు ఇంకా తుది తీర్పు ఇవ్వనేలేదు. ఇళ్లపట్టాలపై హక్కు అప్పుడే ఏర్పడదని, తుది తీర్పుకు లోబడి అర్హత ఉంటుందని కోర్టు నిర్దేశించింది. దీనిని కూడా కప్పిపెట్టి....మంత్రులు పచ్చి అబద్ధాలు ఆడేశారు.

Updated Date - 2023-05-27T05:48:35+05:30 IST