మొదటిసారి రిమాండ్‌ లో చంద్రబాబు

ABN , First Publish Date - 2023-09-11T03:18:04+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మొదటిసారి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు వెళ్లారు.

మొదటిసారి రిమాండ్‌ లో చంద్రబాబు

45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడే

గతంలో పలు సమస్యలపై పోరాట సందర్భాలలో అదుపులోకి తీసుకున్నా వదిలేసిన పోలీసులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మొదటిసారి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు వెళ్లారు. గతంలో ఎప్పుడూ ఈ పద్ధతిలో అరెస్టు కాలేదు. ఆయన అనేకసార్లు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కేసులు మోపినా అరెస్టు చేయలేదు. మొదటిసారి వైసీపీ ప్రభుత్వం ఆ పని చేసింది. 1978లో మొదటిసారి చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. 1981లో మంత్రి అయ్యారు. 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 14 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఐదేళ్లు ప్రతిపక్ష స్థానంలో ఉపనేతగా ఉన్నారు. ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన గతంలో రెండున్నర రోజులు మహారాష్ట్ర పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి 2011లో ఆ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. మహారాష్ట్ర పోలీసులు ఆయన్ను సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకొని సమీపంలోని ఒక భవనంలో నిర్బంధంలో ఉంచారు. వెనక్కు వెళ్లాలని పోలీసులు కోరగా ఆయన నిరాకరించారు. రెండున్నర రోజులు అక్కడ నిర్బంధంలో ఉంచి తర్వాత బలవంతంగా ఒక ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ పంపేశారు. కేసులు మాత్రం పెట్టలేదు. ఇక 2012లో రైతు సమస్యలపై ఆయన హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేశారు.

నాలుగు రోజుల తర్వాత పోలీసులు ఆయన్ను తెల్లవారుజామున అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు. అప్పుడు కూడా కేసు పెట్టలేదు. 2005లో బేగంపేట విమానాశ్రయం పేరును కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ ప్రధాని పర్యటన సమయంలో ఆయన ధర్నా చేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని పాతబస్తీలో కొంతసేపు ఒక స్టేడియంలో నిర్బంధంలో ఉంచి తర్వాత వదిలేశారు. గతంలో ఓసారి హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌కు సమీపంలో భీంరావు వాడ పేరుతో ఉన్న పేదల బస్తీని బలవంతంగా ఖాళీ చేయించడంపై ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. అప్పుడు కూడా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని తర్వాత వదిలిపెట్టారు. ఈ సంఘటనల్లో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచే అవసరం ఎప్పుడూ రాలేదు. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం లేదా అసలు ఆ అవసరమే లేకుండా పంపేశారు. మొదటిసారి వైసీపీ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసి నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చింది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో శనివారం ఉదయం ఆయన్ను అరెస్ట్‌ చేయగా, ఆదివారం సాయంత్రం ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ ప్రభుత్వ హయాంలోనే ఆయనపై మొదటిసారి అవినీతి ఆరోపణలతో నేరపూరిత అభియోగాలు మోపారు.

Updated Date - 2023-09-11T03:18:04+05:30 IST