Chandrababu : మధ్యంతర బెయిల్‌పై అభ్యంతరముంటే సుప్రీంకు వెళ్లండి
ABN , First Publish Date - 2023-11-01T02:57:52+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరుపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి సూచించింది.
ఫలానా విధంగా ఉత్తర్వులివ్వాలని నిర్దేశించలేరు
అదనపు షరతులు విధించాలన్న సీఐడీ పిటిషన్
సందర్భంగా ఏఏజీకి హైకోర్టు స్పష్టీకరణ
పిటిషన్ పరిష్కరించేదాకా రాజకీయ ర్యాలీలొద్దు
స్కిల్‌పై మీడియా సమావేశాలూ పెట్టొద్దు
చంద్రబాబు లాయర్లకు కోర్టు స్పష్టీకరణ
అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరుపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి సూచించింది. బెయిల్‌కు సంబంధించి ఫలానా విధంగా ఉత్తర్వులు ఉండాలని కోర్టును నిర్దేశించలేరని తేల్చిచెప్పింది. మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి బయటకు వస్తున్న చంద్రబాబు ఎలాంటి పత్రికా సమావేశాలు, రాజకీయ ర్యాలీలు నిర్వహించకుండా అదనపు షరతులు విధించాలని కోరుతూ సీఐడీ అధికారులు మంగళవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు డీఎస్సీ స్థాయి అధికారులు ఆయన రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించి కోర్టుకు నివేదికలు అందజేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ అనుబంధ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు విచారణ చేపట్టారు. ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. దీనిపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మధ్యంతర బెయిల్ మంజూరు చేశామన్నారు. అదనపు షరతులు విధించాలని సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులకు సూచించారు. దానిపై బుధవారం విచారణ జరుపుతామన్నారు. దీనిని పరిష్కరించేంతవరకు రాజకీయపరమైన ర్యాలీలు, కేసుకు సంబంధించి మీడియా సమావేశాలు నిర్వహించవద్దని, బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఆదేశించారు.