Chandrababu : జైలు పక్షుల వల్లే ఈ దుస్థితి

ABN , First Publish Date - 2023-07-21T03:04:48+05:30 IST

జైల్లో ఉండాల్సిన వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Chandrababu : జైలు పక్షుల వల్లే   ఈ దుస్థితి

జగన్‌ పాలన రాష్ట్రానికి భస్మాసుర హస్తం: బాబు

టీడీపీలో చేరిన ఉంగుటూరు వైసీపీ నేతలు

అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): జైల్లో ఉండాల్సిన వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్‌ పాలన రాష్ట్రం పాలిట భస్మాసుర హస్తంలా మారిందని విమర్శించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరిన సందర్భంగా పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ‘‘జగన్‌ పాలనలో కొత్తవి నిర్మాణం చేయకపోగా ఉన్నవి కూడా నాశనం చేసి ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి నెడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. పూర్తి చేయకపోగా బాధ్యత లేకుండా వ్యవహరించి దానిని గోదాట్లో ముంచేశారు.

ఒకేసారి 50లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అతిపెద్ద ప్రాజెక్టు అది. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకొని నాశనం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారు. ఏది మన రాజధాని అంటే ఏం చెప్పాలో తెలియని స్థితికి తీసుకువెళ్లారు. బాదుడు అంటే ఎలా ఉంటుందో కరెంటు చార్జీల్లో చూపిస్తున్నారు. ప్రతి నెలా బిల్లులు పెరిగిపోతున్నాయి. నాలుగేళ్లలో రూ.57వేల కోట్లు కరెంటు చార్జీల రూపంలో ప్రజల నెత్తిన వేశారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెంచలేదు. సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2కు దొరుకుతుంటే ప్రజలపై రూ.57 వేల కోట్ల భారం ఎందుకు మోపాల్సివచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆక్వా రంగానికి మనం కరెంటు చార్జీలు తగ్గిస్తే, జగన్‌ నాన్‌ జోన్‌ అంటూ చార్జీలు పెంచాడు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఆక్వారంగానికి యూనిట్‌ రూపాయిన్నరకు ఇస్తుంది. టీడీపీ ప్రభుత్వం ఐటీ ఉద్యోగాలు ఇస్తే, జగన్‌ ప్రభుత్వం ఫిష్‌మార్ట్‌, వలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చింది. సంపద సృష్టించి ఆదాయం పెంచే శక్తి టీడీపీకి ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.

దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు

‘‘ప్రజలు సవ్యంగా ఓట్లు వేస్తే ఓడిపోతామని వైసీపీకి అర్థమైంది. అందుకే దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోంది. దొంగల ముఠా దొంగ ఓట్లను నమ్ముకొంది. తమకు పడవని అనుకొంటున్న ఓట్లను తొలగించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఓటరు తమ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలి. శుక్రవారం నుంచి జరిగే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలి. రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. గ్రామంలో చిన్న వీధి లైటు కూడా పంచాయితీ తరపున వేయలేని స్థితికి సర్పంచులను దిగజార్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసిన వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చిత్తుగా ఓడించాలి. వైసీపీ పాలనపై ప్రజల్లో ఆగ్రహం, బాధ, ఆవేశం కనిపిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలు తిరగబడి ఈ ప్రభుత్వపై తిరుగుబాటు చేయడంతో పాటు దండయాత్ర చేయాలి. బాధిత వర్గాలకు మరింత సాయం అందాల్సిన అవసరం ఉందని టీడీపీ గుర్తించింది. అందుకే సూపర్‌ సిక్స్‌ పేరుతో మినీ మేనిఫెస్టో విడుదల చేశాం’’ అని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు చినరాజప్ప, పితాని సత్యనారాయణ, మాజీ ఎంపీ మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T03:04:48+05:30 IST