ఒకటి కట్టడానికే దిక్కులేదు

ABN , First Publish Date - 2023-08-02T00:47:04+05:30 IST

రాష్ట్రానికి రాజధాని లేదు.. భూములు త్యాగం చేయండని గత ప్రభుత్వం అడిగితే 33వేల ఎకరాలు త్యాగం చేశామని రాజధాని రైతులు పేర్కొన్నారు.

ఒకటి కట్టడానికే దిక్కులేదు
మందడం ధర్నా శిబిరంలో బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు

తుళ్ళూరు(తాడికొండ), ఆగస్టు 1: రాష్ట్రానికి రాజధాని లేదు.. భూములు త్యాగం చేయండని గత ప్రభుత్వం అడిగితే 33వేల ఎకరాలు త్యాగం చేశామని రాజధాని రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు, రైతుకూలీలు, మహిళలు చేస్తున్న నిరసన దీక్షలు, ఆందోళనలు మంగళవారం నాటికి 1323వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయా రైతు ధర్నా శిబిరాలలో వారు మాట్లాడుతూ, అమరావతికి ఎస్‌ అన్న సీఎం జగన్‌రెడ్డి అధికారం చేపట్టాక నై అనటం నమ్మక ద్రోహం కాదా..? అని రైతులు ప్రశ్నించారు. వేల ఎకరాలిస్తే అమరావతిని కట్టటానికి దిక్కులేదు కాని, మూడు పెడతామని వైసీపీ సర్కార్‌ అనటం విడ్డూరంగా ఉందన్నారు. అప్పులు తెచ్చి పరిపాలన చేయమంటే ఎవరైనా చేస్తారని, అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆ సంపదతో సంక్షేమ పఽథకాలు అమలుచేయాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రభుత్వం చేసే అప్పులు ఏనాటికైనా ప్రజల మీద పన్నుల రూపంలో భారం పడుతుందన్నారు. ఐదు కోట్ల మంది అమరావతిని కోరుకుంటున్నారంటే కారణం.. అది సంపద కేంద్రం అని స్పష్టం చేశారు. లక్షల ఉద్యోగాలు కల్పించే కల్పతరువు రాజధాని అమరావతి అని పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానం తీర్పును గౌరవించి అమరావతి అభివృద్ధిని కొనసాగించాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. తుళ్ళూరు, వెలగపూడి, మందడం, వెంకటపాలెం, నెక్కల్లు, అనంతవరం, ఉద్దండ్రాయునిపాలెం తదితర రాజధాని గ్రామాలతో పాటు మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలలో బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు.

Updated Date - 2023-08-02T00:47:04+05:30 IST