రాజకీయ లబ్ది కోసం రాజధానిలో పేదలకు సెంటు భూమి

ABN , First Publish Date - 2023-06-11T01:08:09+05:30 IST

సీఎం జగన్మోహనరెడ్డి తన రాజకీయ లబ్ది కోసం ఆర్‌-5 జోన్‌ను తెరమీదకు తెచ్చి పేదలకు సెంటు భూమి పేరుతో రాజధానిలో కుట్రలు పన్నుతున్నారని రైతులు, రైతుకూలీలు, మహిళలు పేర్కొన్నారు.

రాజకీయ లబ్ది కోసం రాజధానిలో పేదలకు సెంటు భూమి

తాడికొండ, జూన్‌ 10: సీఎం జగన్మోహనరెడ్డి తన రాజకీయ లబ్ది కోసం ఆర్‌-5 జోన్‌ను తెరమీదకు తెచ్చి పేదలకు సెంటు భూమి పేరుతో రాజధానిలో కుట్రలు పన్నుతున్నారని రైతులు, రైతుకూలీలు, మహిళలు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి- సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట రాజధాని గ్రామాల్లో రైతులు, రైతుకూలీలు, మహిళలు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు శనివారం నాటికి 1271వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయా దీక్షా శిబిరాల నుంచి పలువురు మాట్లాడుతూ రాజధానిని అభివృద్ధి చేయమని హైకోర్టు తీర్పు ఇచ్చినా తీర్పును పక్కనపెట్టి ఆర్‌-5 జోన్‌ను ప్రకటించి రాజధాని రైతులతో ఆటలాడుతున్నారని దుయ్యబట్టారు. కోర్టులకు, తీర్పులకు విలువ ఇవ్వకుండా మూర్ఖంగా సీఎం ప్రవర్తిస్తున్నారన్నారు. రాజధానిలో అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించకుండా కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు. రాజధాని పేదలకు భూములు ఇవ్వకుండా ఇతర జిల్లాల్లోని పేదలకు భూములు పంపిణీ చేయటంలో ఆంతర్యం ఎంటని ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు భూములు అభివృద్ధి చేసి ఇవ్వకుండా, ఆర్‌-5జోన్‌లో భూములు శుభ్రం చేయటానికి గల కారణాలు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా సర్కారు ఆర్‌-5జోన్‌ ప్రక్రియను విరమించుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రాజధాని 29 గ్రామాలైన తుళ్లూరు, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం, వెంకటపాలెం, దొండపాడు, నెక్కల్లు, తాడికొండ గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

Updated Date - 2023-06-11T01:08:09+05:30 IST