కేసుల మాఫీకి కాదని చెప్పగలరా..!

ABN , First Publish Date - 2023-03-19T02:55:09+05:30 IST

ఢిల్లీ పర్యటన ఎంపీ అవినాశ్‌రెడ్డిని వివేకా హత్య కేసు నుంచి కాపాడటానికి కాదని చెప్పే ధైర్యం సీఎంకి ఉందా? ఢిల్లీ వెళ్లి ప్రధానితో మాట్లాడి, రాష్ట్రానికి ఏం సాధించారో సీఎం చెప్పాలి’’ అని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు.

కేసుల మాఫీకి కాదని చెప్పగలరా..!

ప్రధానితో ఏం మాట్లాడారో సీఎం సభలో ప్రకటన చేయాలి: టీడీపీ

అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పర్యటన ఎంపీ అవినాశ్‌రెడ్డిని వివేకా హత్య కేసు నుంచి కాపాడటానికి కాదని చెప్పే ధైర్యం సీఎంకి ఉందా? ఢిల్లీ వెళ్లి ప్రధానితో మాట్లాడి, రాష్ట్రానికి ఏం సాధించారో సీఎం చెప్పాలి’’ అని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘‘ఢిల్లీలో అవినాశ్‌రెడ్డితో కలిసి తిరగడం దేనికి సంకేతం?వివేకాను చంపింది అవినాశ్‌రెడ్డేనని సాక్ష్యాలతో సహా సీబీఐ బయటపెట్టబోతున్న నేపథ్యంలో తమ్ముడిని అరెస్టు చేస్తారని తేలిపోవడంతోనే జగన్‌ ఢిల్లీ పెద్దల్ని కలవడానికి వెళ్లారు. బడ్జెట్‌ సమావేశాల సమయంలో జగన్‌ హుటాహుటిన ఢిల్లీ ఎందుకు వెళ్లారని వాయిదా తీర్మానం ఇస్తే.. అప్పుల మంత్రి బుగ్గన ఆవు కథ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తే... రాష్ట్రానికి ఏం సాధించారో సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయాలి. జగన్‌ ఇప్పటికి 18 సార్లు ఢిల్లీ వెళ్తే.. ఎప్పుడూ చెప్పే అబద్ధాలే ఇప్పుడూ చెప్పారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్తే మంత్రులు, స్పీకర్‌ కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తమను అకారణంగా స్పీకర్‌ సస్పెండ్‌ చేస్తున్నారు. టీడీపీ సభ్యులు సభలో ఉండటాన్నే ఓర్చుకోలేకపోతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, ఢిల్లీ పర్యటనపై మంత్రులు, ఎమ్మెల్యేలతో పిచ్చికూతలు కూయించకుండా, జగనే నోరు విప్పాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్ష సభ్యుల్ని తిట్టడానికే శ్రద్ధ చూపుతున్నారని మండిపడ్డారు. సీఎం ఢిల్లీ పర్యటనపై శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇచ్చి, వాస్తవాలు చెప్పాలని కోరితే.. డ్రామాల మంత్రి అంబటి రాంబాబు దీర్ఘాలు తీస్తున్నాడని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి విమర్శించారు.

Updated Date - 2023-03-19T02:55:09+05:30 IST