ట్రస్ట్‌ బోర్డుల్లోకి నాయీ బ్రాహ్మణులు

ABN , First Publish Date - 2023-02-07T03:01:36+05:30 IST

నాయీ బ్రాహ్మణుల విషయంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గౌరవ వేతనం కోసం నాయీ బ్రాహ్మణులు పోరాటం చేస్తుంటే..

ట్రస్ట్‌ బోర్డుల్లోకి నాయీ బ్రాహ్మణులు

ఆర్డినెన్స్‌ జారీ చేసిన ప్రభుత్వం

గౌరవ వేతనం కావాలని వారి డిమాండ్‌

దాన్ని పట్టించుకోకుండా అనూహ్య నిర్ణయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నాయీ బ్రాహ్మణుల విషయంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గౌరవ వేతనం కోసం నాయీ బ్రాహ్మణులు పోరాటం చేస్తుంటే.. ఆలయాల ట్రస్ట్‌ బోర్డుల్లో సభ్యులుగా ప్రభుత్వం వారికి అవకాశం కల్పించింది. శనివారం గవర్నర్‌ పేరు మీద దీనిపై ఆర్డినెన్స్‌ జారీ చేసింది. రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో భజంత్రీలు, చెవులు కుట్టడం, దేవుళ్ల పల్లకీ మోయడంతో పాటు ఎక్కువ మంది క్షవర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాము ఎన్నో ఏళ్ల నుంచి దేవాలయాలను నమ్ముకుని బతుకుతున్నామని, తమకు అదే దేవాలయాల నుంచి గౌరవ వేతనాలు ఇప్పించాలని నాయీ బ్రాహ్మణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేవదాయ శాఖ మంత్రిగా వెలంపల్లి శ్రీనివాస్‌ ఉన్న సమయంలో దీనికి సంబంధించిన ఫైల్‌ ప్రభుత్వంలో నడిచింది. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెలంపల్లి తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొట్టు సత్యనారాయణ నాయీ బ్రాహ్మణుల అంశంపై కొంత నిర్లక్ష్యం వహించారు. గత ఏడాది ఆగస్టులో మంత్రి, నాయీ బ్రాహ్మణుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. నాయీ బ్రాహ్మణులు మంత్రిని ఘోరావ్‌ చేశారు. అనంతరం వారి గౌరవ వేతనం అంశం కనుమరుగైంది.

ఇప్పుడు ప్రభుత్వం అనూహ్యంగా ఆర్డినెన్స్‌ తెరపైకి తెచ్చింది. నాయీ బ్రాహ్మణుల సమస్యను పరిష్కరించడానికి ట్రస్ట్‌ బోర్డుల్లో అవకాశం కల్పించింది. దానికి వివరణ కూడా వచ్చింది. ఆలయాల్లో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వారికి ట్రస్ట్‌ బోర్డుల్లో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని 610 దేవాలయాల్లో ట్రస్ట్‌ బోర్డులు నియమించాల్సి ఉంది. వాటిల్లో నాయీ బ్రాహ్మణుల నుంచి ఒకరిని సభ్యులుగా నియమించాలని ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం భవిష్యత్తులో వీరికి గౌరవ వేతనం ఇచ్చే పరిస్థితి కనిపించడం లే దు. మరోవైపు దేవాలయాల్లో వీరితో పాటు యాదవులు, రాయలసీమలో బోయ సామాజిక వర్గానికి చెందిన వారు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఆయా సామాజిక వర్గాల వారికి కూడా దేవాలయాల ట్రస్ట్‌ బోర్డుల్లో ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Updated Date - 2023-02-07T03:01:37+05:30 IST