Bhuvaneshwari : సత్యమేవ జయతే!

ABN , First Publish Date - 2023-10-03T02:44:01+05:30 IST

చంద్రబాబు ప్రజల కోసం మరింత సేవ చేయాలి. ఈ రాష్ట్రాన్ని, ప్రజల భవిష్యత్తును కాపాడాలి.

Bhuvaneshwari : సత్యమేవ జయతే!

ప్రజలందరూ పోరాడాలి.. నేనూ మీతో వస్తా

నిజం గెలవాలనేదే మన నినాదం. ప్రజలందరూ సహకరించాలి. పోరాడాలి. మీతో నేనూ వస్తాను.పోరాడతాను. అందరూ సత్యమేవ జయతే అందాం. ఈసారి ప్రజలంతా బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నా.

-భువనేశ్వరి

మా అందర్నీ జైల్లో పెట్టాలన్నదే సర్కారు ధ్యాస

అందర్నీ అరెస్ట్‌ చేసినా కార్యకర్తలు నడిపిస్తారు

నా భర్త, తండ్రి సీఎంలుగా పనిచేశారు

ఎప్పుడూ అధికార దుర్వినియోగం చేయలేదు

ప్రజల కోసం పనిచేసే చంద్రబాబును జైల్లో పెట్టారు

నవ్యాంధ్ర అభివృద్ధికి ఎన్నో కలలు కన్నారు

ప్రజలు చేసిన పొరపాటుకు ఉండేది కూడా పోయింది

ఈసారి బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నా

నా ఆయుష్షు కూడా పోసుకుని చంద్రబాబు బతకాలి

మరింతగా సేవ చేయాలి.. భువనేశ్వరి ఉద్వేగ ప్రసంగం

రాజమహేంద్రవరం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు ప్రజల కోసం మరింత సేవ చేయాలి. ఈ రాష్ట్రాన్ని, ప్రజల భవిష్యత్తును కాపాడాలి. ఆయన ప్రజల కోసం తపించే నాయకుడు. ఆయన మీద ప్రజలకున్న నమ్మకం చూశాక నా ఆయుష్షు కూడా పోసుకుని ఆయన బతకాలని కోరుకుంటున్నాను’ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వ్యవహారంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంఽధించడాన్ని నిరసిస్తూ, రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా సోమవారం రాజమహేంద్రవరంలో ఆమె సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేశారు. దీక్ష విరమణ తర్వాత ఉద్విగ్నభరితంగా భువనేశ్వరి ప్రసంగించారు. ‘‘మా అందరినీ ఎలా లోపల వేయాలన్నదే వైసీపీ ప్రభుత్వం ఽధ్యాస. ఇవాళ మీ అందరి ప్రేమ, అభిమానం, చంద్రబాబు మీద మీకున్న నమ్మకం చూశాక సంతోషంగా ఉంది. మమ్మల్నందరినీ అరెస్టు చేసి జైలుకు పంపినా.. మా బిడ్డలైన టీడీపీ కార్యకర్తలు పార్టీని ముందుకు తీసుకెళతారు. ఈ దీక్షలో నేను పాల్గొన్నది చంద్రబాబు కోసం, మా కుటుంబం కోసం కాదు. మీకోసం, ప్రజల కోసం. జరిగే అన్యాయం గురించి చెప్పడానికి దీక్షలో పాల్గొన్నా. ఈ రోజు అక్టోబరు 2 గాంఽధీ జయంతి. ఆ మహనీయుడు బ్రిటిషర్లతో పోరాడి మనకు స్వాతంత్య్రం తీసుకొచ్చారు. అటువంటి మహానీయుడికి కూడా కష్టాలు తప్పలేదు. ఆయన చాలా సార్లు జైలుకు వెళ్లారు, అయినా పట్టు విడువలేదు. ఇటువంటి సమావేశంలో ప్రసంగించడం నాకెప్పుడూ అలవాటు లేదు. మీరే నా ధైర్యం. మీరంతా సపోర్టుగా ఉన్నారు. సత్యమేవ జయతే.. అహింస అనేది నమ్ముతాను. అది నమ్మే ఈ దీక్షలో కూర్చుకున్నాను’’ అన్నారు.

ప్రజల కోసమే టీడీపీ

‘‘నందమూరి తారక రామారావు గురించి మీ అందరికీ తెలుసు. ఆయన బాటలో నడుస్తున్నాం. ఆయన ప్రజల కోసం టీడీపీని స్థాపించారు. ఆయన సిద్ధాంతాలతోనే మా కుటుంబం నడుచుకుంటోంది. పార్టీని కూడా ముందుకు తీసుకెళ్తోంది. ఏనాడూ మా కుటుంబంపైన అవినీతి కేసు కానీ, ఇతర ఏ కేసు కానీ లేదు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు అంటూ ఉండేవారు. మేం ఎప్పుడూ ఆయన్ను ఆపలేదు. కానీ ఒకటే బాఽధ... ప్రజల కోసం పనిచేసే నేతను జైల్లో పెట్టారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించారు. 25 సంవత్సరాల క్రితమే ఐటీ గురించి ఆలోచించి అభివృద్ధి చేశారు. ఇవాళ హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా పిలుస్తారు. దాని వెనుక చంద్రబాబు హార్డ్‌వర్కు ఉంది’’ అన్నారు.

మీ అందరికీ కృతజ్ఞతలు

‘‘చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ఐటీ రంగంలోని నిపుణులు, ప్రజలు దీక్షలు, ర్యాలీలు చేశారు. అది నేను మర్చిపోలేను. చంద్రబాబు ఇచ్చిన వెలుగుతోనే చాలా కుటుంబాలు సవ్యంగా నడుస్తున్నాయి. నేడు మహిళా శక్తిని చూస్తే గర్వం గా ఉంది. మీరు చేసే ఈ పోరాటాన్ని, మీ సపోర్టును చంద్రబాబు ఇక్కడ నేరుగా చూసి ఉంటే చాలా సంతోషించేవారు. చంద్రబాబు కోసం మీరు పోరాడుతున్నారంటే ఆయన మీద మీకున్న నమ్మకమని స్పష్టమవుతోంది. నిరసన తెలుపుతుంటే మహిళలని కూడా చూడకుండా పోలీసులు లాగి తీసుకెళ్లి వ్యాన్‌లో నిర్బంధించి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ప్రప ంచవ్యాప్తంగా చంద్రబాబుకు మంచి జరగాలని దీక్షలు చేస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. చంద్రబాబును జైలులో పెట్టారనే బాధలో 105మంది ప్రాణాలు త్యాగం చేశారు. నేను తప్పకుండా వాళ్ల కుటుంబాలను పలకరిస్తాను. వాళ్లకు అండగా ఉంటాను’’ అన్నారు.

గాంధీ విగ్రహానికి నివాళి అర్పించి..

రాజమహేంద్రవరంలో మొదట కంబాలచెరువు, దేవీచౌక్‌ మధ్యలో పండ్ల సెంటర్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి రాజా థియేటర్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి చేరుకున్నారు. వేదికపై గాంధీ, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతర రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన తెలుగు మహిళలతో కలసి ఆమె దీక్ష చేపట్టారు. ఈ దీక్షా సభకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. భువనేశ్వరికి సంఘీభావం తెలపడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ గుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల వారీగా మహిళలు వచ్చి మద్దతు తెలిపారు. వారందరికీ ఆమె రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన, సీపీఐ నేతలు కూడా పార్టీ జెండాలతో వచ్చి సంఘీభావం తెలిపారు. హిందు, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలు చేశారు. 5 గంటల తర్వాత భువనేశ్వరికి చిన్నారులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఎన్టీఆర్‌ నీతి, నిజాయతీపరుడు. అదే బాటలో మేం నడుస్తున్నాం. నా తండ్రి, నా భర్త ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలని ఏనాడూ అనుకోలేదు. కష్టపడాలని చంద్రబాబు చెప్పేవారు. హెరిటేజ్‌ ద్వారా వ్యాపారం చేసుకుని బతుకుతున్నాం. ప్రజల సొమ్ముపై మాకు ఆశలేదు.

నవ్యాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు ఎన్నో కలలు కన్నారు. ఆయన కేవలం మూడు, నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. ఏమి లేని పరిస్థితిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కొన్నేళ్ల సమయం పడుతుంది. అప్పుడే అభివృద్ధి జరిగేది. పిల్లలకు భవిష్యత్‌ కూడా ఉండేది. కానీ ప్రజలు చేసిన పొరపాటుకు ఇవాళ ఉండేది కూడా పోయింది.

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసి జైలులో పెట్టారు. మేం నలుగురం నాలుగు దిక్కులుగా అయిపోయాం. నేను, బ్రాహ్మణి రాజమహేంద్రవరంలో ఉండిపోయాం. లోకేశ్‌ ఏమో ఢిల్లీలో ఉండిపోయాడు. మా కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని నేనేప్పుడూ అనుకోలేదు.

ఆలోచించి ఓటు వేయండి

‘‘రాష్ట్ర విభజన తర్వాత సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నప్పుడు అమరావతి, పోలవరం గురించే ఆలోచించేవారు. సైబరాబాద్‌ను దాటి అమరావతి ముందుకు వెళ్లాలని ఆయన ఎప్పుడూ కలలు కనేవారు. ఆ కలల సాకారం కోసం చాలా కష్టపడ్డారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు కానీ నవ్యాంధ్ర కోసం ఆయన పడ్డ కష్టం గతంలో నేనెప్పుడూ చూడలేదు. ఏమి లేని పరిస్థితిలో ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఐదు, పది సంవత్సరాలైనా సమయం ఇవ్వాలి. ప్రజలు చేసిన పొరపాటుకు ఇవాళ ఉండేది కూడా పోయింది’’ అని భువనేశ్వరి అన్నారు. ప్రజలంతా మళ్లీ ఆలోచించి సరిగ్గా ఓటు వేయాలని కోరుకుంటున్నానని అన్నారు.

భువనేశ్వరికి మద్దతుగా గొంతెత్తిన మహిళా లోకం

రాజమహేంద్రవరం సిటీ/రూరల్‌ అక్టోబరు 2: సత్యమేవ జయతే పేరుతో రాజమహేంద్రవరంలో జరిగిన దీక్షలో భువనేశ్వరికి మద్దతుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ, సీపీఐ మహిళా నేతలు పాల్గొన్నారు. వారంతా దీక్షకు మద్దతుగా గొంతెత్తారు.

ఒకప్పుడు రాజకీయాలు హుందాగా నడిచేవి

యువతకు ఉద్యోగాలు కల్పించడం చంద్రబాబు చేసిన తప్పా? ఒకప్పుడు రాజకీయాలు హుందాగా నడిచేవి.. ఇప్పుడు ఎవరి నోటి నుంచి చూసినా బూతులే. ఇలాంటి కల్చర్‌ను మార్చాలంటే మీ చేతిలో ఉన్న ఓటును ఉపయోగించి చంద్రబాబును సీఎం చేయాలి.

- ఆదిరెడ్డి భవాని, ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం సిటీ

ప్రజల భవిష్యత్తు కోసమే భువనేశ్వరి దీక్ష

తప్పుడు కేసులో చంద్రబాబును జైలు పెట్టారు. ఇది జగన్‌ సైకో నిర్ణయం. చంద్రబాబు తప్పు చేయలేదు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనుభవం ఉన్నవారంతా ఆయనకు బాసటగా నిలిచారు. గాంధీ సిద్ధాంతం సత్యాగ్రహం, అహింస. ఈ స్ఫూర్తితో సత్యవేవ జయతే అంటూ భువనేశ్వరి దీక్ష చేస్తున్నారు. ఆమె చేస్తున్న దీక్షలు ప్రజల భవిష్యత్తు కోసమే.

- వంగలపూడి అనిత, రాష్ట్ర అధ్యక్షురాలు, తెలుగు మహిళ

భువనేశ్వరి మహాసాద్వి

టీడీపీ ఒక కుటుంబం. తండ్రి చంద్రబాబు, తల్లి భువనేశ్వరి. పార్టీ సంక్షోభం సమయంలో చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితి చక్కబెట్టారు. అప్పుడు ఆయన పట్టించుకోకపోతే పరిస్థితి దారుణంగా ఉండేది. చంద్రబాబు దమ్మున్న నాయకుడు. భువనేశ్వరి మహాసాద్వి. చాలా ధైర్యంగా ఉన్నారు. ఆమెను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు.

- ప్రతిభా భారతి, మాజీ స్పీకర్‌

కేంద్ర పెద్దలారా స్పందించండి

మీ కోసం.. మీ పిల్లల భవిష్యతు ్తకోసం ఏడవండి అని చరిత్రలో అన్నది ఏసుక్రీస్తు... మళ్లీ ఇప్పుడు చంద్రబాబే. 14ఏళ్లు సీఎంగా పనిచేశారు. దేశవిదేశాల్లో తెలుగువారికి కీర్తిని తీసుకువచ్చారు. కేంద్ర పెద్దలారా స్పం దించండి. 20 మంది తెలివితక్కువ వాళ్లను నిర్లక్ష్యం చేయొచ్చుగానీ ఒక మేధావిని నిర్లక్ష్యం చేయవద్దు.

- నన్నపనేని రాజకుమారి, మహిళా నేత

అధికారం శాశ్వతం కాదు

చంద్రబాబు నిజాయితీపరుడు. అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు గడపగడపకు వెళ్లడానికే భయపడి పోలీసులను వినియోగిస్తున్నారు. ఈ అరాచక పాలన చూసి పరిశ్రమలు రావడం లేదు. ఉపాధి కోల్పోతున్నాం. అఽధికారం శాశ్వతం కాదనే విషయం వైసీపీ వాళ్లు గుర్తుపెట్టుకోవాలి.

- గౌతు శిరీష, గౌతు లచ్చన్న మనుమరాలు

దీక్షకు సీపీఐ సంపూర్ణ మద్దతు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. తప్పుడు కేసులతో నిజాయితీని జైలులో పెడుతున్నారు. గాంధీ జయంతి రోజు ఈ సత్యాగ్రహ దీక్ష చేయడం చూస్తుంటే ప్రజాస్వామ్యం కచ్చితంగా ప్రమాదంలో పడిందని అర్థమవుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న అరాచకాలు, అక్రమాలకు వ్యతిరేకంగా నెలరోజులుగా ఉద్యమం చేస్తున్నాం. చంద్రబాబు అక్రమ అరెస్టును సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంది.

- వనజ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు

వైసీపీ పతనం మొదలైంది

మా కుటుంబమంతా టీడీపీలోనే ఉన్నాం. భవిష్యత్‌ తరాలు కూడా నారా, నందమూరి కుటుంబాలకు అండగా ఉంటారు. నా తండ్రి చనిపోయినప్పుడు మమ్మల్ని రాజకీయాల్లో లేకుండా చేయాలని చాలామంది ప్రయత్నించారు. కానీ చంద్రబాబు నాకు తండ్రిగా నిలబడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. ఆడ, మగ తేడాలేదు. గొంతు విప్పితే, బయటకు వస్తే కేసులు పెడుతున్నారు. అమ్మా మీకు ఒక మాట ఇస్తున్నాం. ఏ నంద్యాల జిల్లాలో చంద్రబాబును అరెస్ట్‌ చేశారో అక్కడినుంచే వైసీపీ పతనం మొదలవుతుంది.

- భూమా అఖిలప్రియ, మాజీ మంత్రి

Updated Date - 2023-10-03T02:44:01+05:30 IST