ఆప్కో మాజీ చైర్మన్‌ను విచారించవచ్చు
ABN , First Publish Date - 2023-03-18T06:38:45+05:30 IST
ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాస్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. నకిలీ సంఘాలు, ఖాతాలు సృష్టించారనే ఆరోపణల నేపథ్యంలో కోపరేటివ్ చట్టంప్రకారమే దర్యాప్తు జరపాలని, ఐపీసీ సెక్షన్లు వర్తింపజేయడానికి వీల్లేదని పేర్కొంటూ గుజ్జల శ్రీనివాస్, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

గుజ్జల శ్రీనివా్‌సకు హైకోర్టులో చుక్కెదురు
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాస్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. నకిలీ సంఘాలు, ఖాతాలు సృష్టించారనే ఆరోపణల నేపథ్యంలో కోపరేటివ్ చట్టంప్రకారమే దర్యాప్తు జరపాలని, ఐపీసీ సెక్షన్లు వర్తింపజేయడానికి వీల్లేదని పేర్కొంటూ గుజ్జల శ్రీనివాస్, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఏ చట్టం కింద విచారించాలి? ఏ సెక్షన్లు వర్తింపజేయాలనేది ట్రయల్ కోర్టు నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. గుజ్జల శ్రీనివా్‌సను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతినిస్తూ చేనేత శాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని తేల్చి చెప్పింది. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, దిగువ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలని వేసిన పిటిషన్లను సైతం తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. రఘునందనరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. చేనేత కార్మికుల పేర్లతో నకిలీ సంఘాలు, ఖాతాలు సృష్టించి రూ.వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ 2020, నవంబరులో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ఆ కేసు ఆధారంగా దిగువ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలని కోరుతూ గుజ్జల శ్రీనివాస్, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపించారు. ఐపీసీ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద గుజ్జలపై కేసు నమోదు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. సీఐడీ తరఫు న్యాయవాది శివ కల్పన వాదనలు వినిపిస్తూ.. మిగిలిన నిందితులతో కలిసి పిటిషనర్ రూ.వందల కోట్లు దోచేశారన్నారు. పిటిషనర్‌కు కడపలో 89 స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడించిం ది. మరోవైపు, తమ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి గతేడాది ఆగస్టు 4న కర్నూలు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాస్, ఆయన భార్య సుమలత, ఇతర కుటుంబ సభ్యులు హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. గుజ్జల శ్రీనివాస్ తండ్రి రామకృష్ణయ్య చనిపోయిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఆస్తుల జప్తు సరికాదని, సంబంధిత ఉత్తర్వులు చెల్లుబాటుకావని స్పష్టం చేసింది. గుజ్జల శ్రీనివా్‌సతో పాటు ఇతరు కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తుపై అభ్యంతరాలు ఉంటే ట్రయల్ కోర్టు ముందు చెప్పుకోవాలని కోర్టు సూచించింది.