వైవీ సుబ్బారెడ్డిపై చర్యలేవీ?

ABN , First Publish Date - 2023-03-19T03:03:21+05:30 IST

పట్టభద్ర ఎన్నికల పోలింగ్‌ రోజున ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విశాఖ నగరంలో పర్యటించడంపై రేగిన వివాదం నానాటికీ ముదురుతోంది.

వైవీ సుబ్బారెడ్డిపై చర్యలేవీ?

ఎన్నికల ప్రధానాధికారికి చంద్రబాబు లేఖ

అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పట్టభద్ర ఎన్నికల పోలింగ్‌ రోజున ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విశాఖ నగరంలో పర్యటించడంపై రేగిన వివాదం నానాటికీ ముదురుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానికేతరులు పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో ఉండకూడదు. ఇదే నిబంధన కింద టీడీపీ యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను అడ్డుకున్న అధికారులు, ఆయన్ను అన్నమయ్య జిల్లా నుంచి పంపేశారు. కానీ స్థానికేతరుడైన వైవీ సుబ్బారెడ్డి పోలింగ్‌ రోజున విశాఖ నగరంలో ఉండటమే కాకుండా కార్యకర్తలతో పాటు పోలింగ్‌ బూత్‌ల వద్దకు తిరిగారని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. లోకేశ్‌కు ఒక నీతి, సుబ్బారెడ్డికి మరో నీతా? అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి చంద్రబాబు లేఖ రాశారు. దీనికి ఎన్నికల ప్రధానాధికారి బదులిచ్చారు. విశాఖలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు నేతృత్వం వహిస్తున్న మహారాణిపేట తహశీల్దార్‌, ఆ ప్రాంత పోలీస్‌ స్టేషన్‌ అధికారికి షోకాజ్‌ నోటీసులు పంపామని తెలిపారు. అయితే కోడ్‌ ఉల్లంఘించిన సుబ్బారెడ్డికి ఎందుకు నోటీసు ఇవ్వలేదంటూ ఎన్నికల ప్రధానాధికారికి శనివారం చంద్రబాబు మరో లేఖ రాశారు.

Updated Date - 2023-03-19T03:03:21+05:30 IST