సీపేజీపై లోతైన అధ్యయనం!
ABN , First Publish Date - 2023-08-02T04:11:32+05:30 IST
పోలవరం ప్రాజెక్టులో నిన్నటిదాకా డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా..
నివారించడమెలాగో నిర్ణయించండి.. జెట్‌గ్రౌటింగ్ పటిష్ఠతపైనా తేల్చండి
వారంలోగా నివేదిక సమర్పించండి
రాష్ట్రప్రభుత్వానికి డీడీఆర్‌పీ ఆదేశం
వారం తర్వాత ఇంకోసారి భేటీ
పోలవరం కథ మళ్లీ మొదటికి..!
అమరావతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో నిన్నటిదాకా డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా.. లేదంటే కొత్తది నిర్మించాలనే అంశంపై దృష్టిపెట్టిన కేంద్ర జలశక్తి శాఖ.. ఇప్పుడు ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీని తీవ్రంగా పరిగణిస్తోంది. 2017లో నిర్మించిన ఈ ఎగువ కాఫర్ డ్యాం నేలపొరల్లోంచి నీరు ఎగదన్నుతోంది. అది ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నడుమ భారీగా చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్లపాటు వరదలను తట్టుకోగలిగిన కాఫర్ డ్యాం ఈ ఏడాది కూడా తట్టుకుని నిలబడింది. కానీ సీపేజీ మొదలై రానురాను పెరుగుతుండడంతో.. దీనిపై సమగ్ర పరిశోధన, అధ్యయనం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖను కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్‌పీ) ఆదేశించింది. డయాఫ్రం వాల్‌పై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఢిల్లీలో జరిగిన భేటీలో రాష్ట్రం నుంచి ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకరబాబు పాల్గొనగా.. డీడీఆర్‌పీ చైర్మన్ ఏబీ పాండ్యా హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. రెండున్నర గంటలు జరిగిన సమీక్షలో.. డయాఫ్రం వాల్ అంశాన్ని పక్కనపెట్టి తొలుత కాఫర్ డ్యాం సంగతి తేల్చాలని నిర్ణయించారు. ఎగువ కాఫర్ డ్యాం పటిష్ఠతపై లోతైన అధ్యయనం జరపాలని డీడీఆర్‌పీ స్పష్టం చేసింది.
పునాదుల స్థాయి నుంచి ప్రమాదకర స్థాయిలో జలాలు ఎగజిమ్ముతుండడంతో.. దానిని నివారించేందుకు చేపట్టాల్సిన మెథడాలజీ ఏమిటో కూడా అధ్యయనం చేయాలని సూచించింది. అలాగే దీని పునాదుల వద్ద చేసిన జెట్‌గ్రౌటింగ్ పటిష్ఠంగా ఉందో లేదో.. ఏమైనా బలహీనపడిందో కూడా తేల్చాలని డీడీఆర్‌పీ స్పష్టం చేసింది. వీటన్నిటినీ వారం రోజుల్లోగా పరిశోధించి.. ఏం చేయదలచిందీ వారంలో తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదిక అందాక ఎగువ కాఫర్ డ్యాంపై విస్తృతంగా సమీక్షిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో దాని సంగతి తేలేదాకా ఇతర పనులేవీ చేపట్టే అవకాశాలు కనిపించడం లేదని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. కాఫర్ డ్యాం పునాదుల్లో ఇసుక కోతకు గురైతే.. దానిని నివారించడంపై జలసంఘం, ఎన్‌హెచ్‌పీసీ, డీడీఆర్‌పీసాంకేతికంగా సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. పోలవరం ప్రాజెక్టులో వరుసగా నిర్మాణాలు దెబ్బతింటుండడంతో.. ఫలానా సాంకేతిక విధానాలతో పనులు చేయాలని సూచించేందుకు అవి కూడా ముందుకు రావడం లేదు. జవాబుదారీ వహించడానికి కూడా విముఖత చూపుతున్నాయి. ఆ భారాన్ని రాష్ట్ర జలవనరుల శాఖపై పెడుతున్నాయి.
దశ దిశా ఏదీ?
ఇటీవల వరుసగా నిర్మాణాలు దెబ్బతింటుండడంతో పోలవరం ప్రాజెక్టు కథ మళ్లీ మొదటికొస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోంది. ఎప్పటికప్పుడు గతంలో చేసిన పనులే మళ్లీ చేపట్టడం, కీలక నిర్మాణాలకు నష్టాలు, వాటికి మరమ్మతులపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏమీ తేల్చకపోవడంతో ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో.. దీని దశ దిశా ఏమిటో చెప్పడమే దుర్లభంగా మారింది. 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారపగ్గాలు చేపట్టేనాటికి హెడ్‌వర్క్స్‌లో 72 శాతం మేర పనులు పూర్తయి.. డయాఫ్రం వాల్‌పై ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మించడం.. స్పిల్‌వే, స్పిల్ చానల్ మీదుగా నీటిని విడుదల చేయడం మాత్రమే మిగిలిఉన్నాయి. కానీ నిర్మాణ పనులు కొనసాగించకుండా.. కేంద్రం వద్దంటున్నా అర్థంతరంగా నిర్మాణ సంస్థను తొలగించి కొత్త సంస్థకు పనులు అప్పగించడంతో ప్రాజెక్టు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. 2019కి ముందు మాదిరిగా ఈ పనులన్నిటినీ వేగంగా చేసి ఉంటే.. ఈ పాటికి పోలవరం పూర్తయ్యేదని చెబుతున్నారు. కానీ పనులు చకచకా చేయకుండా.. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ రంధ్రాన్వేషణకు దిగి.. విజిలెన్స్ దర్యాప్తులు జరిపి.. చివరికి ఎటూ తేల్చకుండా.. కాంట్రాక్టు సంస్థను మార్చి.. రివర్స్ టెండరింగ్ నాటకాలతో దాని భవిష్యత్‌ను అయోమయంలో పడేశారు. కథ కంచికి వెళ్లకుండా.. మళ్లీ మళ్లీ మొదటికే వస్తోంది. గతంలో నిర్మించిన కట్టడాలకు ఎలా మరమ్మతులు చేయాలో కూడా తెలియని దుస్థితి నెలకొంది.