ADANI 'Smart': అదానీకే ‘స్మార్టు’

ABN , First Publish Date - 2023-05-20T03:07:06+05:30 IST

రాష్ట్రంలో పోర్టుల నుంచి ప్లాంట్ల వరకు దేనినీ వదలకుండా అదానీకి జగన్‌ ప్రభుత్వం కట్టబెడుతోంది. అదానీ సంస్థలపై జాతీయస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నప్పటికీ ‘ఫస్ట్‌ అదానీ’ అన్న చందాన వ్యవహారాలు సాగిపోతున్నాయి.

ADANI 'Smart': అదానీకే ‘స్మార్టు’

గృహాలకు స్మార్ట్‌మీటర్ల కాంట్రాక్టు ఖరారు!

సింగిల్‌ ఫేజ్‌కు నెలకు రూ.94 వసూలు

వాణిజ్య,పారిశ్రామిక సంస్థలకు రూ.120 93 నెలలపాటు జనం నుంచి వసూలు ఆ లెక్కన సింగిల్‌ ఫేజ్‌కు రూ.8,742 వాణిజ్య, పారిశ్రామికావసరాలకు 11,160 బిడ్‌ ఖరారు చేసిన రాష్ట్ర ఇంధన శాఖ ..

‘పీఎఫ్‌సీ’ ఆమోదమే తరువాయి

అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోర్టుల నుంచి ప్లాంట్ల వరకు దేనినీ వదలకుండా అదానీకి జగన్‌ ప్రభుత్వం కట్టబెడుతోంది. అదానీ సంస్థలపై జాతీయస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నప్పటికీ ‘ఫస్ట్‌ అదానీ’ అన్న చందాన వ్యవహారాలు సాగిపోతున్నాయి. ఈక్రమంలో ఇప్పుడు రాష్ట్రంలోని గృహాలకు స్మార్టుమీటర్లు బిగించే కాంట్రాక్టు కూడా అదానీ సంస్థయే దక్కించుకుంది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించే బాధ్యతలను జగన్‌ సన్నిహిత బంధువు విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌, ఖమ్మం లోక్‌సభ వైసీపీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ సంస్థలు ఇప్పటికే దక్కించుకున్నాయి. ఇప్పుడు గృహాలకు బిగించే స్మార్ట్‌మీటర్లను అదానీ సంస్థ చేజిక్కించుకుంది. అయితే, ఈ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా సింగిల్‌ఫేజ్‌కు రూ.130.. వాణిజ్య సంస్థలకు రూ.160 చొప్పున 93 నెలలపాటు ప్రతినెలా వసూలు చేసేలా అదానీ సంస్థ ఫైనాన్సియల్‌ బిడ్‌ దాఖలుచేసింది. ఈ బిడ్‌పై అదానీతో రాష్ట్ర ఇంధన పంపిణీ సంస్థలు, ఇంధనశాఖ గత కొన్ని నెలలుగా సంప్రదింపులు కొనసాగించాయి. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు చెల్లిస్తున్న మొత్తాలసగటును పరిగణనలోకి తీసుకుని .. మధ్యేమార్గంగా సింగిల్‌ ఫేజ్‌కు నెలకు రూ.94, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు నెలకు రూ.120 చొప్పున వసూలు చేసేందుకు అదానీ సంస్థ అంగీకరించింది. ఈ మేరకు .. సింగిల్‌ ఫేజ్‌లో 93 నెలలకు రూ.94 చొప్పున రూ. 8742 , వాణిజ్య , పారిశ్రామిక సంస్థల నుంచి 93 నెలల పాటు 120 చొప్పున రూ.11160 వసూలు చేసేందుకు సూత్రప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి .. అదానీ సంస్థకు మధ్య అవగాహన కుదిరింది.

ఈ అవగాహనకు సంబంధించిన సమాచారాన్ని, దేశవ్యాప్తంగా స్మార్ట్‌మీటర్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు (పీఎఫ్‌సీ) పంపారు. అక్కటి నుంచి ఆమోదముద్ర వచ్చిన వెంటనే స్మార్ట్‌ మీటర్ల టెండర్లను ఎవరు దక్కించుకున్నారో అధికారికంగా వెల్లడిస్తూ ఇంధన శాఖ ఉత్తర్వును జారీచేసే వీలుందని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. ఒప్పందం మేరకు .. మీటరు రీడింగ్‌ .. క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను అదానీ సంస్థ చేపట్టాల్సి ఉంది. రాష్ట్రంలో కోటి 96 లక్షల గృహ, పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 200 యూనిట్లపైబడి వినియోగించే 27లక్షల గృహ విద్యుత్తు కనెక్షన్లకు తొలిదశలో .. మరో 25 లక్షల గృహ విద్యుత్తు కనెక్షన్లకు రెండోదశలో స్మార్టుమీటర్లు బిగిస్తారు. గుజరాత్‌లో మీటర్‌కు నెలకు రూ.99 చొప్పున .. వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు రూ.130 చొప్పున స్మార్ట్‌ మీటరుపై వసూలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.160 చొప్పున వసూలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్తు వినియోగానికి స్మార్ట్‌మీటర్లను అమర్చేందుకు గత ఏడాది డిసెంబరులో విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కమ్‌) టెండర్లను పిలిచాయి. అయితే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే .. స్మార్ట్‌ మీటర్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ ఈ టెండర్లపై విమర్శలు వెల్లువెత్తాయి.

Updated Date - 2023-05-20T03:10:52+05:30 IST