Share News

Gaganyaan : కాసేపట్లో గగన్‌యాన్‌ తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగం.. పూర్తి వివరాలివిగో..

ABN , First Publish Date - 2023-10-21T07:43:40+05:30 IST

వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి మరలా క్షేమంగా కిందకు తీసుకొచ్చే లక్ష్యంతో చేపట్టిన గగన్‌యాన్‌ మిషన్‌లో కీలకమైన క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ పనితీరుని ప్రదర్శించే తొలి టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌-1 (టీవీ-డీ1) పరీక్షకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది..

Gaganyaan : కాసేపట్లో గగన్‌యాన్‌ తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగం.. పూర్తి వివరాలివిగో..

నెల్లూరు/సూళ్లూరుపేట : వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి మరలా క్షేమంగా కిందకు తీసుకొచ్చే లక్ష్యంతో చేపట్టిన గగన్‌యాన్‌ మిషన్‌లో కీలకమైన క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ పనితీరుని ప్రదర్శించే తొలి టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌-1 (టీవీ-డీ1) పరీక్షకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం నుంచి శనివారం ఉదయం 8 గంటలకు ఈ గగన్యాన్ టెస్ట్ వెహికల్‌ను ఇస్రో ప్రయోగించనుంది. మానవ సహిత గగన్‌యాన్‌ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా మానవ రహితంగా ఇస్రో చేపడుతున్న కీలక ప్రయోగమిది. దీనికి సంబంధించి 13 గంటల కౌంట్‌డౌన్‌ శుక్రవారం రాత్రి 7 గంటలకు మొదలైంది. అది పూర్తవగానే శనివారం ఉదయం 8 గంటలకు క్రూమాడ్యూల్‌తో కూడిన సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ ప్రొపల్షన్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.


భూమి మీదికి ఎలా..?

ప్రయోగ నేపథ్యంలో ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ శుక్రవారమే షార్‌కు చేరుకున్నారు. టీవీ-డీ1 రాకెట్‌ భూమి నుంచి నిర్దేశిత ఎత్తుకు చేరిన తర్వాత క్రూ మాడ్యూల్‌ విడిపోనుంది. క్రూమాడ్యూల్ బరువు 4520 కిలోలు.. భూమి నుంచి 17 కి.మీ ఎత్తులో రాకెట్ నుంచి విడిపోనున్నది. ఐదారు గంటలకి తిరిగి భూమిని చేరేలా డిజైన్ చేయడం జరిగింది. షార్ కేంద్రానికి 10కి.మీ దూరంలో అమర్చిన పారాచూట్ల సాయంతో నెమ్మదిగా దాన్ని బంగాళాఖాతం సముద్రంలోకి దింపుతారు.ఇండియన్ నావీ సహకారంతో క్రూమాడ్యుల్‌ను ఇస్రో సేకరించనున్నది. గగన్‌యాన్‌ ప్రయోగంలో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపినప్పుడు వారిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు ఈ క్రూఎస్కేప్‌ వ్యవస్థను ఉపయోగించనుంది.

Updated Date - 2023-10-21T07:44:44+05:30 IST