యువగళం పునఃప్రారంభానికి ఏర్పాట్లు
ABN , First Publish Date - 2023-11-21T00:13:32+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రను పునః ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

ఈ నెల 24 లేదా 27న ప్రారంభించే అవకాశం
(అమలాపురం-ఆంధ్రజ్యోతి) తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రను పునః ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. నిర్వహణ కమిటీలు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యాయి. లోకేశ్ పాదయాత్రను ఈ నెల 24వ తేదీన కానీ 27న కానీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల పొదలాడ శుభం గ్రాండ్ నుంచే తిరిగి ప్రారంభించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో టీడీపీ ముఖ్య నేతలు ఏర్పాట్లపై దృష్టి సారించారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును సెప్టెంబరు 9న కర్నూలు జిల్లాలో అరెస్టు చేశారు. లోకేశ్ ఆందోళనకు సిద్ధమైన తరుణంలో పోలీసులు ఆయన బసచేసిన ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆయన మండుటెండలో రోడ్డుపై జాతీయ పతాకం, రాజ్యాంగ ప్రతిని చేతబట్టి నిరసన తెలిపారు. చివరకు పోలీసులు లోకేశ్ విజయవాడ వెళ్లేందుకు అనుమతించడంతో యువగళం పాదయాత్రకు ఆ రోజున తాత్కాలిక బ్రేక్ పడింది. మళ్లీ మధ్యలో ప్రారంభించాలని భావించినప్పటికీ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో వాయిదా వేసుకున్నారు. కండిషన్ బెయిల్‌పై ఉన్న చంద్రబాబుకు హైకోర్టు సోమవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని లోకేశ్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం సోమవారం సాయంత్రం శుభం గ్రాండ్ వద్ద మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుతో భేటీ అయి పాదయాత్ర పునః ప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 22వ తేదీ నాటికి యువగళం వలంటీర్లంతా మామిడికుదురు మండలం పాశర్లపూడిలోని సైట్ వద్ద రిపోర్టు చేయాల్సిందిగా పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం. నేటి వరకు సైట్‌లో నిలిపి ఉన్న యువగళం వాహనాలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాటిని సిద్ధం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. జనసేన నేతలు కూడా సహకారం అందించనున్న నేపథ్యంలో యాత్రను గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా అధికార వైసీపీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాలనేది టీడీపీ వ్యూహం. గతంలో టీడీపీ పాదయాత్ర విశాఖపట్నంలో ముగియడంతో అదే తరహాలో యువగళం పాదయాత్రకు కూడా అక్కడే ముగింపు పలకాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నట్టు సమాచారం. తొలుత శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది.