Share News

గడప..గడపకూ మందు!

ABN , First Publish Date - 2023-10-30T00:41:11+05:30 IST

ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మకాలు విచ్చల విడిగా సాగుతుండడంతో ప్రభుత్వం ‘గడప గడపకూ మద్యం’ పథకం ఏమైనా తీసుకొచ్చిందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి ఆ ప్రశ్నకు భిన్నంగా ఏమీ కనిపించడం లేదు.

గడప..గడపకూ మందు!

జిల్లా వ్యాప్తంగా 158 షాపులు

అమ్మకాలకు ప్రభుత్వ టార్గెట్లు

విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం

జంక్షన్లలో బెల్ట్‌ షాపులు

వీధుల్లో సారా వాసన

మందుబాబుల జేబు గుల్ల

అడ్డుకట్టవేయని అధికారులు

అడపాదడపా కేసులు

చితికిపోతున్న చిరు కుటుంబాలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మకాలు విచ్చల విడిగా సాగుతుండడంతో ప్రభుత్వం ‘గడప గడపకూ మద్యం’ పథకం ఏమైనా తీసుకొచ్చిందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి ఆ ప్రశ్నకు భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. ఒకాయన చుట్టాలింటికి వచ్చాడు. ఆయనకు మద్యం అలవాటు ఉంది. అలా బయటకు వచ్చి స్థానికుడిని ‘ఇక్కడ బ్రాందీ షాపు ఎక్కడ’ అని అడి గాడు. బ్రాందీషాపు కావాలంటే కొద్దిగా దూరం వెళ్లాలి. ఈ పక్కన కిళ్లీ కొట్టు(బెల్టు షాపు) ఉంటుంది. దానిలో మందు దొరుకుతుందని సెలవిచ్చాడు. అతగాడు వెళ్లి నిబ్బుపై ఓ ముప్పై అదనంగా చెల్లించి.. అక్కడే సోడా, వాటర్‌ ప్యాకెట్‌ కొనుక్కొని కానిచ్చేశాడు. ఇలా.. సందుల్లోసారా దుకాణాలు కొన్ని బెల్ట్‌షాపులుగా రూపాంతరం చెంది పరివర్తన పక్కదారి పట్టడంపై మహిళలు భగ్గుమంటున్నారు. మద్య నిషేధం అంటే ఇంటి పక్కనే మందు దొరకడమా? అని ప్రశ్నిస్తున్నారు. దశలవారీగా మద్య నిషేధం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం.. నిషేధం దేవుడెరుగు.. ఎక్కడపడితే అక్కడ మద్యం ఏరులుగా పారిస్తోందం టూ మండిపడుతున్నారు.మద్యం అమ్మకాలు మూడు ధరల్లో నడుస్తు న్నాయి.క్వార్టరు బాటిల్‌ ప్రభుత్వ మద్యం దుకాణంలో రూ.200..అదే క్వార్టరు బెల్టుషాపులో రూ.230-240,బార్‌లో అయితే రూ.260-270కి అమ్ముతు న్నారు.గత ప్రభుత్వంలో లైసెన్స్‌ పొందిన బ్రాందీ షాపు లో అదే క్వార్టరు రూ.120కే దొరికేది.జిల్లాలో నెలకు సరా సరి రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. సారా అమ్మకాలు అదనం.

సందూ..గొందూ మందు..

మద్యం అమ్మకాల ద్వారా ఆదాయంపై తీవ్రంగా దృష్టి సారిస్తున్న ప్రభుత్వం టార్గెట్లు పెట్టి మరీ ఎక్సైజ్‌ శాఖపై ఒత్తిడి పెంచుతోంది.తద్వారా జనాలతో పూటుగా తాగిస్తోంది. జిల్లావ్యాప్తంగా 19 మండలాల్లో 137 మద్యం దుకాణాలు, 21 బార్లు ఉన్నాయి. వీటిలో అధికంగా జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలోనే ఉన్నా యి. ఇవి చాలవన్నట్లుగా వాక్‌ ఇన్‌ స్టోర్స్‌ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు వీటికి బెల్టుషాపులు జతకలిశాయి. గతంలో మందు కావాలంటే ప్రభుత్వం లైసెన్స్‌ ఇచ్చిన షాపునకు వెళ్లి కొనుక్కోవాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గడప గడపకూ మందు అందాలన్నదే జగన్‌ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణం.. వాక్‌ఇన్‌ స్టోర్స్‌.. బార్లు.. ఆ పది అడుగులు వేసే వర కూ కూడా నాలుక ఓపిక పట్టదనుకుంటే ఇంటి సమీపంలోనే బెల్టు షాపు. అక్కడి బ్రాండ్లు కొనుక్కొ నేంత డబ్బులు లేవంటే దగ్గలోరే సారాయిదుకాణం. ఇవన్నీ కలుపుకొంటే జిల్లాలో సారాయి దుకాణాలు, బెల్టుషాపులు కలిపి వందల్లో నడుస్తున్నాయి.

గుప్పుమంటున్న సారా..

సారా విచ్చలవిడిగా లభ్యమవుతోంది. ఒక్కో ప్రాంతా నికి నాలుగైదు సారా దుకాణాలను నడుపుతున్నారు. అధికశాతం సారా దుకాణాలు బెల్టు షాపుల్లో నడుస్తు న్నాయి. అవకాశం ఉన్న చోట్ల సారా తయారీ జరుగుతోంది. రాత్రిపగలు తేడా లేకుండా దుకాణాలకు తరలిస్తున్నారు. ఇటీవల పోలీసులు గోదావరి లంకల్లో ఏకంగా 6 వేల లీటర్ల బెల్లపు ఊట స్వాధీనం చేసు కున్నారు. పోలీసులు వెళ్లిన ప్రదేశంలో ఏకంగా సారా తయారీని ఓ కుటీర పరిశ్రమ మాదిరిగా నడుపుతు న్నారు. పోలీసులు పట్టుకున్న 6 వేల లీటర్ల బెల్లపు ఊట అతి స్వల్పం మాత్రమేనని చెబుతున్నారు.ఇంత పెద్ద ఎత్తున తయారవుతున్న సారా ఊళ్లలోకి వచ్చి చేరు తోం ది.ఒకవైపు ప్రభుత్వ నాణ్యత లేని మద్యం వల్ల ఆరోగ్యా లు నాశనమవుతున్నాయి.దానికి సారా మరింత ఆజ్యం పోస్తోంది. సారాను దాదాపుగా నిర్మూలించేశామని స్పెష ల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికా రులు గొప్పగా చెబుతున్నా పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.

సారాకు దారి చూపిన ప్రభుత్వం

గత ప్రభుత్వంలో సారాకు అడ్డుకట్ట వేయడానికి గట్టి ప్రయత్నాలు జరిగాయి. దానిలో భాగంగా చీఫ్‌ లిక్కర్‌ పేరుతో క్వార్టర్‌ రూ.60కే అందుబాటులోకి తెచ్చారు. దీంతో చాలా మటుకు సారా తగ్గింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. మద్యం ధరలను విపరీతంగా పెంచేసింది. చీఫ్‌ లిక్కర్‌ క్వార్టరు ఏకంగా రూ.150 చేసేసింది. అంటే మూడు రెట్లు పెంచేసింది. దీంతో జనం మళ్లీ సారావైపు మళ్లారు. సారా అమ్మకాలు పుంజుకోవ డంతో తయారీదారులు ఎక్కువయ్యారు. ఇలా సారా వాడకం పెరగడానికి ప్రభుత్వం పరో క్షంగా మార్గం వేసింది.క్రమంలో వీధుల్లో సారా దుకాణాలు తిరిగి తెరుచుకు న్నాయి.గతంలో సారా ప్యాకెట్‌ రూ.10లు ఉండేది..చీఫ్‌ లిక్కర్‌ ధర పెరగ డంతో ప్యాకెట్‌ రూ.50లకు విక్రయిస్తున్నట్టు సమాచారం.

బెల్ట్‌షాపులకు మద్యం ఎక్కడిది..

బెల్టు షాపుల్లో మద్యం ఎలా దొరుకుతుందనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగులుతోంది. తయారీ కం పెనీల నుంచి ప్రభుత్వ మద్యం డిపోలకు అక్కడ నుంచి బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాలకు సర ఫరా జరుగుతోంది. అంటే బెల్టు షాపులకు బార్లు లేదా ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచే మందు సరఫరా జరుగుతుండాలి.ప్రభుత్వ మద్యం దుకా ణాల నుంచి క్వార్టరుపై రూ.10 అదనంగా వేసుకొని బెల్టు షాపులకు అమ్ముతున్నారనేది బహిరంగ రహ స్యం.ఈ నేపథ్యంలో బెల్టు షాపులకు కూడా లైసె న్సులు ఇచ్చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తే జనాలను మరింతగా తాగించి సర్కారు ఆదాయం రెట్టింపు చేసుకోవచ్చని మహిళలు ఎద్దేవా చేస్తున్నారు.

మందుబాబుల వీరంగం

ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు అధికశాతం జనసంచారం ఎక్కువగా ఉండే రోడ్ల పక్కనే ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వీధుల్లోని చిన్నపాటి బడ్డీల వద్దా బహిరంగంగానే తాగేస్తున్న మద్యపాన ప్రియులు.. ఆపై వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో మహిళలు, వృద్ధులు ముఖ్యంగా స్కూలు పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బెల్టు షాపులు, సారాయి దుకాణాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధికార పార్టీ వాళ్లతో లింకులు ఉండడంతో అధికారులు కన్నెత్తి చూడలేని దుస్థితి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలకు సమయం ఉన్నా.. సారాయి దుకాణాలు, బెల్టుషాపులకు సమయమంటూ ఏమీ విధించలేదు. దీంతో నిషేధం మాట దేవుడెరుగు 24 గంటలూ మందు అందుబాటులో ఉంటుంది.

మహిళాలోకం మండిపాటు

ఇంటికి దగ్గరలోనే బెల్టుషాపులు ఉండడం, సారా ఎక్కడపడితే అక్కడ దొరుకుతుండడంపై మహిళాలోకం భగ్గుమంటోంది. ఇప్పటికే ప్రభుత్వ మద్యం ధరలు సంసారాలను గుల్ల చేస్తుంటే.. బెల్టులు, సారా వల్ల ఇంటి యజమాని ప్రాణాలు పోయే దుస్థితి దాపురిస్తోందని ఆవేదన చెందుతోంది. చాలాచోట్ల అమ్మకందారులను మహిళలు నిలదీస్తున్నా.. దుకాణాల వెనుక అధికార పార్టీ నాయకులు ఉండడంతో బెదిరింపులతో వారి నోరు నొక్కేస్తున్నారనే ఆరోపణలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

Updated Date - 2023-10-30T00:41:11+05:30 IST