‘నాడు-నేడు’ ఏనాటికో
ABN , First Publish Date - 2023-06-26T00:58:37+05:30 IST
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా పాఠశాలలను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారడమే కాకుండా విద్యార్థులకు ప్రాణ శంకటంగా మారింది.
చినకొండేపూడిలో హైస్కూల్లో పూర్తి కాని పనులు
నిర్మాణానికి పిల్లర్లు వేసి వదిలేసిన వైనం
నిధుల విడుదలో ఆలస్యమే కారణమంటున్న అధికారులు
సీతానగరం, జూన్ 25: కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా పాఠశాలలను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారడమే కాకుండా విద్యార్థులకు ప్రాణ శంకటంగా మారింది. నిధులు ఆలస్యంగా విడుదల కావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. సీతానగరం మండలం చినకొండేపూడిలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌కు రూ.1.23 కోట్లు నాడు-నేడు పథకంలో మంజూరయ్యాయి. దీంతో పాత పాఠశాల భవనాల మరమ్మతులు, గ్రిల్స్ ఏర్పాటు, టైల్స్ తదితర పనులతో పాటు 5 నూతన తరగతి గదుల నిర్మాణం చేయవలసి ఉంది. అయితే ఇంతవరకు పూర్తిస్థాయిలో నిధులు మంజూరు కాకపోవడంతో నూతన భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల వల్ల పాఠశాలలోకి వెళ్లేందుకు సరైన దారి లేదు. పాత భవనానికి కొద్ది పాటి స్థలం నడకకు వదిలేసి పెద్ద గొయ్యి తీసి పిల్లర్లు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు యీ గోతిలో పడే ప్రమాదం ఉందని పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు కుర్చీలు, బెంచీలు వచ్చినా పూర్తిస్థాయిలో రాలేదు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు ముఖ్యమని చెబుతున్నా పాఠశాలలో ఉన్న కొద్దిపాటి స్థలంలో నూతన తరగతి భవన నిర్మాణాలు చేపట్టడంతో విద్యార్థులకు ఆటవిడుపు లేకుండా పోవడమే కాకుండా ప్రమాదకర వాతావరణం నెలకొనడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయమై సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జగదీష్‌ను వివరణ కోరగా నిధులు ఆలస్యంగా విడుదల కావడంతో పనులు ఆలస్యమయ్యాయని, ప్రస్తుతం పిల్లర్లు వేస్తున్నారని త్వరలోనే పనులు పూర్తిచేస్తామన్నారు. ఈ విషయమై పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం ఎల్‌ఎస్ కృష్ణారావును వివరణ కోరగా.. నిధులు ఆలస్యంగా విడుదల కావడంతో భవన నిర్మాణాలు ఆలస్యమయ్యాయని, కాగా పాఠశాల మరమ్మతులు, గ్రిల్స్ తదితర పనులు పూర్తిచేశారని చెప్పారు.