కూరలు చౌక

ABN , First Publish Date - 2023-03-31T00:50:24+05:30 IST

కూరగాయల ధరలు దాదాపుగా దిగొచ్చాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని అన్ని రైతుబజార్లలోనూ కూరగాయలు కాస్త చౌకగానే లభిస్తున్నాయి.

కూరలు చౌక
కూరగాయల దుకాణం

రైతు బజార్లలో అందుబాటులో లభ్యం

బహిరంగ మార్కెట్‌లో దోపిడీ 8 కిలోకి రూ.30పైనే పెంపు

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 30 : కూరగాయల ధరలు దాదాపుగా దిగొచ్చాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని అన్ని రైతుబజార్లలోనూ కూరగాయలు కాస్త చౌకగానే లభిస్తున్నాయి. ఒకటి, రెండు రకాలు మినహా చాలా రకాల అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. సామాన్యులతో పాటు మధ్యతరగతి ప్రజల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. కేరట్‌, బీట్‌రూట్‌ ధరలు గణనీయంగా పడిపోయాయి. కేరట్‌ (బెంగుళూరు రకం) కిలో రూ.20లకు, బీట్‌రూట్‌ (హైదరాబాద్‌ రకం) కిలో రూ.20లకు లభిస్తున్నాయి. టమోటాలు దేశవాళీ పెద్దవి కిలో రూ.15, చిన్నవి రూ.12లకు విక్రయి స్తున్నారు. దొమ్మేరు రకంతో సహా అన్ని రకాల వంకాయల ధరల్లోనూ పెరుగుదల లేదు. కొద్దిరోజుల కిందట వరకూ కూరగాయల ధరలు భారీగా ఉండడంతో కొనడానికి సామాన్యులు బెంబేలెత్తేవారు. వేసవి ఎండలు ముదరడంతో ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తమైనా అనూహ్యంగా ధరలు పతనం కావడంతో కూరగాయల వ్యాపారుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందనేదానిపై స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. రైతుబజార్లలో కూరగాయల ధరలు దిగొచ్చినా బహిరంగ మార్కెట్లో మాత్రం ధరల దోపిడీ కొనసాగుతూనే ఉంది. రైతు బజార్ల ధరలతో పోల్చితే కిలోకు రూ.20 నుంచి రూ.30ల వరకూ అదనంగా ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. బీరకాయలు కిలో రూ.80లకు విక్రయిస్తున్నారు. టమోటా రూ.30, వంకాయలు రూ.40, పచ్చిమిర్చి రూ.40, కేరట్‌ రూ.40 ఇలా కూరగాయలన్నీ సామాన్యులకు అందనంతగా ధరలు పెంచి విక్రయాలు చేస్తున్నారు.

రైతు బజార్లలో ధరలిలా..

రైతు బజార్లలో వంకాయల ధరలు గత కొన్నాళ్లుగా నిలకడగానే కొనసాగుతున్నాయి. కిలోల లెక్కన ధరలు ఇలా ఉన్నాయి. వంకాయలు (జాళ్లు) కిలో రూ.14, గులాబీ (సర్పవరం), తెలుపు (చార) రూ.16, దొమ్మేరు రూ.22లకు విక్రయిస్తున్నారు. బెండకాయలు రూ.32, పచ్చిమిర్చి సన్నాలు రూ.28, కాకరకాయ రూ.28, కాలీ ఫ్లవర్‌ రూ.18, క్యాబేజీ రూ.14, దొండకాయ లోకల్‌ రూ.28, కీరదోస రూ.20, బొబ్బర్లు రూ.20, దోసకాయ(కేజీ) రూ.22, బంగాళాదుంపలు రూ.17, పొట్లకాయ రూ.15, ఆనబకాయ రూ.8లకు విక్రయిస్తున్నారు. ఇక ఉల్లిపాయలు కూడా కిలో రూ.15లకే దొరుకుతున్నాయి. ఒక్క బీరకాయల ధర మాత్రం కాస్త ఎక్కువగా ఉంది. బీరకాయలు కిలో రూ.44లకు విక్రయిస్తున్నారు. గోరుచిక్కుళ్లు రూ.36లకు, పెండలం రూ.32, క్యాప్సికం రూ.48, బీన్స్‌ గింజలు రూ.100, బీన్స్‌ కాయలు రూ.60,కంద రూ.40, కణుపు చిక్కుళ్లు రూ.84, చేమదంపలు రూ.50లకు విక్రయిస్తున్నారు. రైతుబజార్లలో కూరగాయల నాణ్యత కూడా బాగానే ఉండడంతో అనేక మంది రైతుబజార్లను ఆశ్రయిస్తున్నారు.

ఎండలు ముదిరితే ధరలు పెరిగే ఛాన్స్‌ ...

కూరగాయల ధరలు చాలా వరకూ తగ్గాయి. వారం, పదిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నాం. బీరకాయలు, బెండకాయలు మినహా చాలా రకాలు అందుబాటులో దొరుకుతున్నాయి. బీరకాయలు లోకల్‌గా దిగుబడిలేదు. అందుకే ధర కాస్త ఎక్కువ. దొమ్మేరులో వంకాయల సాగు పెద్దఎత్తున ఉంది. దిగుబడులు పెరిగి ధరలు నిలకడగా ఉన్నాయి. టమోటా సీజన్‌ అయిపోవస్తోంది. వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. బెంగుళూరు (ఊటీ) కేరట్‌ తగ్గి, హైదరాబాద్‌ కేరట్‌ అందుకోవడంతో మార్కెట్‌ డౌన్‌ అయ్యింది. ఎండలు ముదిరితే ధరలు పెరిగే అవకాశం ఉంది.

- ఆర్‌.శ్రీనివాసరావు, క్వారీ మార్కెట్‌ రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారి

Updated Date - 2023-03-31T00:50:24+05:30 IST