Share News

సంప్రదాయబద్ధంగా నాగుల చవితి

ABN , First Publish Date - 2023-11-18T00:18:09+05:30 IST

నాగులచవితి పర్వదినాన్ని శుక్రవారం గ్రామాల్లో సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.

సంప్రదాయబద్ధంగా నాగుల చవితి

దివాన్‌చెరువు. నవంబరు 17: నాగులచవితి పర్వదినాన్ని శుక్రవారం గ్రామాల్లో సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా పుట్టలవద్దకు భక్తులు చేరుకుని పుట్టల వద్ద పసుపు కుంకుమలతో పూజలుచేసి తమ వెంట తెచ్చిన చలిమిడి, చిమ్మిలి, బుర్రగుంజు, గుడ్లు, ఆవు పాలను పుట్టల్లో వేశారు. చిన్నారులు పుట్టలవద్ద బాణసంచా కాల్చారు. రాజ మహేంద్రవరం వాసులు దివాన్‌చెరువు పుష్కరవనం పరిస రాల్లో పుట్టలవద్దకు తమ కుటుంబ సభ్యులతో కలసి వచ్చి పుట్టల్లో పాలు పోశారు.

రాజానగరం: కార్తీక మాసంలో వచ్చే నాగులచవితి పర్వ దినాన్ని శుక్రవారం మండలంలో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ద లతో జరుపుకున్నారు. భక్తులు వేకువ జామునే తలంటు స్నానమాచరించి పుట్టల వద్దకు చేరుకుని పుట్ట చుట్టూ ముగ్గులు వేసి అందంగా అలంకరించి నాగేంద్రుడిని ప్రార్ధిస్తూ పూజలు నిర్వహించారు.

అనపర్తి: దీపావళి తరువాత వచ్చే నాగుల చవితి వేడుకలను శుక్రవారం అనపర్తి మండలంలో భక్తులు ఘనంగా నిర్వహించారు. అనపర్తిలోని వీర్రాజు మామిడివద్ద గల పాముల పుట్టకు అధిక సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించి కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీర్రాజు మామిడివద్ద ఉన్న సుబ్రహ్మ ణ్యేశ్వరస్వామి ఆలయంలో వచ్చే షష్ఠి వేడుకల సందర్భంగా ముద్రించి న పోస్టర్‌ను దాతలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తమలంపూడి వీర్రాఘవ రెడ్డి, కర్రి సుధాకరరెడ్డి, మండ పోతారెడ్డి, మండ రామారెడ్డి, తేతలి వీర్రెడ్డి పాల్గొన్నారు.

కోరుకొండ: పవిత్ర కార్తీకమాసం నాగుల చవితి పర్వదినం సందర్భంగా శుక్రవారం మండలంలోని పలుగ్రామాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పుట్టల వద్దకు వెళ్లి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు సుబ్మహణ్యేశ్వరిస్వామివద్ద పూజలు చేశారు.

మోతుగూడెం, నవంబరు 17: నాగుల చవితి పర్వదినాన పురస్కరించుకుని గ్రామాల్లో సందడి నెలకొంది. నాగేంద్ర స్వామికి పూజలు చేసి సమీపంలోని పుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. నాగుల చవితి రోజున పూజలు నిర్వహిస్తే సర్వరోగాలు, ఆరోగ్యదోషాలు తొలుగుతాయని భక్తుల విశ్వా సం. దీంతో ఆలయాల ప్రాంగణాల్లో గల నాగుపాముల ప్రతిమలకు పాలాభిషేకం నిర్వహించారు.

వై.రామవరం: నాగులచవితిని పురస్కరించుకుని శుక్రవారం మండలంలో పలుచోట్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు భక్తులు గ్రామశివార్లలో ఉన్న పుట్టల వద్దకు చేరుకుని పాలు,గుడ్లు వేసీ పూజలు చేశారు. టపాసులు పేల్చి సందడి చేశారు.

అడ్డతీగల: ఏజన్సీ ప్రాంతమైన అడ్డతీగలలో శుక్రవారం నాగులచవితిని పురస్కరించుకొని ప్రజలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారులో, ఆలయ ప్రాంగణాలలో ఉన్న పుట్టలకు ముస్తాబు చేసి నాగేంద్రుడికి పాలు, ప్రసాదాలు సమర్పించారు. అనంతరం బాణాసంచా కాల్చి చిన్నారులు ఆనందించారు.

కూనవరం: మండలంలోని నాగులచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు నాగుల చవితి సందర్భంగా శివాలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం పుట్టల దగ్గరకు వెళ్లి పాలు నైవేథ్యాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-18T00:18:11+05:30 IST