నేడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా

ABN , First Publish Date - 2023-09-04T00:21:24+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆ పార్టీ నగర కార్యదర్శి బి.పవన్‌ అన్నారు.

నేడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా
వై.జంక్షన్‌ రైతుబజారు ఎదుట కరపత్రాలతో ప్రచారం నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

  • రైతుబజార్ల వద్ద సీపీఎం కరపత్ర ప్రచారం

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆ పార్టీ నగర కార్యదర్శి బి.పవన్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం రాజమహేంద్రవరం వై.జంక్షన్‌లోని రైతు బజారు వద్ద ప్రజలకు కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్‌ఛార్జీలను పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఇప్పుడు ప్రజలపై మోయలేని విద్యుత్‌ఛార్జీల భారం వేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో ఎనిమిది సార్లు విద్యుత్‌ఛార్జీలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. మరోపక్క పాలు, బియ్యం, కందిపప్పు, ఇతర నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి సామాన, మధ్యతరగతి ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చేనాటికి గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.450 ఉండేదని, ధర దశలవారీగా పెంచుతూ రూ.1200కు చేరిందన్నారు. ఇటీవల కంటితుడుపు చర్యగా రూ.200 తగ్గించడం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రాజులోవ, పోలిన వెంకటేశ్వరరావు, ఐ.సుబ్రహ్మణ్యం, పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:21:24+05:30 IST